ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానం హుండీల నగదు లెక్కింపు స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో సోమవారం అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ జరిగింది. ఈ లెక్కింపులో చినవెంకన్నకు విశేష ఆదాయం సమకూరింది. గడచిన 18 రోజులకు గాను నగదు రూపేణా స్వామివారికి రూ.1,75,65,133 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ ఎన్‌వీ సత్యనారాయణమూర్తి తెలిపారు. భక్తులు కానుకల రూపేణా సమర్పించిన 137 గ్రాముల బంగారం, 3.130 కేజీల వెండితో పాటు అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. లెక్కింపులోకి రాని రద్దయిన పాత రూ.2000, రూ.1000, రూ.500 నోట్ల రూపంలో రూ.17,500 లభించినట్టు చెప్పారు. ఈ లెక్కింపులో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.