
తుపాను ముందర ప్రశాంతత అంటే ఇదేనేమో! కొద్దివారాలుగా మణిపుర్ కొంత ప్రశాంతంగా ఉందని భ్రమిస్తున్నంత సేపు పట్టలేదు... ఆ రాష్ట్రం మరోసారి భగ్గుమంది. గత రెండేళ్ళుగా జాతి ఘర్షణల మధ్య చిక్కుకొని విలవిలలాడుతున్న ఈశాన్య రాష్ట్రం మళ్ళీ పతాక శీర్షికలకు ఎక్కింది. 2023 అల్లర్ల వేళ అనేక నేరాలకు పాల్పడినట్టు ఆరోపణలను ఎదుర్కొంటున్న మైతేయ్‌ల ర్యాడికల్ సంస్థ ‘అరంబై తెంగోల్’ (ఏటీ) నేత కనాన్ సింగ్‌ను సీబీఐ అరెస్ట్ చేయడంతో ఆదివారం ఉద్రిక్తత పెచ్చరిల్లింది.
భగ్గుమన్న నిరసనల మధ్య రాష్ట్రంలో పలుచోట్ల కర్ఫ్యూ, అయిదు రోజుల పాటు ఇంటర్నెట్‌పై నిషేధం విధించాల్సి వచ్చింది. వివిధ పార్టీల ఎమ్మెల్యేలు 23 మంది ఆదివారం వెళ్ళి, గవర్నర్‌ను కలసి పరిస్థితిని వివరించి, సామరస్యపూర్వక పరిష్కారానికై అర్థించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వెరసి, కేంద్రం సుదీర్ఘ జాప్యం తర్వాత ఫిబ్రవరిలో ఎట్టకేలకు అసమర్థ బీరేన్ సింగ్ సర్కార్‌ను తప్పించి రాష్ట్రపతి పాలన విధించిందన్న మాటే గానీ, మణిపుర్‌ను యథాపూర్వ స్థితికి తీసుకురాలేకపోయింది. తాజా పరిణామాలే అందుకు నిలువెత్తు నిదర్శనం.
మైతేయ్‌లకు ఎస్టీ హోదాను ఇవ్వడాన్ని కుకీ వర్గ ప్రజానీకం తీవ్రంగా వ్యతిరేకించడం రెండేళ్ళ క్రితం జాతుల మధ్య తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ఆర్థిక ప్రయోజనాలు, భూయాజమాన్యంపై అసలే దీర్ఘకాలంగా రెండు వర్గాల మధ్య నెలకొన్న అసంతృప్తి ఆ తాజా పరిణామంతో మరింత చిచ్చు రేపింది. అలా 2023 మే 3 నుంచి రాష్ట్రం అక్షరాలా తగలబడుతూనే ఉంది. ఈ ఘర్షణల వల్ల 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు.
బీరేన్ సింగ్ సారథ్యంలోని అప్పటి బీజేపీ ప్రభుత్వం తమ రాజకీయ ప్రయోజనాల రీత్యా ఒక వర్గానికి కొమ్ము కాస్తూ, పక్షపాతధోరణితో వ్యవహరించినట్టు ఆది నుంచీ ఆరోపణలున్నాయి. చివరకు భద్రతా దళాలు సైతం మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడినట్టు వార్తలొచ్చిన∙సంగతి మర్చిపోలేం. ప్రజలు, ప్రతిపక్షాల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా, బీరేన్‌ను మార్చడానికి ఇష్టపడని బీజేపీ అధిష్ఠానం తీరా గత ఫిబ్రవరిలో ఆయనను పక్కకు తప్పించినా పుణ్యకాలం గడిచిపోయింది.
2022 ఫిబ్రవరి నాటి ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ మద్దతు కూడగట్టుకొని అధికారం చేపట్టినా, పట్టుమని పదిహేను నెలలకే రాష్ట్రంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. మొత్తం 60 మంది సభ్యు లున్న మణిపుర్ అసెంబ్లీలో నిజానికి బీజేపీకి 37 మంది ఎమ్మెల్యేలున్నారు. రాష్ట్రం అతలాకుతల మవుతున్న వేళ... బీరేన్ స్థానంలో అన్ని వర్గాలకూ అనుకూలుడైన కొత్త వ్యక్తిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టి, రాష్ట్రపతి పాలనను నివారించి ఉండవచ్చు. కానీ, సీఎం అభ్యర్థిపై సొంత పార్టీలోనే ఏకాభిప్రాయం కుదరలేదు. పైగా, కుకీ–జో వర్గానికి చెందిన పార్టీ ఎమ్మెల్యేలు ఏడుగురు ఘర్షణలు మొదలైన నాటి నుంచి సభకు దూరంగా ఉండడం ఆ పార్టీకి తలనొప్పిగా తయారైంది.
