ఆర్థిక స్వస్థతకు ప్రయత్నం | Sakshi Editorial About INDIAS IDEAS Conference By Narendra Modi | Sakshi
Sakshi News home page

ఆర్థిక స్వస్థతకు ప్రయత్నం

Published Fri, Jul 24 2020 12:16 AM | Last Updated on Fri, Jul 24 2020 12:31 AM

Sakshi Editorial About INDIAS IDEAS Conference By Narendra Modi

కరోనా వైరస్‌ మహమ్మారి కాటేస్తున్న వర్తమానంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) నెలన్నరక్రితం ప్రపంచ దేశాల ఆర్థిక స్థితిగతులపై కొన్ని అంచనాలు విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ కేవలం 1.9 శాతానికే పరిమితమవుతుందని ఆ సందర్భంగా తెలి పింది. అదే వాస్తవమైతే 1979 తర్వాత మన దేశ ఆర్థిక వ్యవస్థ ఈ స్థాయిలో దిగజారడం ఇదే తొలి సారవుతుంది. ఇతర సంస్థలు కూడా ఈ మాదిరి అంచనాలే వేశాయి. ఈ స్థాయిలో ఆర్థిక వ్యవస్థ మందగమనంలో పడితే దాని దుష్పరిణామాలు అసాధారణ స్థాయిలో వుంటాయి. ఒక అంచనా ప్రకారం దేశంలో సగం జనాభా పేదరికంలో కూరుకుపోవచ్చు.

ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాక మన ఆర్థిక వ్యవస్థ సాధించినదంతా ఆవిరైపోవచ్చు. పరిస్థితి ఇంత ప్రమాదకరంగా వున్నది గనుకే ప్రధాని నరేంద్ర మోదీ భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని అమెరికాలోని మదుపుదార్లకు బుధవారం పిలుపునిచ్చారు. అమెరికా–భారత్‌ వ్యాపార మండలి ఆధ్వర్యంలో జరిగిన ‘ఇండియా ఐడియాస్‌’ శిఖరాగ్ర సదస్సునుద్దేశించి ఆయన మాట్లాడారు. భారత్‌లో పెట్టుబడు లకు ఇదే మంచి సమయమని కూడా ఆయన సూచించారు. దీన్ని అతిశయోక్తిగా భావించనవసరం లేదు. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలతోపాటు మన ఆర్థిక వ్యవస్థ కూడా ఒడిదుడుకుల్లో పడొచ్చునని కీడు శంకించిన ఐఎంఎఫ్‌ సంస్థే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ కూడా ఒకటని తెలిపింది. కనుక సమర్థవంతంగా వ్యవహరిస్తే, సకాలంలో సానుకూల చర్యలు తీసుకోగలి గితే ఆర్థిక వ్యవస్థ పట్టాలెక్కడం కష్టం కాదని అనుకోవచ్చు. 

నరేంద్ర మోదీ ఈ శిఖరాగ్ర సదస్సులో మాట్లాడటానికి రెండురోజుల ముందు యూరప్‌ యూనియన్‌(ఈయూ) దేశాలన్నీ తమ తమ ఆర్థిక వ్యవస్థలకు ఊతం ఇవ్వడానికి 85,700 కోట్ల డాలర్ల ప్యాకేజీ అమలు చేయడానికి అంగీకారానికొచ్చాయి. అయిదురోజులపాటు ఏకబిగిన చర్చోపచర్చలు సాగించి, తమ మధ్య తలెత్తిన విభేదాలను తొలగించుకుని దీనిపై నిర్ణయం తీసు కున్నాయి. ఈయూ ఆవిర్భవించాక ఈ స్థాయి పెను సంక్షోభాన్ని ఎదుర్కొనడం ఆ సంస్థకు ఇదే ప్రథమం. ఆ మహమ్మారి సాగించిన విధ్వంసాన్ని చూసి నీరుగారిపోవడం కాక, దాన్నొక సవాలుగా తీసుకుని పునర్నిర్మాణానికి సిద్ధపడటం ఇప్పటి అవసరం. అలాంటి పునర్నిర్మాణం కోసమే ప్రధాని కూడా అమెరికా మదుపుదార్లకు పిలుపునిచ్చారు. మన దేశం ఇప్పటికే ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’ పేరిట 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా వస్తే మన ఆర్థిక వ్యవస్థ మళ్లీ వేగం పుంజుకోవడానికి అవకాశం వుంటుందన్నది కేంద్రం అంచనా.

