గెలుపు ఏకపక్షమే!

Sakshi Editorial on Five State Assembly Election Results

సార్వత్రిక ఎన్నికలకు ముందు ‘మినీ వార్‌’గా అందరూ అభివర్ణించిన అయిదు ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికలలో ‘వార్‌ వన్‌ సైడ్‌’ అయింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న 4 రాష్ట్రాల్లోనూ మరోసారి పీఠం దక్కించుకొని, బీజేపీ ‘బుల్‌డోజర్‌’లా సాగింది. 5 రాష్ట్రాల్లో మూడింటిని ఒంటి చేతితో గెలుచుకున్న బీజేపీ, హంగ్‌ వచ్చిన గోవాలో సైతం మెజారిటీకి తగ్గిన ఒక్క సీటుకూ స్వతంత్రుల మద్దతు తీసుకొని, మరోసారి పీఠమెక్కడానికి సిద్ధమవుతోంది. మిగిలిన అయిదో రాష్ట్రం పంజాబ్‌ ఫలితం సైతం ఊహాతీతంగా ఏమీ లేదు. అక్కడ బలం లేని బీజేపీని పక్కకు నెట్టి, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) తన చీపురుతో కాంగ్రెస్‌ను ఊడ్చేసింది. సీఎం సీటు కోసం సొంత పార్టీలోనే అంతర్గత పోరాటాలకు పరిమితమైన పంజాబ్‌ కాంగ్రెస్‌ చతికిలపడింది. వెరసి, జాతీయ స్థాయిలో బీజేపీకి విశ్వసనీయమైన లౌకికవాద, ప్రజాస్వామ్య ప్రత్యామ్నాయ సృష్టిలో ప్రతిపక్షాలు విఫలమయ్యాయి. 

నిజానికి, యూపీలో 322 సీట్ల స్థాయి నుంచి బీజేపీ కొన్ని పదుల సీట్లను కోల్పోయినా, ఓటింగ్‌ శాతాన్ని పెంచుకుంది. అఖిలేశ్‌ యాదవ్‌ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) మునుపటి కన్నా 70 సీట్లకు పైగా గెల్చుకున్నా, అధికార పీఠానికి దూరంగానే మిగిలిపోయింది. సంక్లిష్ట కుల, ప్రాంత సమీకరణలతో బహుముఖ పోటీ ఉండే యూపీ లాంటి రాష్ట్రం ఈసారి కేవలం బీజేపీ, ఎస్పీల ద్విముఖ పోరుగడ్డగా మారిపోవడం గమనార్హం. ఈ పోట్లగిత్తల మధ్య బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ), కాంగ్రెస్‌ నలిగిపోయాయి. ప్రియాంక పగ్గాలు తీసుకొని ప్రచారం చేసినా, యూపీలో 3 శాతం కన్నా తక్కువ ఓట్లకే కాంగ్రెస్‌ పరిమితమైతే, ఒకప్పుడు యూపీ రాజకీయాలను శాసించిన బీఎస్పీ అవసానావశిష్టంగా మారిపోవడం మరో విషాదం. బడుగు వర్గాలకు ‘రేషన్‌’ – గూండా గిరీకి దూరంగా శాంతిభద్రతల ‘శాసన్‌’– యూపీలో బీజేపీకి కలిసొచ్చాయి. ఇంటింటా శౌచాల యాలు, చీకటి పడ్డా బయటకు రాగల ధైర్యమిచ్చే ‘సురక్ష’ లాంటివి మహిళలను భారీగా బీజేపీ వైపు నిలిపాయి. దశాబ్దాలుగా లేని విధంగా యూపీలో అధికార పక్షాన్నే రెండోసారీ పీఠమెక్కించాయి. 

ఎన్నికలలో గెలుపోటములు ఎక్కువగా భావనాత్మక అంశాల మీదే తప్ప, అసలు వాస్తవాల మీద ఆధారపడవంటారు. కోవిడ్‌ నిర్వహణలో వైఫల్యం, ధరల పెరుగుదల, ఉపాధి లేమి, రైతు ఉద్యమాలు, మధ్యతరగతి కష్టాలు, అధికారపక్షానికి సాధారణంగా ఎదురయ్యే వ్యతిరేకత లాంటి వేవీ బీజేపీ గెలుపును ఆపలేకపోయాయి. ప్రతి సందర్భంలో ‘వందేమాతరం, భారత్‌ మాతాకీ జై’ నినాదాలతో జాతీయతావాదానికి పేటెంట్‌ హక్కు తమదేనన్న భావన కలిగించడం బీజేపీ వ్యూహచతురత. భావోద్వేగాలను ప్రేరేపించే ఈ ప్రయత్నం తాజా ఎన్నికల్లోనూ ఫలించింది. పార్టీ అధికారంలో ఉన్న యూపీలో లఖిమ్‌పూర్‌ ఖేరీ, హాథ్రస్‌ లాంటి ఘటనలు, ఉత్తరాఖండ్‌లో సీఎంల మార్పులు, గోవాలో అంతర్గత బలహీనతల లాంటి ప్రతికూలతలున్నా – ఓటర్ల తీర్పు మాత్రం బీజేపీకే అనుకూలించింది. పోటాపోటీ ఉంటుందన్న ఉత్తరాఖండ్‌లో తుది తీర్పూ కాంగ్రెస్‌కు షాక్‌.

