భారత్... నాలుగేళ్లలో అమెరికాను దాటేస్తుంది!
స్టాన్‌ఫర్డ్ ప్రొఫెసర్ డా.జాన్ పి.ఏ.ఇయోనిడిస్
ఘనంగా వోక్సెన్ వర్శిటీ స్నాతకోత్సవాలు
మానవీయతకు ప్రాధాన్యమివ్వండి: ప్రవీణ్ కె. పూలా
సాక్షి, హైదరాబాద్: సైన్స్ టెక్నాలజీ రంగాల్లో వేగంగా ఎదుగుతున్న భారతదేశం ఇంకో నాలుగేళ్లలోనే విజ్ఞాన శాస్త్ర ప్రచురణల్లో అమెరికాను అధిగమించే అవకాశం ఉందని ప్రఖ్యాత స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ అధ్యాపకుడు డా.జాన్ పి.ఏ.ఇయోనిడిస్ స్పష్టం చేశారు. ప్రస్తుతం మూడోస్థానంలో ఉన్న భారత్ వృద్ధిరేటును ఇదే స్థాయిలో కొనసాగిస్తే ఇది సాధ్యమేనని తెలిపారు.
హైదరాబాద్ సమీపంలోని వోక్సెన్ యూనివర్శిటీ ఐదవ స్నాతకోత్సవానికి ప్రపంచ ప్రసిద్ధ గ్రీకు-అమెరికన్ వైద్య శాస్త్రవేత్త, రచయిత ప్రొఫెసర్ ఇయోనిడిస్ హాజరయ్యారు. స్నాతకోత్సవం సందర్భంగా, వోక్సెన్ యూనివర్శిటీకి చెందిన బిజినెస్, టెక్నాలజీ, ఆర్ట్స్ అండ్ డిజైన్, లిబరల్ ఆర్ట్స్ అండ్ హ్యూమానిటీస్, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్‌లకు చెందిన సుమారు 800 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. శాస్త్ర, పరిశోధన రంగాలకు అందించిన సేవలకు గుర్తింపుగా వోక్సెన్ యూనివర్శిటీ ప్రొఫెసర్ ఇయోనిడిస్‌కు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. వర్శిటీ ఛాన్సలర్ ప్రవీణ్ కె.పూలా ఈ డాక్టరేట్‌ను ప్రొఫెసర్ ఇయోనిడిస్‌కు అందించారు.
ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ ఇయోనిడిస్ మాట్లాడుతూ..“ప్రపంచం సాంకేతికంగా ఎంత పురోగమించినప్పటికీ ఈ రోజుకూ సుమారు 400 కోట్లమంది రోజుకు వెయ్యి రూపాయల్లోపు ఆదాయంతో జీవిస్తున్నారు. ఇంకో 70 కోట్ల మంది రెండు వందల రూపాయల కంటే తక్కువ ఆదాయంతో బతుకుతున్నారు. పర్యావరణ కాలుష్యం, మద్యం, మత్తు పదార్థాలు, నివారించగల వ్యాధులతో ఏటా కోట్లాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిస్థితి మానవత్వానికే ఒక సవాలు’’ అన్నారు. అందుకే మానవ పురోగతిని సాంకేతిక ఆవిష్కరణలతో, యుటోపియన్ కలలతో కొలవలేవమని, ప్రతి మనిషికి గౌరవం, బాధ్యత, విలువను జోడించడమే అసలైన పురోగతి అని స్పష్టం చేశారు.

