ముదురుతున్న వివాదం

Sakshi Editorial on India And China Border Dispute

సరిహద్దు వివాదాన్ని నెలల తరబడి నానిస్తే ఏమవుతుందో భారత–చైనాల మధ్య వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితిని గమనిస్తే అర్ధమవుతుంది. 45 ఏళ్ల తర్వాత తొలిసారి ఆ ప్రాంతంలో తుపాకులు గర్జించాయని వార్తాసంస్థల కథనం. సోమవారం ఈ ఉదంతం చోటుచేసుకుందని మన సైన్యం వివరించింది. చైనా సైనికులు మన సేనల్ని బెదిరించడానికి గాల్లోకి కాల్పులు జరిపాయని అంటున్నారు. కానీ ఈ ఉద్రిక్తతల్ని తగ్గించడానికి తక్షణం ప్రయత్నాలు చేయక పోతే చివరికిది యుద్ధానికి దారితీసినా ఆశ్చర్యం లేదు. ఇప్పటికే ఎంతో ఆలస్యమైందని చెప్పాలి. అక్కడ మొన్న ఏప్రిల్‌ నుంచి ఉద్రిక్తతలు రాజుకోవడం మొదలైంది. గాల్వాన్‌లోయలో భారత్‌ సైన్యం గస్తీ కాసే ప్రాంతంలోకి  వందలాదిమంది సైనికుల్ని తరలించి చైనా భారీ సంఖ్యలో శిబిరాలు ఏర్పాటుచేసుకుంటున్నదని, బంకర్లు నిర్మిస్తున్నదని అప్పట్లో మీడియా కథనాలు వెల్లడించాయి. ఆ తర్వాత ఇరు దేశాల మధ్యా సైన్యం స్థాయిలో సంప్రదింపులు జరుగుతూనే వున్నాయి. కానీ అవి పెద్దగా ఫలితాన్నిచ్చిన దాఖలా లేదు. ఆ క్రమంలో జూన్‌లో రెండు దేశాల సైనికుల మధ్యా ఘర్షణలు జరిగాయి.

చైనా సైనికులు రాళ్లు, ఇనుపరాడ్లతో దాడికి దిగినప్పుడు మన జవాన్లు 21మంది మరణించారు. మన సైనికుల ఎదురుదాడిలో చైనాకూడా తీవ్రంగా నష్టపోయిందన్న వార్తలొచ్చాయి. గత నెలాఖరున ప్యాంగాంగ్‌ సో దక్షిణ ప్రాంతంవైపు చొచ్చుకు రావడానికి ప్రయత్నించిన వేయి మంది చైనా సైనికుల్ని మన సేనలు విజయవంతంగా అడ్డుకోగలిగాయి. పర్వతప్రాంత యుద్ధంలో ప్రత్యేక నైపుణ్యం వున్న దళాలు చుశాల్‌ సెక్టార్‌లోని కైలాస్‌ సెక్టార్‌తోసహా వివిధ చోట్ల అప్రమత్తంగా వుండటం వల్ల ఇది సాధ్యమైందంటున్నారు. ఈ దళాలు ఆ సెక్టార్‌లోని దాదాపు అన్ని పర్వత ప్రాంతాలనూ ప్రస్తుతం పహారా కాస్తున్నాయి. బహుశా ఈ పరిణామాలతో ఆగ్రహించే చైనా సైన్యం కాల్పులు జరిపివుండొచ్చునని నిపుణులు చెబుతున్న మాట. సరిగ్గా 45 ఏళ్లక్రితం 1975లో చైనా సైనికులు అరుణాచల్‌ప్రదేశ్‌లోని వాయువ్య ప్రాంతంలో తులంగ్‌ పాస్‌ వద్ద హఠాత్తుగా దాడి చేసి అస్సాం రైఫిల్స్‌కు చెందిన నలుగురు జవాన్లను కాల్చిచంపారు. మరో ఇద్దరిని చిత్రహింసలు పెట్టి ప్రాణాలు తీశారు. 

