
సంక్షేమానికి భారీగా కోత పెడుతూ అమెరికా, బ్రిటన్ ఏకకాలంలో తీసుకొచ్చిన బిల్లులు మంగళవారం ఆమోదం పొందాయి. అమెరికాలో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బిల్లు సంక్షేమానికి కోత పెట్టడంతో పాటు సంపన్నులు చెల్లించే పన్నుల్ని కూడా తగ్గించింది. అసలే రిపబ్లికన్లకు అరకొర మెజారిటీ ఉన్న సెనేట్‌లో ఆ పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. దాంతో అనుకూలురూ, వ్యతిరేకులూ సమంగా ఉన్న సభలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వేసిన ఒక్క ఓటుతో ఆ బిల్లు గట్టెక్కింది.
రిపబ్లికన్‌లకు ఆధిక్యత ఉన్న ప్రతినిధుల సభలో అది సునాయాసంగా ఆమోదం పొందుతుంది. బ్రిటన్‌లో లేబర్ పార్టీ ప్రభుత్వానికి అంత ‘అదృష్టం’ లేదు. బిల్లుపై లేబర్ పార్టీలో తిరుగుబాటు చెలరేగటంతో ఆఖరి నిమిషంలో ప్రధాని కియర్ స్టార్మర్ దాని తీవ్రతను తగ్గించారు. ఈ కోతల ద్వారా ఖజానాకు ఏటా 600 కోట్ల పౌండ్లు మిగిల్చాలన్నది లేబర్ ప్రభుత్వం ధ్యేయమైనా, బిల్లు గట్టెక్కటానికి వీలుగా దిగిరాక తప్పలేదు.
అగ్రరాజ్యాలు రెండింటిలో ఒకే రోజు సంక్షేమానికి కోత పెట్టే బిల్లులు రావటం ప్రభుత్వాల వైఖరిలో వచ్చిన మార్పునకు అద్దం పట్టాయి. తప్పుడు ప్రాథమ్యాలూ, అనవసర వ్యయాలతో ఖజానాలను ప్రభుత్వాలు దివాలా తీయిస్తూ, పర్యవసానంగా వచ్చిపడుతున్న సంక్షోభాల నుంచి గట్టెక్కటానికి పౌరుల పట్ల తమ బాధ్యతల్ని వదిలించుకో జూస్తున్నాయి. అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ వరకూ చాలా చోట్ల ఈ ధోరణే కొనసాగుతోంది. కాకపోతే ట్రంప్ దేన్నయినా బాహాటంగా చేస్తారు.
ట్రంప్ చర్య అమెరికాను రెండు రకాలుగా దెబ్బ తీయబోతోంది. దశాబ్దాలుగా పన్నుల ద్వారా వచ్చే ఆదాయానికి ఈ బిల్లు గండికొడుతుంది. దీన్ని పూడ్చుకోవటానికి ఆయన సంక్షేమంపై పడ్డారు. ఆరోగ్య బీమాకూ, ఆహార కూపన్లకూ కోత పెట్టడం వల్ల 2034 నాటికి అట్టడుగునున్న కోటి 20 లక్షలమంది జనాభాకు ఉన్న కాస్త ఆసరా ఎగిరిపోతుంది. ఆ మేరకు పన్నులు కూడా తగ్గిస్తున్నామన్న రిపబ్లికన్‌ల వాదన అర్థరహితం.
ఎందుకంటే పారిశ్రామికవేత్తల మాట అటుంచి వార్షిక ఆదాయం 2,17,000 డాలర్లున్న ఉద్యోగికి 12,500 మేర పన్ను మినహాయింపు లభిస్తుంది. కానీ వార్షిక ఆదాయం 35,000 డాలర్లున్న బడుగు ఉద్యోగికి లబ్ధి కేవలం 150 డాలర్లు. ఖజానా ఆదాయం పడిపోయాక తిరిగి అప్పులు చేయక తప్పదు గనుక 2034 కల్లా అమెరికా రుణం మరో 3.8 లక్షల కోట్ల డాలర్ల మేర పెరుగుతుంది.
ప్రభుత్వంలో అనవసర వ్యయాన్ని తగ్గిస్తామనే పేరిట ‘డోజ్’ ద్వారా భారీయెత్తున ఉద్యోగుల్ని ఇంటికి పంపిన ట్రంప్ ప్రభుత్వం తీరా సంపన్నులపై పన్నులు తగ్గించి దేశ రుణభారాన్ని మరింత పెంచుతోంది. ఇదంతా 2017లో తాను అమలు చేసిన పన్ను కోతల కొనసాగింపేనని ట్రంప్ అంటున్నా అందులో నిజం లేదు. దాన్ని కొనసాగించకపోతే పౌరులు అదనంగా 68 శాతం పన్నులు చెల్లించాల్సి వస్తుందని ఆయన ఊదరగొట్టారు.