చివరకు, ఘర్షణలు మొదలైన 21 నెలల తర్వాత రాష్ట్రపతి పాలనే శరణ్యమైంది. కానీ, అప్పటికే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టయింది. ఈశాన్య భారత అభివృద్ధికి తామే బాటలు వేస్తున్నామంటున్న పాలక పార్టీ మణిపుర్ వ్యవహారాన్ని సరైన రీతిలో చక్కదిద్దలేకపోయిందన్న శాశ్వత అప్రతిష్ఠను మూటగట్టుకోవాల్సి వచ్చింది. రాష్ట్రపతి పాలన విధించినా, పర్వత ప్రాంత రాష్ట్రంలో పరిస్థితి నేటికీ నివురు గప్పిన నిప్పులానే ఉందని శని, ఆదివారం నాటి ఘటనలు మరోమారు ఋజువు చేశాయి.
అక్కడి ఉద్రిక్తతను ప్రపంచానికి నివేదిస్తున్న విలేఖరులు సైతం శనివారం భద్రతా బలగాల దాడికి గురయ్యారు. పాత్రికేయులపై రాష్ట్రంలో పదే పదే జరుగుతున్న దాడులకు నిరసనగా చివరకు సోమవారం మణిపుర్‌లోని ప్రధాన పత్రికలన్నీ తమ పేపర్‌లో సంపాదకీయ స్థానాన్ని ఖాళీగా వదిలేశాయి. పత్రికలన్నీ సమష్టిగా నిలిచి ఇలా అరుదైన రీతిలో తమ నిరసన తెలియ జేయడం ఓ బలమైన సందేశం. మణిపుర్‌లో ఇప్పటికీ మామూలు పరిస్థితులు లేవనడానికి ప్రతీక.
అసలు రెండేళ్ళ క్రితం ఘర్షణలు చెలరేగగానే ఆ ఏడాది జూన్ 4న కేంద్రం ముగ్గురు సభ్యుల విచారణ సంఘం వేసింది. పదే పదే పొడిగింపుల ప్రహసనంతో సదరు సంఘం కాలపరిమితి ఈ ఏడాది నవంబర్ దాకా దేకింది. అప్పటికైనా ఆ సంఘం కొత్తగా తేల్చేదేమిటో, దాని నివేదికతో ఒరిగేదేమిటో చెప్పలేం. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ కుప్పకూలిందని 2023 ఆగస్టులో సుప్రీమ్ కోర్ట్ వ్యాఖ్యానించినా మన ఏలికలకు చీమ కుట్టినట్టయినా లేదు. నష్టనివారణలో చిత్తశుద్ధి కరవైంది.
రాష్ట్రపతి పాలనతో పరిస్థితి మెరుగువతుందనుకుంటే అడియాసైంది. గవర్నర్ సైతం ఇంఫాల్ విమానాశ్రయం నుంచి ఇంటికి హెలికాప్టర్‌లో వెళ్ళాల్సిరావడం దిగ్భ్రాంతికరం. సాక్షాత్తూ బీజేపీ ఎంపీ ఒకరు 2020లో స్థాపించిన ‘ఏటీ’ సాయుధ పౌరసైన్యంగా మారి హింసకు పాల్పడి, ఆయు ధాలను కొల్లగొట్టినట్టు కథనం. ఎవరెన్నిమార్లు అభ్యర్థించినా, ఇప్పటికీ ఆయుధాలను అప్పగించ లేదు. రేపు అవి మరే నేరగాళ్ళ చేతిలో పడి, ఎక్కడకు దారి తీస్తాయో ఊహించలేం.
గతంలో పలు తీవ్రవాద వర్గాలు నిషేధానికి గురైనా, ఇప్పటికీ ఏటీని ఎందుకు నిషేధించలేదంటే జవాబూ లేదు. ఇంత జరుగుతున్నా ప్రధాని పెదవి విప్పకపోవడం, ప్రపంచమంతా తిరుగుతున్నా ఈశాన్యంలో పర్యటించి భరోసా ఇవ్వకపోవడం సమర్థించలేం. ఇప్పటికైనా తీవ్రతను గుర్తించి, విభిన్న వర్గాల మధ్య సామరస్యానికి కృషి చేయాలి. హింస కన్నా అభివృద్ధి ముఖ్యమని నచ్చజెప్పాలి. వేలాది సగటు మణిపురీలు అనేక నెలలుగా శరణార్థి శిబిరాల్లో తలదాచుకోవాల్సి రావడం అన్ని పార్టీల సమష్టివైఫల్యం. ఇది ఇలాగే కొనసాగితే మానవత్వానికే మాయనిమచ్చ. దేశసమగ్రతకే ప్రమాదం.