అన్నదాతల ఆందోళన

Sakshi Editorial On Agriculture Bills

వ్యవసాయ రంగ ప్రక్షాళన కోసమంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు బిల్లులకు లోక్‌సభ ఆమోదముద్ర పడ్డాక ఎన్‌డీఏ ప్రభుత్వంనుంచి బీజేపీ మిత్రపక్షమైన అకాలీదళ్‌కు చెందిన మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ రాజీనామా చేశారు. తాము ఎన్‌డీఏ నుంచి కూడా తప్పుకునే అవకాశం వుందని ఆ పార్టీ చెబుతోంది. దేశంలో ‘హరిత విప్లవానికి’ దారి తీసిన నిర్ణయాల తర్వాత వ్యవసాయ రంగంలో భారీ సంస్కరణలు తీసుకురావడం ఇదే ప్రథమం. రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య(ప్రోత్సాహక, సులభతర) ఆర్డినెన్సు, రైతుల(సాధికార, పరిరక్షణ) ధరల హామీ, సాగు సేవల ఆర్డినెన్సు, నిత్యావ సర సరుకుల ఆర్డినెన్సుల స్థానంలో ఈ బిల్లులు తీసుకొచ్చారు.

ఇందులో నిత్యావసర సరుకుల బిల్లును రెండురోజులక్రితం ఆమోదించారు. తమ ఉత్పత్తులను ఇష్టం వచ్చినచోట అమ్ముకోవడా నికి, అవసరమైతే వేరే రాష్ట్రాల్లో కూడా నచ్చిన ధరకు అమ్ముకోవడానికి అవకాశమిచ్చే ఈ సంస్క రణల వల్ల రైతులకు లాభమే తప్ప నష్టం వుండదన్నది కేంద్రం వాదన. ఇవి అమల్లోకొస్తే రైతులకు దళారుల బెడద తప్పుతుందని కూడా చెబుతోంది. వాస్తవానికి ఈ మూడు ఆర్డినెన్సులు వచ్చిన ప్పుడే రైతుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఈ విషయంలో రైతుల అభిప్రాయాలు తెలుసుకుని, వారి సందేహాలను తీర్చేవిధంగా తగిన రక్షణలు పొందుపరిచాకే బిల్లులు తీసుకురావాలని, ఆర్డినెన్స్‌ల అమలు నిలిపేయాలని అకాలీదళ్‌ కోరినా కేంద్రం పట్టించుకోలేదు. సాగు రంగంలో సంస్కరణలు తీసుకురావాలని, రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించే చర్యలు తీసుకోవాలని ఆ రంగంలో పనిచేస్తున్న సంస్థలు, సాగు రంగ నిపుణులు ఎప్పటినుంచో డిమాండు చేస్తున్నారు. రెండేళ్లక్రితం మహారాష్ట్ర మారుమూల ప్రాంతాల నుంచి సీపీఎం అనుబంధ సంస్థ అఖిల భారత కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) ఆధ్వర్యంలో వేలాదిమంది రైతులు ముంబై మహానగరానికి తరలివచ్చిన దృశ్యాలు ఎవరూ మరిచిపోరు. తాము ఇప్పుడు తీసుకొచ్చిన సంస్కరణల పర్యవసానంగా రైతుల భవిష్యత్తు దివ్యంగా వుంటుందని ఎన్‌డీఏ ప్రభుత్వం చెబుతున్నప్పుడు వాస్తవానికి రైతుల నుంచి ఇంతగా ప్రతిఘటన రాకూడదు. ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలు ప్రధానంగా పంజాబ్, హర్యానాలకు పరిమితమైవుండొచ్చు గానీ...రైతు అనుకూల విధానాలు అవలంబిస్తున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాల రైతుల్లోనూ ఇలాంటి భయాలున్నాయి. 

దేశ ఆర్థిక వ్యవస్థలో సాగురంగానిది అత్యంత కీలక పాత్ర. కరోనా వైరస్‌ మహమ్మారి పంజా విసరడంతో దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ఈ ఏడాది తొలి త్రైమాసికంలో మన వృద్ధి రేటు మైనస్‌ 23.9 శాతానికి పడిపోయింది. నిరుడు ఇదే కాలానికి 5.2 శాతంగా వున్న జీడీపీ ఇంత దారుణంగా పడిపోయిన ఈ తరుణంలో కూడా సాగు రంగం 3.4 శాతం వృద్ధిని నమోదు చేసిందన్న వాస్తవాన్ని గమనిస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు ఆ రంగం ఎంత దన్నుగా నిలబడిందో అర్థమవుతుంది. సాగురంగం ఈ స్థాయిలో వుండకపోతే మన జీడీపీ మరింత అధోగతి పాలయ్యేది. కానీ అందుకు ప్రతిఫలంగా ఈ దేశం రైతుకు ఏమిచ్చింది? అన్ని రంగాలూ పడకేసిన దశలో కూడా ఇంత మంచి పనితీరు కనబరిచినందువల్ల రైతుకు ఒరిగిందేమీ లేదు. వారి ఆదాయం రెట్టింపుకావడం సంగతలా వుంచి కొత్తగా అంతో ఇంతో పెరిగిందేమీ లేదు.

