తణుకు అర్బన్ : కూటమి ప్రభుత్వం ప్రజలకు స్కీమ్‌లు అందించడం మానేసి రకరకాల స్కామ్‌ల పేరుతో ప్రజాధనాన్ని దోచుకుంటోందని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శించారు. బీసీ వర్గాలకు కుట్టుమెషీన్ల పంపిణీ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం భారీ స్కామ్‌కు తెరతీసిందని దుయ్యబట్టారు. శుక్రవారం తణుకు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కుట్టుమెషీన్ల కొనుగోళ్లు, శిక్షణకు ప్రభుత్వం నిర్ణయించిన ధరల్లో భారీ వ్యత్యాసం ఉందని, ఇది రూ.150 కోట్లకుపైగా స్కామ్‌గా తెలుస్తుందన్నారు. ఒక్కో లబ్ధిదారుకు మెషీన్ కొనుగోలు, శిక్షణకు సంబంధించి రూ.23 వేల చొప్పున కేటాయించడం దోపిడీకి నిదర్శనంగా నిలుస్తోందన్నారు. ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమాన్ని వదిలేసి దోచుకో దాచుకో అనే రీతిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందన్నారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్ విద్యుత్ యూనిట్‌ను రూ.2.49లకు కొనుగోలు చేస్తే నేడు చంద్రబాబు రూ.4.60 కొనుగోలు చేయడం కూడా అతి పెద్ద కుంభకోణమని మండిపడ్డారు. అమరావతిలో కూడా ఇదే తరహాలో నిర్మాణ పనుల్లో కోట్లాది రూపాయలు దోపిడీకి దిగారని విమర్శించారు. అందినకాడికి ప్రజాధనాన్ని దోచుకుని సంపద సృష్టించుకునే పనిలో చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తుందని దుయ్యబట్టారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ శ్రీదేవికి కుట్టుమెషీన్ల స్కామ్‌పై సీబీఐతో విచారణ చేయించాలని వినతిపత్రాన్ని అందజేశారు. ముందుగా సజ్జాపురంలోని పార్టీ కార్యాలయం నుంచి మోటారు సైకిళ్లపై ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారాం, ఎంపీపీ రుద్రా ధనరాజు, లీగల్ సెల్ సభ్యులు వెలగల సాయిబాబారెడ్డి, పెన్మెత్స సుబ్బరాజు, పొట్ల సురేష్, జల్లూరి జగదీష్, మెహర్ అన్సారీ, కొప్పిశెట్టి దుర్గాప్రసాద్, నూకల కనకదుర్గ, ఉండవల్లి జానకి, జంగం ఆనంద్‌కుమార్, పెనుమాక రాజేష్, గెద్దాడ శ్రీకాంత్, వడ్డి మార్కండేయులు, పుల్లెపు సూర్యచంద్రరావు, రంభ నాగేశ్వరరావు, బిరుదుకోట చింతన్న, చింతాడ సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి కారుమూరి