బుట్టాయగూడెం: వెదురు వస్తువుల తయారీలో మరింత నైపుణ్యాన్ని సాధించేలా గిరిజన మహిళలకు తోడ్పాటు అందిస్తామని అటవీ శాఖ సీసీఎఫ్ బీఎంఎం మూర్తి, మహారాష్ట్రకు చెందిన పారిశ్రామికవేత్త కాన్‌బ్యాంక్ సంస్థ ప్రతినిధి సంజీవ్ కార్పే తెలిపారు. పులిరామన్నగూడెంలో అటవీ ఉత్పత్తులు తయారు చేసే శిక్షణా కేంద్రాన్ని ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ గిరిజన మహిళలు తయారు చేసిన వివిధ రకాల వెదురు కళాకృతులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ వెదురు వస్తువులతో గిరిజన మహిళలు తయారు చేసిన కళాకృతులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేలా తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం మండలంలోని ముంజులూరు, ఉప్పరిల్ల, ఒర్రింక, కల్లుమామిడి, చింతపల్లి, గోగుమిల్లి, తదితర ప్రాంతాల్లో అడవుల్లో వస్తువుల తయారీకి అనుకూలంగా ఉన్న వెదురును పరిశీలించారు.కార్యక్రమంలో డీఎఫ్‌ఓ శ్రీశుభం, రీసెర్చ్ డీఎఫ్‌ఓ ఆర్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.