గత రెండేళ్ల సంగతే తీసుకుంటే సాగు ఉత్పత్తుల ధరలు స్వల్పంగా పెరిగినా...అంతక్రితంతో పోలిస్తే పెరిగిన సాగు వ్యయానికి తగ్గట్టుగానైనా అవి లేవని నిపుణులు లెక్కలు చెబుతున్నారు. ఏతావాతా రైతుకు మిగిలేది ఎప్పుడూ అరకొరే. ప్రభు త్వాలు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)తో భారీయెత్తున సాగు ఉత్పత్తులు కొనుగోలు చేయడం, పల్లెసీమల్లో ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం వంటి చర్యలు నిరుపేదల్లో వినియోగాన్ని పెంచు తాయని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని వారి ప్రతిపాదన. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయంగా వుంది. 

సాగు సంస్కరణలే ధ్యేయంగా తీసుకొచ్చిన ఈ బిల్లులు చట్టాలైతే రైతులు తమ పంటల్ని దేశంలో ఏమూలనైనా అమ్ముకోవచ్చునని కేంద్రం చెబుతున్న మాటలు వినడానికి సొంపుగా వున్నాయి. కానీ మన రైతాంగంలో 86 శాతంమంది చిన్న రైతులు. వారిలో కూడా చాలామంది కౌలుదార్లు. సాగు వ్యయంతోనే నిండా మునిగివున్న రైతు వేల కిలోమీటర్ల దూరంలోని ఏదో రాష్ట్రంలో ‘మంచి ధర’ వస్తోందని విని తన ఉత్పత్తిని అక్కడికి తీసుకుపోగలడా? సాధ్యమేనా? చాలా సాగు ఉత్పత్తుల కదలికలకు ఇప్పుడు కూడా ఆంక్షలేమీ లేవు. అంతమాత్రాన రైతుకు ఒరిగిందేమిటి? ఇప్పుడున్న సాగు ఉత్పత్తుల మార్కెట్‌ కమిటీ(ఏపీఎంసీ)ల వ్యవస్థలోనే ఎన్నో లోపాలున్నాయని, వాటిని సవరించమంటే... అంతకన్నా అధ్వాన్నంగా వుండే విధానం అను సరించడం ఎంతవరకూ సబబని సాగు రంగ నిపుణుల ప్రశ్న. ఏపీఎంసీ వెలుపల అమ్ముకునే రైతులు మార్కెట్‌ సెస్, లెవీ చెల్లించనవసరం వుండదని బిల్లు చెబుతోంది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం పడిపోవడంతోపాటు సాగు ఉత్పత్తుల కొనుగోలు దారులనూ, కమిషన్‌ ఏజెంట్లనూ, ప్రైవేటు మార్కెట్లనూ నియంత్రించే వ్యవస్థ ఎగిరిపోతుంది. అంటే రాష్ట్రాల హక్కులకూ విఘాతం కలుగుతుంది.

చివరకు ఈ రంగంలో మున్ముందు కార్పొరేట్‌ గుత్తాధిపత్యం వేళ్లూనుకుని శాసిస్తుంది. పర్యవసానంగా అసలు ఎంఎస్‌పీయే ఉండబోదన్న భయం సరేసరి. ఇలాంటి సందేహాలను నివృత్తి చేసేవిధంగా, రైతుల ప్రయోజనాల పరిరక్షించే నిబంధనలతో ఈ బిల్లులు రూపొందితే ఎవరికీ అభ్యంతరాలుండేవి కాదు. రైతు సంఘాల అభిప్రాయాలు తీసుకుని, పార్లమెంటులో విస్తృతంగా చర్చించాక బిల్లులు రూపొందిస్తే రైతుల్లో ఆందోళన వుండేది కాదు. కనీసం వీటిని సెలెక్ట్‌ కమిటీకైనా పంపి కూలంకషంగా చర్చించాల్సింది. రాజ్యసభలో ఇంకా ఈ బిల్లులు పెట్టాలి గనుక ఆ దిశగా కేంద్రం ఆలోచించాలి. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top