
గ్రంథాలయాల్లో సమస్యలు పరిష్కరించండి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలోని గ్రంథాలయాల్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక నాయకులు ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరావును కలిసి వినతిపత్రం సమర్పించారు. జిల్లా కేంద్ర గ్రంథాలయానికి నూతన భవనాన్ని నిర్మించాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, గ్రామీణ దళిత గిరిజన ఆవాసాల్లో ప్రత్యేక గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని కోరారు. కోటేశ్వరరావు మాట్లాడుతూ ఏలూరు కార్పొరేషన్ నుంచి రూ. 8 కోట్ల సెస్ బకాయిలు వసూలు కావాల్సి ఉన్న విషయాన్ని గుర్తించామన్నారు. దీనిపై కమిషనర్‌తో మాట్లాడానని, త్వరలోనే సెస్ బకాయిలు గ్రంథాలయ సంస్థకు చెల్లించాలని సూచించానన్నారు. జిల్లాలోని గ్రంథాలయాలను ఆధునిక హంగులతో పాఠకులకు అందుబాటులోకి తెస్తామన్నారు. కోటేశ్వరరావును కలిసిన వారిలో వేదిక గౌరవ సలహాదారు ఆలపాటి నాగేశ్వరరావు, జిల్లా కన్వీనర్ నాగాస్త్ర, జిల్లా కో కన్వీనర్ దేవరకొండ వెంకటేశ్వర్లు, సభ్యులు డి.శ్రీనివాస్, ఎం.అజయ బాబు, జే. కృష్ణ ప్రసాద్ ఉన్నారు.