
12న యూటీఎఫ్ నిరసన
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : విద్యాశాఖలో నెలకొ న్న సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 12న జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఆ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ రుద్రాక్షి తెలిపారు. ఈ మేరకు ముందస్తు నోటీసును శుక్రవారం ఎం.వెంకట లక్ష్మమ్మకు అందజేశారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.సుభాషిణి, జిల్లా కోశాధికారి జీవీ రంగమోహన్, జిల్లా కార్యదర్శి నంబూరి రాంబాబు, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ బి.మోహన్‌రావు, జిల్లా మీడియా కన్వీనర్ ఎండీ జక్రియ పాల్గొన్నారు.
కొనసాగిన సీహెచ్‌ఓల సమ్మె
ఏలూరు (టూటౌన్) : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత 12 రోజులుగా సమ్మె చేస్తున్నా ఇంతవరకు ఏ ఒక్క అధికారి, ప్రభు త్వం స్పందించకపోవడం బాధాకరమని సీహెచ్‌ఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు కలెక్టరేట్ వద్ద శుక్రవారం యోగాసనాలతో నిరసన కొనసాగించారు. జిల్లావ్యాప్తంగా పెద్ద సంఖ్యలో సీహెచ్‌ఓలు పాల్గొన్నారు.
2.30 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు
ఏలూరు(మెట్రో) : రైతులు ధాన్యాన్ని దళారుల ప్రమేయం లేకుండా రైతు సేవా కేంద్రాల ద్వారా రైసు మిల్లులకు తరలించవచ్చని జిల్లా పౌర సరఫరాల మేనేజర్ పీఎస్‌ఆర్ మూర్తి తెలిపారు. జిల్లాలో రైతులకు 57,50,574 గోనె సంచులను సరఫరా చేసి రూ.501.81 కోట్ల విలువైన 2.30 లక్షల టన్నుల ధాన్యాన్ని 17,512 మంది నుంచి సేకరించామన్నారు. ఈ మేరకు రూ.398.52 కోట్లను రైతుల ఖాతాలకు జమచేశామన్నారు. రైతు సంఘాలు, రైతుల విజ్ఞప్తి మేరకు జిల్లాకు 2.70 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించామన్నారు.
ఆపరేషన్ సిందూర్ చరిత్రాత్మకం
నూజివీడు: పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రవాద శిబిరాలపై భారత త్రివిధ దళాలు నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ చరిత్రాత్మకమైనదే కాకుండా సాహసోపేత చర్య అని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. నూజివీడులో శుక్రవారం ఆయన మాట్లాడుతూ పహల్గాంలో పర్యాటకులపై దాడి చేసి 26 మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదుల శిబిరాలపై భారత సైన్యం కచ్చితమైన దాడులు చేసి ధ్వంసం చేసిందన్నారు. దీని ద్వారా భారతదేశం ఉగ్రవాదంపై ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో మరోసారి స్పష్టమైందని చెప్పారు. భారత సైనికుల ధైర్య సాహసాలు యువతలో దేశభక్తిని మరింత పెంచాయన్నారు. కేంద్ర ప్రభుత్వం త్రివిధ దళాల అధిపతులతో కలసి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ప్రజలంతా అండగా నిలవాలని మంత్రి కోరారు.
డీఎస్సీకి ఉచిత శిక్షణ
భీమవరం: జిల్లాలోని బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీలకు డీఎస్సీ పరీక్షలకు ఉచిత ఆన్‌లైన్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు బీసీ సంక్షేమ సాధికారత అధికారి జీవీఆర్‌కేఎస్‌ఎస్ గణపతిరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు భీమవరం కలెక్టరేట్‌లోని జి ల్లా బీసీ సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు.

12న యూటీఎఫ్ నిరసన