కొన్ని ఉదంతాలు దిగ్భ్రాంతి కలిగిస్తాయి. వింటున్నది నిజమేనా అనిపిస్తాయి. ఒరిస్సా హైకోర్టు కొన్ని బెయిల్ దరఖాస్తుల విషయంలో వెలువరించిన ఆదేశాలు అటువంటివే. నిరుడు ఏప్రిల్–సెప్టెంబర్‌ల మధ్య ఆ హైకోర్టు 50 బెయిల్ దరఖాస్తుల్ని అంగీకరించింది. కానీ అందుకు సంబంధించి విధించిన షరతులు అందరినీ నివ్వెరపరిచాయి. ఆ నిందితులంతా రెండు నెలలపాటు పోలీస్‌స్టేషన్లు, గుడులు, ఆసుపత్రులు, గ్రామీణ రహదారులు, చెరువులు ప్రతిరోజూ ఉదయం మూడు గంటలపాటు శుభ్రం చేయాలన్నది వాటి సారాంశం. మైనింగ్ కార్యకలాపాలు నిలిపేయాలంటూ ఉద్యమించిన వారితోపాటు దొంగతనం, హత్య తదితర క్రిమినల్ కేసుల్లో ఉన్నవారిని కూడా ఇందులో చేర్చారు. నిందితుల్లో అత్యధికులు దళిత, ఆదివాసీ వర్గాలకు చెందినవారు కావటం గమనించదగ్గది. ఇలాంటి పారిశుద్ధ్య పనుల కేటాయింపులో న్యాయమూర్తి కులం కోణాన్ని మించి చూడలేకపోయారని ఈ బెయిల్ ఆదేశాలు తేటతెల్లం చేస్తున్నాయి. సాధారణంగా సామాజిక ఉద్యమకారులెవరైనా ఫిర్యాదు చేస్తేనే ఇలాంటి ఉదంతాలు న్యాయస్థానం దృష్టికి పోతాయి. కానీ ‘ఆర్టికల్ 14’ అనే డిజిటల్ మీడియాలో గత నెల 27న వచ్చిన కథనాలను సర్వోన్నత న్యాయస్థానం తనంత తానే గమనించటం, ఆ షరతులు చెల్లబోవని వెనువెంటనే ఉత్తర్వులీయటం కొంతలో కొంత ఊరట.
‘కులం పునాదుల మీద మీరు దేన్నీ సాధించలేరు. ఒక జాతినీ నిర్మించలేరు. ఒక నీతినీ నిర్మించలేరు’ అన్నారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్. వచ్చే ఏడాదితో మన దేశం స్వాతంత్య్రాన్ని సాధించుకుని ఎనభైయ్యేళ్లవుతుంది. కానీ దళితులకు, ఇతర అట్టడుగు వర్గాలకూ అడుగడుగునా కులవివక్ష ఎదురవుతూనే ఉంది. కేలండర్లు మారుతున్నా, సాంకేతికత విస్తరించి అభివృద్ధి జరుగుతున్నా ఆ మనస్తత్వం మారటం లేదు. కుల వివక్ష, దానిపేరిట సాగుతున్న హింస దేశాభివృద్ధికే ఆటంకంగా ఉన్నదనీ, అది మనుషులను వేరు చేస్తోందనీ, మనసుల్ని సంకుచితపరుస్తోందనీ స్వామి వివేకానంద ఏనాడో ఆందోళన వ్యక్తం చేశారు. కానీ మార్పు ఎక్కడ?
ఇతర వ్యవస్థల్లో ఇలాంటి జాడ్యాలు కనబడినప్పుడు సరిదిద్దాల్సిన న్యాయవ్యవస్థ సైతం ఆ తానులో ముక్కగా మారితే...? ఒరిస్సా హైకోర్టు ఆదేశాలు చూసి రాయగడ అదనపు సెషన్స్ న్యాయస్థానం, మరో ఆరు కింది కోర్టులు ఈ మాదిరి ఆదేశాలే జారీ చేశాయి. ‘ఒడిశా న్యాయవ్యవస్థ వ్యక్తీకరించిన ఈ తిరోగమన మనస్తత్వం మమ్మల్నెంతో కలవరపరుస్తోంది. ఇది మానవ హక్కుల్ని ఉల్లంఘించటమేకాక నిందితుల గౌరవాన్ని దెబ్బతీసే చర్య’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జయ్‌మాలా బాగ్చీ ఆధ్వర్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్మొహమాటంగా తెలిపింది. విచారణకు ముందే నేరం చేసినట్టు నిర్ణయానికొచ్చి ‘శిక్షించటం’ అమల్లోవున్న చట్టాల ప్రకారం చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది.
బాక్సైట్ మైనింగ్ కోసం వేదాంత గ్రూప్ సంస్థలకు రాయగడ, కలహండి జిల్లాల్లో ఇచ్చిన లీజులవల్ల తూర్పు కనుమల్లోని 1560.40 హెక్టార్ల అటవీభూమి నాశనం కాబోతోంది. రెండు జిల్లాల్లోని రెండు గ్రామాలు అదృశ్యమవుతాయి. ఆదివాసీ, దళిత వర్గాలు ఈ లీజుల రద్దుకు 2023 నుంచి ఉద్యమిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం సైతం విశాఖ ఏజెన్సీలో ఇలాగే లీజుకీయటం, ఉద్యమాలు చెలరేగటం ఎవరూ మరిచిపోరు. అటు తర్వాత వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ అనుమతుల్ని రద్దు చేసింది. ప్రకృతి విధ్వంసానికి దారితీసే, స్థానికుల జీవికను దెబ్బతీసే ఇలాంటి చర్యను ఒడిశా సర్కారు విరమించుకోకపోగా, ఉద్యమకారుల్ని నిర్బంధిస్తోంది. సకాలంలో జోక్యం చేసుకోకుండా వ్యవస్థలు నిర్లిప్తంగా మిగిలితే ఉద్యమాలు హింసాత్మక రూపం ధరిస్తాయి. వాటిని ప్రభుత్వాలు శాంతిభద్రతల సమస్యగా పరిగణించి అణచ టానికి చూస్తాయి. నక్సలైటు ఉద్యమాల తీవ్రత, పర్యవసానాలు చూశాకైనా ఈ పోకడలు మానుకొని, స్థానికుల ఆకాంక్షల్ని గౌరవించే సంస్కృతిని వ్యవస్థలు అలవర్చుకోవాలి. ఈ విషయంలో ఒరిస్సా హైకోర్టు తీరు ఆందోళన కలిగించే అంశం. ఈ సమస్యపట్ల సుప్రీంకోర్టు ప్రదర్శించిన అప్రమత్తత, దిద్దుబాటు చర్యలు నిస్సహాయ పౌరులకు వ్యవస్థలపట్ల విశ్వాసాన్ని పెంచుతాయి.


