
వైభవంగా వాసవీ మాత జయంత్యుత్సవం
పెనుగొండ: అఖిల భారత శ్రీవాసవీ పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని వాసవీ శాంతిథాంలో వాసవీ మాత జయంతి ఉత్సవాలను బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతీ స్వామిజీ(బాలా స్వామి) పర్యవేక్షణలో పతాకావిష్కరణ, గోపూజలు నిర్వహించి జయంతి ఉత్సవం ప్రారంభించారు. మరకత శిల వాసవీ మాతకు అభిషేకాలు, విశేష పూజలు, సామూహిక లక్షపుష్పార్చన నిర్వహించారు. వాసవీ మాల దారులు హోమాలు నిర్వహించి అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకొన్నారు. స్థానిక బజారు రామాలయం నుంచి శ్రీనగరేశ్వర మహిషాసుర మర్ధనీ వాసవీ కన్యకపరమేశ్వరి ఆలయం వరకూ అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించారు. మహిళలు కలశాలతో మూలవిరాట్ వాసవీమాత వద్దకు చేరుకొని అభిషేకాలు చేశారు. వేదపండితులు రామడుగుల నరసింహమూర్తి నేతృత్వంలో ఆలయ ప్రధాన అర్చకుడు కోట వెంకట సుబ్రహ్మణ్యం నగరేశ్వర స్వామికి రుద్రాభిషేకం, అమ్మవార్లకు కుంకుమార్చనలు నిర్వహించారు. కర్ణాటక. కేరళ, తమిళనాడు, తెలంగాణా రాష్ట్రాల నుంచి వచ్చిన వాసవీ మాలధారులు ఆలయం ప్రాంగణంలో గణపతి, వాసవీ హోమాలు నిర్వహించి మాల విరమణ గావించారు. ఆలయంలోని శాశ్వత నిత్యాన్నదాన ట్రస్టు ఆధ్వర్యంలో వందలాది మంది భక్తులకు అన్నప్రసాదం అందించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి గుబ్బల రామపెద్దింట్లురావు, వాసవీ యువజన సంఘ సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. వాసవీ యువజన సంఘం, ఆర్యవైశ్య సంఘాలు, వాసవీ క్లబ్ సభ్యులు వందలాది మంది పాల్గొనగా వాసవీ మాతకు వెండి రథోత్సవం జరిపారు.