బీజేపీ, మోదీ ప్రభంజనాలకు ఇప్పటికైతే తిరుగులేదనే భావనను ఈ ఎన్నికలు కలిగించాయి. విశ్లేషకుల మాటల్లో చెప్పాలంటే, బూత్‌ స్థాయి వరకు పాతుకుపోయిన బలమైన యంత్రాంగం, ఏడేళ్ళ పైచిలుకు పాలనానుభవం, తీరని విస్తరణ దాహం బీజేపీకి ఇప్పుడు పెట్టని కోటలు. విభిన్న సమీకరణాల ఎన్నికల రాజకీయాల నిర్వహణలో ప్రస్తుతం దేశంలో మరే పార్టీ దానికి సాటి లేవు, పోటీ కావు. జాతీయ పార్టీ కాంగ్రెస్‌ దేశంలో ఇప్పుడు ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో మాత్రమే అధికారానికి పరిమితమైంది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు రాష్ట్రాలను కూడా తమ ఖాతాలో వేసుకుంటామని బీజేపీ తొడగొడుతోంది. పంజాబ్‌ ఓటమి కాంగ్రెస్‌ స్వయంకృతాప రాధమే. సీఎం పీఠం కోసం సిద్ధూ లాంటి సొంత పార్టీ నేతల ఆత్రం, అమరీందర్‌ తొలగింపు సహా అనేక అంశాల్లో అధిష్ఠానం తప్పులు పార్టీకి మరణశాసనం రాశాయి. పంజాబ్‌లో ‘ఆప్‌’ చరిత్రాత్మక మెజారిటీ సాధించిన వైనం చెప్పుకోదగ్గది. తీవ్రవాది అంటూ నిందించినా, అధికారంలోకి వస్తే చేసే అభివృద్ధి, సంక్షేమాల కార్డుతో కేజ్రీవాల్‌ పంజాబ్‌ కోటపై జెండా పాతారు. కాంగ్రెస్, బీజేపీ తర్వాత దేశంలో ఒకటికి రెండుచోట్ల అధికారంలో ఉన్న పార్టీ అనే ఘనతను ‘ఆప్‌’కు కట్టబెట్టారు. 

అయితే, ఈ అసెంబ్లీ ఎన్నికల గెలుపు 2024 సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ విజయాన్ని సుస్థిరం చేస్తుందా అన్నది ప్రశ్న. తాజా విజయోత్సాహంలో మోదీ అవునంటున్నా, అప్పుడే ఏమీ చెప్పలేం. మోదీ పాపులారిటీని, దేశవ్యాప్తంగా మానసిక సానుకూలతను కచ్చితంగా పెంచాయి. ఈ ఫలితా లతో ఆగస్టులో రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాలపై ఆధారపడాల్సిన అవసరం బీజేపీకి తగ్గిపోనుంది. ఈ ఏడాదే వచ్చే కశ్మీర్, గుజరాత్‌ ఎన్నికల్లోనూ ఈ హవా కొనసాగితే ఆశ్చర్యం లేదు. ప్రతిపక్షాల సంగతికొస్తే, జాతీయ వేదికపై ఇక బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి స్థానాన్ని కాంగ్రెస్‌ కోల్పోతుంటే, ఆ లోటు భర్తీకి ఆప్, తృణమూల్‌ సహా అనేకం పోటీ పడుతున్నట్టు కనిపిస్తోంది. ఒక రకంగా ఇది కాంగ్రెస్‌కు ఆఖరి మేలుకొలుపు. ఇప్పటికైనా నాయకత్వ లోపాలను సరిదిద్దుకోకపోతే కాంగ్రెస్‌కు భవిష్యత్తు కష్టమే. ఒక్క కాంగ్రెస్‌కే కాదు... ఇతర ప్రతిపక్షాలకూ ఈ ఎన్నికల ఫలితాలు పాఠం నేర్పాయి. ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా కలసి పోరాడితే తప్ప, మోదీనీ, బీజేపీనీ 2024లోనైనా సరే ఎదుర్కోవడం అంత సులభం కాదని స్పష్టం చేశాయి. కానీ, పీఠం మీద పైచేయి కోసం కాంగ్రెస్, కాంగ్రెసేతర కూటములుగా చీలి కలహించుకుంటున్న ప్రతిపక్షాలకు ఈ వాస్తవం తలకెక్కుతోందా?  

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top