ఎల్‌ఏసీ వద్ద చైనా తాజాగా అనుసరిస్తున్న ధోరణి ఆంతర్యమేమిటో అందరికీ తెలుసు. ఆక్సాయ్‌చిన్, లద్దాఖ్‌ ప్రాంతాల్లో చైనా దాదాపు 38,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఆక్రమించిందని మన దేశం చెబుతోంది. కానీ తమ భూభాగమే 90,000 చదరపు కిలోమీటర్లు భారత్‌ అధీనంలో వుందన్నది చైనా వాదన. జమ్మూ–కశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టినప్పటినుంచీ ప్రస్తుతం తమ అధీనంలోని ఆక్సాయ్‌చిన్‌ను భారత్‌ స్వాధీనం చేసుకోవ డానికి ప్రయత్నిస్తుందన్న బెంగ చైనాకు పట్టుకుంది. గాల్వాన్‌ సెక్టార్‌లో ప్యాంగాంగ్‌ సో, గాల్వాన్‌ లోయ, హాట్‌ స్ప్రింగ్, దస్పాంగ్‌ల వద్ద పైచేయి సాధిస్తే ఆక్సాయ్‌చిన్‌వైపు భారత సైన్యం కదలికలను అడ్డుకోవడానికి వీలుంటుందన్న ఆశతోనే గత కొన్ని నెలలుగా ఎల్‌ఏసీ వద్ద అది చికాకులు సృష్టి స్తోంది. ఇప్పుడు లద్దాఖ్‌లో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఆమధ్య డోక్లామ్‌ వద్ద వేసిన ఎత్తుగడలనే చైనా ఇక్కడ కూడా ప్రయోగిస్తోందని అర్ధమవుతుంది. డోక్లామ్‌ వద్ద భూటాన్‌ భూభా గాన్ని ఆక్రమించుకుని చైనా రోడ్డు నిర్మాణం దాదాపు పూర్తిచేసింది. అక్కడ శాశ్వత కట్టడాలు నిర్మిం చింది. మరింత భూభాగాన్ని ఆక్రమించడానికి కూడా ప్రయత్నిస్తోంది. ఆ ఎత్తుగడే ఎల్‌ఏసీలోనూ కొనసాగించవచ్చని అనుకుంటున్న వేళ మన సైన్యం దూకుడు దానికి సహజంగానే చికాకు తెప్పి స్తుంది. కానీ ఒకసారంటూ తుపాకులు పేలడం మొదలయ్యాక అది ఏ పరిణామాలకు దారితీస్తుందో ఎవరూ చెప్పలేరు. ముఖ్యంగా సైనిక, దౌత్య, రాజకీయ స్థాయిల్లో ఇరు దేశాల మధ్యా చర్చలు జరు గుతున్నప్పుడు ఇది చోటుచేసుకోవడం సమస్యను మరింత జటిలం చేస్తుంది.

మాస్కోలో ప్రారంభమైన షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీఓ) సమావేశం సందర్భంగా మన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కూ, చైనా రక్షణమంత్రి వీ ఫెంఘే కూ మధ్య మొన్న శుక్రవారం జరిగిన దౌత్య స్థాయి సంభాషణలు పరిస్థితిని చక్కదిద్దగలదని అందరూ ఆశించారు. కానీ ఇరు దేశాల మంత్రులూ ఆ తర్వాత విడుదల చేసిన ప్రకటనలు అందుకు అనువుగా లేవు. రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటనలో సామరస్య ధోరణి కనబడింది. ఇరు పక్షాలూ చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలన్నదే భారత్‌ ఉద్దేశమని ఆయన చెప్పారు. కానీ వీ ఫెంఘే ప్రకటనలో ఈ మాదిరి భాష లేదు. మే నెలలో జరిగిన ఘర్షణలకు పూర్తిగా భారత్‌దే బాధ్యతని ఆయన చెప్పుకొచ్చారు. తమ సేనలు ఎంతో సహనంతో వున్నాయని సమర్థించుకున్నారు. భారత్‌ సైనికులు వెంటనే వెనక్కి వెళ్లాలని డిమాండ్‌ చేశారు. ఇరు దేశాల మధ్యా రాజుకున్న ఉద్రిక్తతలు ఉప శమించడానికి దౌత్యం ఒక్కటే మార్గమని మన విదేశాంగమంత్రి ఎస్‌. జైశంకర్‌ చెబుతున్న మాటల్లో నిజముంది.  రెండు దేశాల వద్దా అణ్వస్త్రాలున్న ప్రస్తుత పరిస్థితుల్లో సాయుధ ఘర్షణలు ఎంత మాత్రం మంచిది కాదు. ఈ ఉద్దేశంతోనే ఎస్‌సీఓ విదేశాంగమంత్రుల సమావేశంలో పాల్గొంటున్న సందర్భంగా జైశంకర్‌ గురువారం చైనా విదేశాంగ మంత్రితో భేటీ కాబోతున్నారు. చూడటానికి రెండు దేశాల సైన్యాల మధ్య తలెత్తిన ఘర్షణలుగా ఇవి కనబడినా వాటి వెనక ప్రధానంగా రాజకీయ కారణాలే వుంటాయి. పరస్పర అపనమ్మకం, భవిష్యత్తు గురించిన శంకలు సైనిక ఉద్రిక్తతలకు దారితీస్తాయి. కనుక చైనా ఇప్పటికైనా వివేకంతో వ్యవహరించి ఎల్‌ఏసీ వద్ద ఉద్రిక్తతలను సడలించడానికి అరమరికలు లేకుండా మాట్లాడాలి. తన ఉద్దేశాలేమిటో తేటతెల్లం చేయాలి. దబాయింపులకు దిగితే, ఇష్టానుసారం వ్యవహరిస్తే అంతర్జాతీయంగా ఏకాకి అవుతానని గ్రహించాలి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top