ఉక్రెయిన్‌ పోరు దారెటు?!

Ukraine war enters its third year  - Sakshi

‘ఇక్కడ బతుకు దుర్భరంగా వుంది. స్వీయానుభవంలోకి రాకుండా దీన్నర్థం చేసుకోవటం పూర్తిగా అసాధ్యం’ అని తన సన్నిహితుడికి రాసిన లేఖలో రష్యాలోని అతి శీతలమైన ఆర్కిటిక్‌ ప్రాంత కారాగారంలో ఇటీవల కన్నుమూసిన అసమ్మతివాది అలెక్సీ నవాల్నీ అన్నారట. రెండేళ్లు పూర్తయి మూడో యేట ప్రవేశించిన ఉక్రెయిన్‌ యుద్ధం కూడా అటువంటి పరిస్థితుల్నే సృష్టించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రారంభించిన ఈ దురాక్రమణ యుద్ధం పర్యవసానంగా అటు రష్యా సైనికులూ... ఇటు ఉక్రెయిన్‌ సైనికులూ, పౌరులూ కూడా చెప్పనలవికాని యాతనలు పడు తున్నారు.

ఈ యుద్ధం నిరుడు రెండో ఏడాదిలో ప్రవేశించే సమయానికి ఉక్రెయిన్‌ పౌరుల్లో కాస్తయినా విశ్వాసం వుండేది. వచ్చే వేసవిలో రష్యా సైనికులను తరిమేయగలమని నమ్మేవారు. ఇప్పుడు అదంతా ఆవిరైంది. 2025 నాటికి మెరుగైన ఫలితాలొస్తాయని తాజాగా పాశ్చాత్య మీడియా నమ్మబలుకుతోంది. అమెరికా అండదండలతో పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్‌కు దండిగా ఆయుధాలు, ట్యాంకులు, యుద్ధ విమానాలు, క్షిపణులు అందించటంతోపాటు రష్యాపై ఆంక్షలు కూడా విధించాయి.

1945 తర్వాత యూరోప్‌ దేశాలన్నీ చిక్కుకున్న ఈ భారీ యుద్ధం ఎటుపోతుందో, చివరికేమవుతుందో ఎవరి అవగాహనకూ అందటం లేదు. ఈమధ్యే అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నాటో కూటమి దేశాలను హెచ్చరించారు. తమ తమ జీడీపీల్లో రక్షణకు 2 శాతంకన్నా తక్కువ వ్యయం చేసే యూరోప్‌ దేశాలకు తాను గద్దెనెక్కిన తర్వాత సహకరించబోనని ప్రకటించారు. పైగా యూరోప్‌ను ‘మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండ’ని రష్యాకు చెబుతానన్నారు. ఆయన మళ్లీ అ«ధ్యక్షుడు కావటం ఖాయమని దాదాపు సర్వేలన్నీ చెబుతున్నాయి. 

ఈనాటికీ 18 శాతం ఉక్రెయిన్‌ భూభాగం రష్యా అధీనంలో వుంది. అక్కడా, ఇతరచోట్లా ఉక్రెయిన్‌ పౌరులు భయంతో బతుకులీడుస్తున్నారు. అంతేకాదు... రష్యా క్షిపణి దాడులు జరిగిన ప్రతిసారీ సమీప బంధువులనూ, స్నేహితులనూ కూడా అనుమాన దృక్కులతో చూసే ధోరణి మొదలైంది. కొందరు రష్యాకు అమ్ముడుపోయి క్షిపణి దాడులకు కారణమవుతున్నారన్న అభిప్రాయం అందరిలోనూ వుంది. ఇరాన్, ఉత్తర కొరియాలు రష్యాకు అవసరమైన డ్రోన్లు, క్షిపణులు అందిస్తున్నాయి. యుద్ధంలో పాల్గొనే సైనికులకు అవసరమైన సామగ్రిని తుర్కియే సరఫరా చేస్తోంది. చైనానుంచి పేలుడు పదార్థాల్లో వినియోగించే రసాయనాలు వస్తున్నాయి.