శాస్త్రరంగంలో భారతదేశం సాధించిన అద్భుత పురోగతిని ప్రశంసిస్తూ “పరిశోధన పత్రాల ప్రచురణలో భారత్ ఇప్పటికే ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది. ఇదే వృద్ధి కొనసాగితే 2029 నాటికి అమెరికాను అధిగమించగలదు. శాస్త్ర ఆవిష్కరణలు మొదలుకొని ఆర్థిక వ్యవస్థ విస్తరణ వరకూ అన్నింటినీ అర్థవంతంగా, అవసరమైనంతగా సాధించవచ్చునని భారత్ రుజువు చేస్తోంది’’ అన్నారు. వోక్సెన్ విశ్వవిద్యాలయ పట్టభద్రులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘‘మీ ప్రయాణం ఈ రోజు ముగియదు. ఇదొక కొత్త ఆరంభం. భవిష్యత్తును మలచగల అద్భుత అవకాశం మీ చేతుల్లో ఉంది. మీ విజయానికి నైతికతను, మీ లక్ష్యాలకు మానవతను, మీ పురోగతికి సామాజిక బాధ్యతను జోడించండి.” అని పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ ఇయనిడిస్ అత్యంత ప్రభావవంతమైన వైద్య పరిశోధకులలో ఒకరిగా గుర్తింపు పొందారు. 2005లో ప్రచురించిన ఆయన ప్రసిద్ధ పేపర్ “ వై మోస్ట్ పబ్లిష్డ్ రీసెర్చ్ ఫైండింగ్స్ ఆర్ ఫాల్స్” ప్రపంచ వైద్య శాస్త్ర రంగంలో అత్యధికంగా ఉటంకించబడిన పరిశోధనలలో ఒకటి.
వోక్సెన్ యూనివర్శిటీ ఛాన్సలర్ ప్రవీణ్ కె. పులా మాట్లాడుతూ “ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన, అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, క్రీడా వేదికలతో కూడిన విశ్వవిద్యాలయాన్ని నిర్మించాలన్న లక్ష్యం నుంచి వోక్సెన్ పుట్టింది. నిజమైన విజయం ఓపిక, కృషి, దృష్టి, మరియు జట్టు పనితీరుతో వస్తుంది. విజయం వ్యక్తిగతం కాదు, సార్వజనీనమైనది. విద్యార్థులారా, మీరు చేసే పనిపట్ల అభిరుచి కలిగి ఉండండి, ఓపికను కోల్పోకండి, ఎల్లప్పుడూ ‘మానవ విలువలకు ప్రాధాన్యమివ్వండి.” అన్నారు.
ఈ సందర్భంగా వోక్సెన్ యూనివర్శిటీ వార్షిక నివేదిక 2025ను రిజిస్ట్రార్ అభిజిత్ శిరోద్కర్ విడుదల చేశారు. ఈ నివేదికలో 450కి పైగా పరిశోధన పత్రాలు, 60+ పేటెంట్లు, 190కు పైగా అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యాలు, 25కు పైగా విదేశీ అకడమిక్ ప్రతినిధి బృందాల సందర్శనలు, అలాగే జపాన్‌కి చెందిన సన్వా సప్లై సంస్థ నుండి వచ్చిన కోటి యెన్ ఎండోమెంట్ వంటి ప్రధాన విజయాలను వివరించారు.

రిజిస్ట్రార్ అభిజిత్ శిరోద్కర్ మాట్లాడుతూ “భారత ఉన్నత విద్య వ్యవస్థ పునర్నిర్మాణమే లక్ష్యంగా వోక్సెన్ ముందుకు సాగుతోంది. అత్యున్నత విద్యా ప్రమాణాలు, వాస్తవిక దృక్పథంతో కూడిన పాఠాలు, అంతర్జాతీయంగా గుర్తింపు.. అందరినీ కలుపుకు పోవడం అన్న నాలుగు ప్రాథమిక విలువల ఆధారంగా ముందుకు వెళుతున్నాం. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 18 శాతం మంది ఎక్కువ విద్యార్థులు చేరారు. కొత్తగా 45 అంతర్జాతీయ భాగస్వామ్యాలు ఏర్పడ్డాయి. క్యాంపస్ ప్లేస్‌మెంట్లలోనూ 163 అగ్రస్థాయి రిక్రూటర్లు పాల్గొన్నారు, వాటిలో 98 శాతం పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలు. ఎంబీఏ గ్రాడ్యుయేట్ల సగటు జీతం రూ.9.9 లక్షలుగా ఉంది. బీటెక్, బీబీఏ ప్రోగ్రామ్‌లు కూడా బలమైన వృద్ధిని చూపాయి.” అని తెలిపారు.