గత అయిదారేళ్లుగా ప్రపంచంలో ఎక్కడ చూసినా ప్రపంచీకరణపై పునరాలోచన ప్రారంభమైంది. ఇన్నాళ్లూ ఆ విధానంతో లాభపడిన అమెరికాయే డోనాల్డ్‌ ట్రంప్‌ ఏలుబడిలో స్వరం మార్చి ఆత్మరక్షణ విధానాలు అమలు చేయడం మొదలుపెట్టింది. కానీ ఇప్పుడంతా మారింది. ఈ పెను విపత్తు నుంచి బయట పడాలంటే ప్రపంచ దేశాలన్నిటి మధ్యా పరస్పర సహకారం ఎంతో అవసరం. అమెరికా కూడా ఇందుకు మినహాయింపు కాదు. కరోనా వల్ల కుదేలైన దేశాల జాబితాలో అది అగ్రభాగాన వుంటుం దని ఆర్థిక నిపుణుల అంచనా. ఇప్పటికే అక్కడ లక్షలాది ఉద్యోగాలు పోయాయి. వైరస్‌ను నియం త్రించే వరకూ ఎలాగోలా నెట్టుకురావడం కోసమని 2 లక్షల కోట్ల డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించి అమలు చేస్తున్నా దాని వల్ల ఆశించిన ఫలితాలు రాలేదు. లాక్‌డౌన్‌లు సడలించాక అనేక రాష్ట్రాల్లో, నగరాల్లో కరోనా మళ్లీ ఉగ్రరూపం దాల్చడం మొదలెట్టింది. మరోపక్క కేర్స్‌ చట్టం కింద  నిరుద్యోగులకు వారానికి 600 డాలర్లు ఇచ్చే పథకం ఈ నెలాఖరుకు ముగియబోతోంది. ఇందువల్ల 3.30 కోట్లమంది కార్మికుల పరిస్థితి అనిశ్చితిలో పడుతుంది. వివిధ రాష్ట్రాలు, స్థానిక సంస్థలు ఆర్థిక సాయం కోసం అర్రులు చాస్తున్నాయి. 

మన ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్ర ఒత్తిళ్లలో పడింది. దేశంలో ఆర్థిక కార్యకలాపాలు దాదాపుగా స్తంభించిపోయాయి. మున్ముందు నెలల్లో పరిస్థితి మరింత దారుణంగా వుండొచ్చు. లాక్‌డౌన్‌లు తొలగించిన చోట డిమాండు పెరిగిన సూచనలు కనబడుతున్నాయని సంబరపడుతున్నవారున్నారు. కేంద్రం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ ఫలించిందనడానికి దాన్ని ఉదాహరణగా చూపుతున్న వారున్నారు. కానీ ఒక్కసారిగా లాక్‌డౌన్‌ నుంచి బయటికొచ్చినప్పుడు ఇది సర్వసాధారణంగా కనబడే ధోరణే. రానున్న రోజుల్లో కూడా ఇది నిలకడగా కొనసాగినప్పుడే మనం ఎంతో కొంత ఆశ పెట్టుకోవచ్చు. ఈఎంఐల చెల్లింపుపై బ్యాంకులు విధించిన ఆర్నెల్ల కాల పరిమితి వచ్చే నెలతో ముగుస్తుంది. ఆ తర్వాత ఎవరెంతవరకూ చెల్లించగలరన్నది అనుమానమే. ఆ రుణాల్లో ఎంత భాగం వెనక్కొస్తాయన్నది ప్రశ్నార్థకం. ఆ మేరకు బ్యాంకుల ఎన్‌పీఏలు పెరుగుతాయి. వ్యాధిగ్రస్తులకు సకా లంలో సరైన ఔషధాన్ని అందించగలిగితే వారు వేగంగా కోలుకుని మెరుగైనట్టే ఆర్థిక వ్యవస్థలకు వెన్నుదన్నుగా నిలవగలిగే పథక రచన చేస్తే అవి మళ్లీ నిటారుగా నిలబడతాయి.

ఈ కరోనా మహమ్మారి సమయంలో కూడా భారత్‌ ఏప్రిల్‌–జూలై మధ్య 2,000 కోట్ల డాలర్ల ఎఫ్‌డీఐలను ఆకర్షించగలిగిందని, అమెరికా నుంచి ఇప్పటికే మరో 4,000 డాలర్ల మేర పెట్టుబడులకు వాగ్దానా లొచ్చాయని మోదీ చెబుతున్నారు. మంచిదే. ఇవన్నీ ఫలప్రదమైతే ఉపాధి అవకాశాలు మెరుగుపడి ప్రజల్లో కొనుగోలు శక్తి పుంజుకునే అవకాశం వుంటుంది. అయితే కరోనా మహమ్మారికి ముందు నుంచే మన దేశంలో ఆర్థిక మందగమనం ఛాయలు కనబడటం మొదలైంది. కానీ అప్పట్లో దీటుగా స్పందించలేకపోయాం. వివాదమంతా గణాంకాల చుట్టూ తిరిగింది. ఏదేమైనా మోదీ ఇచ్చిన తాజా పిలుపు పర్యవసానంగా పెట్టుబడులు వృద్ధి చెంది, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ సాధ్యపడుతుందని ఆశించాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement