
ఆక్వాకుఆక్సిజన్ గండం
గణపవరం: పూటకోరకంగా మారుతున్న వాతావరణం ఆక్వా సాగుకు గండంగా మారింది. ఇటీవల దారుణంగా పడిపోయిన చేపలు, రొయ్యల ధరలు పెరిగి ఆక్వారంగం కొద్దిగా కుదుట పడుతున్న సమయంలో పదిరోజులుగా వాతావరణ మార్పులు రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. విపరీతమైన ఎండలు ఒకపక్క, మబ్బులు కమ్మి, వర్షం జల్లులు మరోపక్క ఆక్వా సాగును కుదేలు చేస్తున్నాయి. ఈ సమస్యలకు తోడు ఎడా పెడా విధిస్తున్న విద్యుత్ కోతలు ఆక్వా రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. విద్యుత్ కోతల కారణంగా ఏరియేటర్లు తిరగడానికి ఆయిల్ ఇంజన్లు సిద్ధం చేసుకుంటున్నారు. ఆయిల్ ఇంజన్‌ల వినియోగానికి రోజూ వేలల్లో డీజిల్ కొనుగోలు చేయాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అర్ధాంతరంగా చేపలు, రొయ్యల పట్టివేత
ఎండకాస్తే విపరీతమైన ఉక్కబోత.. అప్పటికప్పుడు ఉన్నట్టుండి ఎండమాయమై, మబ్బులు కమ్మి ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోవడంతో ఆక్వా చెర్వులలో ఆక్సిజన్ సమస్య తలెత్తి చెర్వులలో చేపలు రొయ్యలు మూతులు పైకెత్తి నీటి ఉపరితలంపై అసహనంగా తిరుగాడుతున్నాయి. కొన్నిచోట్ల చేపలు, రొయ్యలు చనిపోయి నీటిపై తేలుతున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి రైతులు నిరంతరం చెర్వులలో ఏరియేటర్లు తిప్పుతున్నారు. చెర్వులలో ఇంజన్లు వేసి నీటిని రీసైక్లింగ్ చేస్తూ, నిరంతరం నీటిలో కదలిక తేవడం వల్ల ఆక్సిజన్ సమస్యను కొంతవరకూ అధిగమిస్తున్నారు. ఆక్సిజన్ లోటు పూడ్చడానికి రసాయనాలు చల్లుతున్నారు. ఆక్సిజన్ అందక చేపలు, రొయ్యలు మేతలు సరిగా తినలేక నీరసించి పోతుండటంతో రైతులు యుద్ధప్రాతిపదికన పట్టివేసి అయినకాడికి అమ్ముకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 1.25 లక్షల ఎకరాల్లో రొయ్య, మరో 1.50 లక్షల ఎకరాల్లో చేపలసాగు జరుగుతుంది. వాతావరణం ప్రతికూలంగా మారడంతో నియోజకవర్గంలో దాదాపు నాలుగువేల ఎకరాలలో చేపలు, రొయ్యలు అర్ధాంతరంగా పట్టివేసినట్లు అంచనా.
నిరంతరం ఏరియేటర్లు తిప్పాలి
చెరువులలో ఉష్ణోగ్రతలు తగ్గకుండా నిరంతరం ఏరియేటర్లు తిప్పుతూ నీటిని రీసైక్లింగ్ చేయాలని మత్స్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఆక్సిజన్ లోపనివారణకు పొటాషియం పర్మాంగనేటు సిద్ధంగా ఉంచుకుని, అవసరం మేరకు చెర్వులో చల్లుతుండాన్నారు. ఆక్సిజన్ సరిపడా అందకపోవడంతో చేపలు, రొయ్యలు మేతలు సరిగా తినని కారణంగా పరిమితంగా మేతలు వేస్తుండాలని, ఆక్సిజన్ సమస్య ఉన్న సమయంలో చెర్వులలో మేత, సేంద్రియ ఎరువులను వేయడం పూర్తిగా మానివేయాలని సూచించారు.
విపరీతమైన ఎండలు, అకాల వర్షాలతో అనర్థం
ఒక పక్క ఉక్కబోత... మరో పక్క విద్యుత్‌కోత

ఆక్వాకుఆక్సిజన్ గండం

ఆక్వాకుఆక్సిజన్ గండం