
ఎన్నికల అధికారులకు దిశానిర్దేశం చేస్తున్న కలెక్టర్ ప్రసన్న వెంకటేష్
ఏలూరు(మెట్రో): ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సమయంలో ఓటర్ల సెల్‌ఫోన్లను అనుమతించవద్దని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వె.ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం ఎన్నికల జోనల్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, కౌంటింగ్ సిబ్బంది శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలను పక్కాగా నిర్వహించాలని, నిబంధనలు తప్పక పాటించాలన్నారు. పోలింగ్ సమయంలో కొందరు ఓటర్లు ఓటువేసిన విధానాన్ని సెల్‌ఫోన్లలో ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసే అవకాశం ఉందని, పోలీసు సిబ్బందికి ఫోన్‌ను అప్పగించిన తర్వాతే ఓటర్లను బూత్‌లోకి అనుమతించాలన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎన్నికల సిబ్బంది పోలింగ్ సామగ్రిని ఈనెల 12వ తేదీ సాయంత్రమే తీసుకుని, అదే రోజు రాత్రికి పోలింగ్ స్టేషన్‌కి చేరుకోవాలన్నారు. 13న ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రాన్ని సిద్ధం చేసుకోవాలన్నారు. సమస్యలుంటే రిటర్నింగ్ ఆఫీసర్ లేదా జోనల్ అధికారి దృష్టికి తీసుకురావాలన్నారు. శుక్రవారం మరోసారి శిక్షణ తరగతులను నిర్వహిస్తామన్నారు. జేసీ, రిటర్నింగ్ అధికారి పి.అరుణ్‌బాబు, డీఆర్వో ఏఈవీఎన్‌ఎస్ మూర్తి, జెడ్పీ సీఈఓ కె.రవికుమార్, ఆర్డీఓలు పాల్గొన్నారు.
పూర్తిస్థాయిలో శిక్షణ
జిల్లాలో ఎన్నికల సిబ్బందికి శిక్షణ తరగతులు పూర్తిస్థాయిలో నిర్వహించామని కలెక్టర్ అన్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై గురువారం రాష్ట్ర ఎన్నికల అధికారి ముకేష్‌కుమార్ మీనా తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే శిక్షణ అందించామని, శుక్రవారం మరోమారు శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. ఉమ్మడి జిల్లాలో ఐదు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశామని, మొత్తం 1,300 బ్యాలెట్ పేపర్లు ముద్రించామన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.