2022 ఫిబ్రవరి మొదలుకొని ఇంతవరకూ రష్యా ఆదాయాన్ని 433 బిలియన్‌ డాలర్ల మేర (దాదాపు రూ. 35,500 కోట్లు) గండికొట్టగలిగామని పాశ్చాత్య దేశాలు సంబరపడుతున్నా రష్యా దూకుడు తగ్గలేదు. యుద్ధరంగంలో రష్యా వినియోగిస్తున్న ఆయుధాల్లోని 95 శాతం విడిభాగాలు అమెరికా, పాశ్చాత్య దేశాల్లో తయారైనవేనన్నది కియూవ్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అధ్యయన సారాంశం. సీఐఏ డైరెక్టర్‌ బిల్‌ బర్న్స్‌ చెప్తున్న ప్రకారం ఇంతవరకూ 3,15,000 మంది రష్యా సైనికులు ఈ యుద్ధంలో మరణించటమో, గాయపడటమో జరిగింది. మూడింట రెండువంతుల శతఘ్నులుధ్వంసమయ్యాయి.

రక్షణ కేటాయింపులు పెంచే విధానానికి స్వస్తిచెప్పి ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని యుద్ధకాల ఆర్థిక వ్యవస్థగా (వార్‌ ఎకానమీ) రష్యా మార్చిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సమర్థతగల నాయకుడనీ, యుద్ధ హీరో అని పాశ్చాత్య మీడియా కీర్తించటంవల్ల ఒరిగేదేమిటో అర్థంకాదు. గతంతో పోలిస్తే ఆయన రేటింగ్స్‌ పడిపోయాయన్నది వాస్తవం. ముఖ్యంగా కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ జలూజినీని తొలగించటం, కియూవ్‌ నగర మేయర్‌తో విభేదాలు జెలెన్‌స్కీ ప్రతిష్టను దెబ్బతీశాయి.

ఉక్రెయిన్‌కు మరో ఆరువేల కోట్ల డాలర్ల ఆర్థిక సాయానికి అమెరికా సెనేట్‌ గతవారం అంగీకారం తెలిపినా రిపబ్లికన్లకు ఆధిక్యతవున్న ప్రతినిధుల సభలో ఏమవుతుందో తెలియదు. కొత్త ఆయుధాల సరఫరాకు ఇప్పటికే రిపబ్లికన్లు బ్రేక్‌ వేశారు. ఉక్రెయిన్‌కు అందించదలచుకున్న సాయం విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలను వెదకాలన్న సూచనలు రావటం అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు సమస్యాత్మకమే. 

ఉక్రెయిన్‌ యుద్ధాన్ని నిలువరించి, యుద్ధ నేరాలకు మూల్యం చెల్లించేలా రష్యాపై అంతర్జాతీయ వేదికల ద్వారా ఒత్తిళ్లు పెంచటమే ఇప్పుడున్న ఏకైక మార్గం. ఈ బాధ్యతను అమెరికా, పాశ్చాత్య దేశాలు విస్మరిస్తున్నాయి. ఉక్రెయిన్‌కు ఆయుధాలందిస్తూ పోతే అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్‌ తదితర దేశాల ఆయుధ పరిశ్రమలకు ఆర్డర్లు పెరుగుతాయితప్ప ఒరిగేదేమీ వుండదు. ఉక్రెయిన్‌ గెలుపు గురించీ, రష్యాపై తీసుకునే చర్యల గురించీ ఆర్భాటంగా మాట్లాడుతున్న అమెరికా, పాశ్చాత్య దేశాలు యుద్ధం మొదలై రెండేళ్లవుతున్నా తమ దేశాల్లోని రష్యా ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవటంలో వెనకడుగేస్తున్నాయి.

వివిధ ఫైనాన్షియల్‌ కంపెనీల్లో వున్న 30,000 కోట్ల డాలర్ల విలువైన రష్యా ఆస్తుల్ని యుద్ధం మొదలైన రోజుల్లోనే స్తంభింపజేశారు. కానీ వాటì  స్వాధీన ప్రక్రియను ప్రారంభిస్తే డాలర్ల రూపంలో నిధులు డిపాజిట్‌ చేసే విధానానికి చాలా దేశాలు స్వస్తి చెబుతాయన్న భయం అమెరికాకు ఉంది. ఇలా తమ ఆర్థిక వ్యవస్థల గురించీ, భవిష్యత్తు గురించీ ఆచి తూచి అడుగు లేస్తున్న సంపన్న దేశాలు ఈ యుద్ధాన్ని ఆపటంపై మాత్రం దృష్టి సారించటం లేదు.

ఉక్రెయిన్‌ పోరునూ, గాజాలో ఇజ్రాయెల్‌ సాగిస్తున్న దారుణ మారణకాండనూ ఇకనైనా నిలువరించకపోతే అన్ని దేశాలూ పెను సంక్షోభంలో కూరుకుపోతాయి. ఆ పరిస్థితి తలెత్తకుండా చూడటం అందరి కర్తవ్యం కావాలి. 

whatsapp channel

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top