ఎండీయూ ఆపరేటర్ల జీవితాలతో చెలగాటం
భీమడోలు: కూటమి ప్రభుత్వం తమ జీవితాలతో చెలగాటమాడుతుందని, ఎండీయూ వాహనాలకు కాలపరిమితి ఉన్నా ఇంటింటికీ రేషన్ అందించే వ్యవస్థను రద్దు చేయడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. ఎండీఎం ఆపరేటర్ల యూనియన్ పిలుపు మేరకు గురువారం భీమడోలు మండల ఎండీయు ఆపరేటర్ల అసోసియేషన్ సభ్యులంతా భీమడోలు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మండల ప్రతినిధులు పాము రాజు, చేబత్తిన అనిల్‌కుమార్ మాట్లాడుతూ 2027 జనవరి వరకు అగ్రిమెంట్లు ఉన్నప్పటికి రద్దు చేసి ప్రభుత్వం కక్ష సాఽధింపు చర్యలకు పూనుకుందన్నారు. 2021లో కరోనా వంటి ఉపద్రవంలో మా జీవితాలను పక్కన పెట్టి ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా విధులను నిర్వహించి ప్రజలకు రేషన్ అందించి దేశ స్థాయిలో గుర్తింపు పొందామన్నారు. ఎండీయు వ్యవస్థ రద్దు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహారించుకోవాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు.
కొయ్యలగూడెంలో..
ఎండీయు వాహనాల వ్యవస్థ అమలుకు కుదుర్చుకున్న అగ్రిమెంటును ప్రభుత్వం రద్దు చేయడం అన్యాయమని ఎండీయూ ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. తమని పక్కన పెట్టడంతో 19 వేల కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. కరోనా సమయంలో సమర్ధవంతంగా విధులు నిర్వహించామని ఇంటింటికి తిరుగుతూ వికలాంగులకు వృద్ధులకు రేషన్ సరఫరా చేశామని అన్నారు. ఎండీయు వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఇప్పుడు రద్దు చేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. ఎండీయు వాహనాలను రద్దు చేయాల్సి వస్తే వాటిపై ఉన్న రుణాలను ప్రభుత్వమే భరించాలని, వాహనాలను నిర్వాహకులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ కె.చెలన్నదొరకు వినతిపత్రం సమర్పించారు.
తణుకు తహసీల్దార్ కార్యాలయం వద్ద
తణుకు అర్బన్: ఎండీయూ వాహనాల ఆపరేటర్లు తణుకు తహసీల్దార్ కార్యాలయం వద్ద గురువారం నిరసన తెలిపారు. ప్రభుత్వం తమ విధానాన్ని మార్చుకోవాలని, ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ పంపిణీని పునరుద్ధరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎండీయూ వాహనాల సంఘ నాయకుడు జగన్ మాట్లాడుతూ రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా 20 వేల కుటుంబాలను రోడ్డున పడేశారన్నారు. గత ఐదేళ్లకు పైగా ఎండీయూ వాహనాల ద్వారా ఇంటి గుమ్మంలోకే రేషన్ సరుకులను అందించి ఎండీయూ వ్యవస్థ ప్రజల మన్ననలు పొందిందని చెప్పారు. కోవిడ్ సమయంలో సైతం ప్రాణాలకు తెగించి సరుకుల పంపిణీ చేశామని, విజయవాడ వరదల్లో సైతం ఏ వ్యవస్థ వెళ్లలేని ప్రాంతానికి వెళ్లి బాధితులకు ఆహార పదార్థాలు, ఇతర సామగ్రిని అందజేశామని గుర్తు చేశారు. ప్రభుత్వం ఆలోచించి పునరుద్ధరించాలని కోరారు.
ఎండీయూ ఆపరేటర్ల జీవితాలతో చెలగాటం
ఎండీయూ ఆపరేటర్ల జీవితాలతో చెలగాటం