ఇదంతా అంతర్గత సమస్య. కానీ దీని పర్యవసానాలు అంతర్జాతీయ వాణిజ్యంపై కూడా ఉంటాయి. బహుళజాతి సంస్థలపై పన్ను విధింపు గురించి జీ–7, ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (ఓసీడీఈ)లు 2021లో అమెరికాతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఒకచోట పన్ను రాయితీ పొందిన సంస్థపై వేరే దేశంలో పన్ను విధించటానికి ఈ ఒప్పందం అనుమతిస్తోంది. దాని ప్రకారం ట్రంప్ కోతలతో లాభపడే సంస్థలపై పన్నులు వేసే అధికారం వేరే దేశాలకుంటుంది. కానీ ఈ పరిస్థితిని ట్రంప్ సహిస్తారా? కెనడా వ్యవహారమే ఇందుకు ఉదాహరణ.
ఆ దేశం 2021 నాటి ఒప్పందానికి అనుగుణంగానే అమెరికన్ సంస్థలపై డిజిటల్ సర్వీస్ టాక్స్ (డీఎస్‌టీ) విధించింది. కానీ దీన్ని ఉపసంహరించుకోనట్టయితే భారీగా సుంకాలు విధిస్తానని ట్రంప్ హెచ్చరించటంతో కెనడా డీఎస్‌టీ వసూలు నిలిపివేసింది. బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ సైతం అమెరికా నుంచి ఇలాంటి ఒత్తిళ్లను ఎదుర్కొనక తప్పదు. అవి కెనడా మాదిరిగా రాజీకొస్తాయా లేదా అన్నది చూడాలి.
మొత్తానికి ట్రంప్ చర్యల వల్ల అంతర్జాతీయ వాణిజ్యంలో ఒక అనిశ్చితి ఏర్పడబోతోంది. గత ఒప్పందంతో ద్వంద్వ పన్నుల మోత నుంచి తప్పించుకున్న బహుళజాతి సంస్థలు ఇకపై చాలా దేశాల్లో పెద్ద మొత్తంలో పన్నులు చెల్లించాల్సి వస్తుంది. ఇది అంతిమంగా అమెరికాతో చాలా దేశాలకు వైషమ్యం తెస్తుంది.
ఆ సంగతలా ఉంచి సెనేట్ ఆమోదించిన కోతల బిల్లుపై ప్రతినిధుల సభలో రిపబ్లికన్ సభ్యులు ప్రభుత్వ వ్యయంపై మరింత కోత విధించాలని పట్టుబడుతున్నారు. అదే జరిగితే సాంఘిక భద్రతకు సంబంధించిన పథకాల్లో అత్యధిక భాగం రానున్న కాలంలో అదృశ్యమవుతాయి.
బ్రిటన్‌ది వేరే కథ. మానసిక వైకల్యం కారణంగా ఉద్యోగం చేయలేమంటున్న వారికిచ్చే పింఛన్ నిబంధనల్ని కఠినం చేయటం ద్వారా 480 కోట్ల పౌండ్లు ఆదా చేయొచ్చని స్టార్మర్ ఆశించారు. కానీ స్వపక్షం నుంచి వచ్చిన ఒత్తిళ్లతో ఆ నిబంధనల్ని కొత్త దరఖాస్తుదార్లకు పరిమితం చేశారు. దాంతో ప్రభుత్వం 200 కోట్ల పౌండ్లకు మించి ఆదా చేయలేకపోవచ్చని నిపుణుల అంచనా.
రిటైరైన వారికిచ్చే రాయితీలూ వగైరాలపై కూడా కోతలు గణనీయంగా ఉన్నాయి. వీటి పర్యవసానంగా 2030 నాటికి లక్షన్నర మంది పౌరులు పేదరికంలోకి జారుకుంటారని అంటున్నారు. ఏడాది క్రితం అధికారంలోకొచ్చిన స్టార్మర్ కన్సర్వేటివ్ పార్టీ అడుగు జాడల్లో పయనిద్దామని ప్రయత్నించి భంగపడ్డారు. కానీ అమెరికాలో ట్రంప్ మాటే నెగ్గింది. మొత్తానికి రానున్న కాలంలో ప్రపంచ వ్యాప్తంగా సంక్షేమానికి గడ్డు రోజులే.