
‘సాక్షి’పై దాడులు అమానుషం
ఏలూరు (టూటౌన్): ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్‌గా ఉన్న మీడియాపై దాడులకు దిగడం అమానుషమని సీపీఐ కార్యదర్శివర్గ సభ్యుడు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి డేగ ప్రభాకరరావు అన్నారు. ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి ఇంటిపై పోలీసుల దాడులు పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించడమే అని అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వాలు–ప్రజలకు మధ్య వారధిగా ఉండే మీడియా, దాని ప్రతినిధులపై కక్ష పూరితమైన చర్యలకు దిగడం తగదన్నారు. తమకు వ్యతిరేకంగా వార్తలు రాశారనో, అవినీతిని బయట పెడుతున్నారనో అక్కసుతో సోదాల పేరుతో పత్రికా ప్రధాన సంపాదకుడి ఇంటిపై దాడులకు తెగబడటం అత్యంత హేయమైన చర్య అని అభివర్ణించారు. ఇటువంటి చర్యలకు దిగిన పోలీసులను నియంత్రించాల్సిన కూటమి ప్రభుత్వం వారిని ఉసిగొల్పేలా వంత పాడటం సరికాదన్నారు.
మూల్యం చెల్లించుకోక తప్పదు
మీడియా సంస్థలు, వాటి ప్రతినిధులపై కక్ష పూరితంగా వ్యవహరిస్తే కూటమి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ప్రభాకర్ మండిపడ్డారు. రాజ్యాంగబద్ధ హక్కులను కాలరాయడం తగదని, ఇందుకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏదైన పొరపాటు జరిగితే న్యాయబద్ధంగా వ్యవహరించాలే తప్ప దౌర్జన్యకర చర్యలకు దిగడం ఎంతమాత్రం సరికాదన్నారు. ఇది జర్నలిజానికే మాయని మచ్చ అని, ఇలాంటి సంఘటనలు మున్నెన్నడూ చూడలేదన్నారు. ఇది పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిగానే భావించాల్సి ఉంటుందని, మేధావులు, వివిధ సంఘాల నాయకులు, పార్టీలు ముక్తకంఠంతో ఖండించాలని కోరారు. పాలకులు పోలీసు వ్యవస్థను చేతిలోకి తీసుకుని తమకు నచ్చని వారిపై సోదాలు, కేసుల పేరుతో వేధింపులకు దిగడం సరైన చర్య కాదని, రాష్ట్రంలోని ప్రజలంతా కూటమి ప్రభుత్వ చర్యలను గమని స్తున్నారని, సరైన సమయంలో గుణపాఠం చెబుతారని ప్రభాకర్ అన్నారు.