
సీహెచ్‌ఓలకు వైఎస్సార్‌సీపీ సంఘీభావం
ఏలూరు (టూటౌన్): సీహెచ్‌ఓల న్యాయమైన కోర్కెలను తక్షణం పరిష్కరించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏలూరు కలెక్టరేట్ వద్ద నిరసన కొనసాగిస్తున్న సీహెచ్‌ఓల శిబిరాన్ని వైఎస్సార్‌సీపీ జిల్లా కమిటీ మంగళవారం సందర్శించి సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ సీహెచ్‌ఓల సమస్యలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. వారి డిమాండ్లన్నీ న్యాయబద్ధమైనవేనని, తక్షణం స్పందించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సీహెచ్‌ఓల సమస్యను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ కారుమూరి సునీల్ కుమార్, పార్టీ నియోజకవర్గాల ఇన్‌చార్జు వాసుబాబు, జేపీ, కంభం విజయరాజు తదితరులు పాల్గొన్నారు.
చెట్టున్నపాడు చోరీ కేసులో ఇద్దరికి రిమాండ్
భీమడోలు: చెట్టున్నపాడు గ్రామంలో జరిగిన చోరీ కేసులో మంగళవారం ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించారు. గ్రామంలోని పాస్టర్ కొండపల్లి మధుబాబు ఇంట్లో ఈనెల 2వ తేదీ రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేసి రూ.1.7లక్షల విలువ గల బంగారు అభరణాలు, కొంత నగదును చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్సై వై.సుధాకర్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితులు గ్రామానికి చెందిన నేతల రామలింగం, కొత్తపల్లి రత్నాకర్‌లను పట్టుకుని వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను భీమడోలు కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించినట్లు ఎస్సై తెలిపారు.