
పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి
ఏలూరు(మెట్రో): జిల్లాలో సింగిల్ విండో కింద పరిశ్రమల స్థాపనకు, ఇతర ప్రోత్సాహకాల మంజూరు విషయంలో ప్రతి అంశాన్ని క్షుణ్నంగా పరిశీలించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి సూచించారు. కలెక్టరేట్‌లోని గౌతమీ సమావేశపు హాలులో గురువారం పారిశ్రామిక, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ప్రభుత్వ ప్రాధాన్యతను అనుసరించి పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తల దరఖాస్తులను పరిశీలించి నిబంధనల మేరకు ఉన్న దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేస్తున్నామన్నారు. సింగిల్ విండో కింద అందిన 84 దరఖాస్తుల్లో ఇప్పటికే 51 దరఖాస్తులు ఆమోదం పొందగా మిగిలిన 33 దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రపంచ ఫ్రీ–ఎక్లంప్సియా దినోత్సవం సందర్బంగా ఫ్రీ–ఎక్లంప్సియా వ్యాధిపై అవగాహన కలిగించే పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఫ్రీ–ఎక్లంప్సియా తల్లి, శిశువు ఇద్దరికి ప్రమాదకరమని.. ఈ వ్యాధిపై అవగాహన కల్పించడంతోపాటు వ్యాధిని నివారించడానికి అవసరమైన చర్యలను తీసుకునేలా ప్రజలను చైతన్యం చేయాలన్నారు.
యోగాంధ్రలో భాగస్వాముల్ని చేయాలి
యోగాంధ్రలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. గురువారం యోగాంధ్ర కార్యక్రమంపై జిల్లా, మండల స్థయి అధికారులతో కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జూన్ 21 వరకు యోగా ప్రాముఖ్యతను ప్రచారం చేసి ప్రజల్లో చైతన్యం కలిగించాలన్నారు. జిల్లాలో మాత, శిశు మరణాలు సంభవించకుండా కృషిచేయాలని, గత మరణాలను సమగ్రంగా విళ్లేషించి పూర్తిస్థాయిలో మరణాల నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలని కలెక్టర్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు.