ఆన్‌లైన్‌ విద్యకు మార్కులు

Editorial On Pratham Education Report 2020 - Sakshi

దేశంలో విద్యావ్యవస్థ స్థితిగతులపై ఏటా స్వచ్ఛంద సంస్థ ప్రథమ్‌ విడుదల చేసే వార్షిక విద్యాస్థాయి నివేదిక(అసర్‌)లు దాదాపు నిరాశానిస్పృహలే మిగులుస్తాయి. నాలుగోతరగతి పిల్లలు ఒకటో తరగతి లెక్కలు కూడా చేయలేకపోతున్నారని... అయిదో తరగతి పిల్లలు మూడో తరగతి పుస్తకాన్ని కూడా తప్పులు లేకుండా చదవలేకపోతున్నారని అది గతంలో చాలాసార్లు చెప్పింది. మన దేశంలో పదేళ్లక్రితం ఆర్భాటంగా మొదలైన విద్యాహక్కు చట్టం ఆచరణలో ఎంత ఘోరంగా విఫలమైందో చెప్పడానికి ఆ సర్వేలు సజీవ సాక్ష్యంగా నిలుస్తాయి. ఆ చట్టం వల్ల కేవలం విద్యార్థుల నమోదు పెరిగింది తప్ప, హాజరు శాతం అందుకు దీటుగా వుండటం లేదని ఆ నివేదికలు తరచు చెబుతుంటాయి. అయితే ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నమైన పరిస్థితుల్లో అసర్‌ నివేదిక విడు దలైంది. కరోనా వైరస్‌ మహమ్మారి విరుచుకుపడిన పర్యవసానంగా విధించిన లాక్‌డౌన్‌తో విద్యాసంస్థలన్నీ మూతబడ్డాయి. విద్యాసంస్థలు తెరవడానికి ప్రభుత్వాలు సాహసించడం లేదు. దానికి బదులు ఆన్‌లైన్‌ పాఠాలవైపు మొగ్గుచూపడం మొదలైంది. తాజా నివేదిక ఈ ఆన్‌లైన్‌ బోధన ఎలావుందన్న అంశంపై ప్రధానంగా దృష్టిసారించింది.

అది తీసుకొచ్చిన కొత్తరకం అసమానత లేమిటన్నదీ వెల్లడించింది. ఇక పల్లెసీమల్లో ప్రైవేటు పాఠశాలలనుంచి ప్రభుత్వ పాఠశాలలవైపు వలసపోయే ధోరణి గత రెండేళ్ల మాదిరే ఈసారి కూడా పెరిగిందని ఆ నివేదిక చెబుతోంది. ఇందుకు కారణం ఆ పిల్లల తల్లిదండ్రుల ఆదాయాలు పడిపోవడం వల్లనేనని అసర్‌ నివేదిక అభిప్రాయం. అయితే కేవలం ఇదొకటే కారణమని చెప్పలేం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, పంజాబ్‌ వంటి రాష్ట్రాలు విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయి. తెలం గాణలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థలు ఏటా సాధిస్తున్న విజయాలు ఎన్నదగినవి. ఆ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న 268 గురుకుల పాఠశాలల పిల్లలు ప్రతిష్టాత్మకమైన ఐఐటీ, నిట్, ఢిల్లీ యూనివర్సిటీ, అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్సిటీ, టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ వంటి చోట్ల ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశం సంపాదించగలుగుతున్నారు.

కేవలం చదువుల్లోనే కాదు... ఇతరత్రా అంశాల్లో కూడా ముందంజలో వుంటున్నారు. అటు ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిననాటినుంచి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. సకల సౌకర్యాలతో పాఠశాలల్ని అద్భుతంగా తీర్చిదిద్దు తున్నారు. పిల్లలకు పాఠ్యపుస్తకాలు మొదలుకొని యూనిఫాం వరకూ అన్నిటినీ అందజేస్తున్నారు. ప్రభుత్వాలు ఇలా ప్రత్యేక శ్రద్ధ పెట్టి బడుల్ని బాగు జేస్తుంటే ప్రైవేటు విద్యాసంస్థలవైపు సహజం గానే ఎవరూ వెళ్లరు. 

ఈసారి కొత్తగా అమల్లోకొచ్చిన ఆన్‌లైన్‌ విద్యావిధానానికి పిల్లలు అలవాటు పడ్డారని అసర్‌ నివేదిక చెబుతోంది. రెండేళ్లక్రితం పరిస్థితితో పోలిస్తే ఇప్పుడు పిల్లలున్న కుటుంబాల్లో స్మార్ట్‌ ఫోన్‌ల వాడకం బాగా పెరిగిందని వివరిస్తోంది. హాజరుపట్టీల్లో నమోదైన పిల్లల్లో 61.8 శాతంమందికి స్మార్ట్‌ఫోన్‌లున్నాయని, రెండేళ్లక్రితం కేవలం 36.5 శాతం పిల్లల ఇళ్లలో మాత్రమే అవి వుండేవని నివేదిక వెల్లడించింది. లాక్‌డౌన్‌ అనంతర పరిస్థితుల్లో ఉపాధి కోల్పోయినా అదనంగా ఇంతమంది స్మార్ట్‌ఫోన్‌లు కొనడం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే తమ పిల్లలు ఎలాగైనా చదువుల్లో ఉన్నతంగా వుండాలన్న లక్ష్యంతో అప్పో సప్పో చేసి ఆ ఫోన్‌లు కొనేవారు తప్పనిసరిగా వుంటారు. స్మార్ట్‌ ఫోన్‌ వున్నంతమాత్రాన అంతా సవ్యంగా వుందనుకోలేం. ఒకరే సంతానం వున్న ఇంట్లో ఫర్వా లేదుగానీ... ఒకరికి మించి పిల్లలున్నచోట సమస్యే. వేర్వేరు తరగతుల పిల్లలకు ఒకే సమయంలో బోధన సాగుతున్నప్పుడు తమ పిల్లల్లో ఆ ఫోన్‌ ఎవరికి ఇవ్వాలన్నది తల్లిదండ్రులు తేల్చుకోలేరు.

ఇలాంటి సందర్భాల్లో చాలాసార్లు ఆడపిల్లలకే అన్యాయం జరుగుతుందని చెప్ప నవసరం లేదు. అయితే ఆన్‌లైన్‌ విద్య వల్ల కుటుంబాల్లో పిల్లలపట్ల శ్రద్ధ కనబరిచే ధోరణి పెరి గిందని అసర్‌ నివేదిక అంటోంది. తల్లిదండ్రులు, తోడబుట్టినవారి సాయం పిల్లలకు అందుతోం దని గణాంకాలు వెల్లడించాయి. తల్లిదండ్రులు అయిదో తరగతి వరకూ చదువుకున్నవారైతే తమ పిల్లలకు ఏదో రూపంలో తోడ్పాటు అందిస్తున్నారని నివేదిక తేల్చింది. 54.8 శాతంమంది పిల్లలకు ఇలా సాయం అందుతోందని అది వివరించింది. తమకు తెలియని సందర్భాల్లో ఇరుగు పొరుగునో, టీచర్‌నో ఆశ్రయించి తమ పిల్లలకు మెరుగ్గా అర్థమయ్యేందుకు వారు తోడ్పడుతున్నారట. 

ఈసారి బడులు మూతబడ్డాయి కనుక ప్రథమ్‌ సంస్థ ఫోన్‌ల ద్వారానే తల్లిదండ్రుల్ని, ఉపా ధ్యాయుల్ని ప్రశ్నలడిగి సమాచారం రాబట్టింది. నేరుగా వారితో మాటామంతీ జరిపితే మరింత లోతైన సమాచారం వెల్లడవుతుంది. అతి సామాన్య కుటుంబాల్లో కూడా పిల్లల చదువులపై నేరుగా తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టే ధోరణి పెరగడం మంచిదే. ఇది ఆన్‌లైన్‌ విద్యావిధానం తీసుకొచ్చిన సుగుణం. అయితే బడివిద్యకు ఆన్‌లైన్‌ విద్య ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదు. తరగతి గదిలో పిల్లలు కేవలం పుస్తకాల్లో వుండే జ్ఞానాన్ని మాత్రమే కాక, అనుభవజ్ఞానాన్ని కూడా సంపాదిస్తారు. పిల్లలకూ, టీచర్లకూ మధ్య... పిల్లలమధ్య జరిగే సంభాషణలు వారికి వికాసానికి తోడ్పడతాయి.

అయితే బడులు తెరుచుకున్న దేశాల్లో అనుభవాలు చూస్తే భయం కలుగుతుంది. స్వేచ్ఛగా, ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన పిల్లలు తెలియని ఒక ఉద్రిక్త వాతావరణంలో దూరం దూరంగా... భయంభయంగా తరగతి గదుల్లో కూర్చుంటున్నారు. ఇక ఆటపాటల మాట చెప్పన వసరమే లేదు. ఈ సమస్యనుంచి సాధ్యమైనంత త్వరగా ప్రపంచం గట్టెక్కగలిగితే మళ్లీ బడులు మునుపట్లా కళకళలాడతాయి. ఈలోగా బడుల్లో మౌలిక సదుపాయాలు మొదలుకొని విద్యాబోధన వరకూ అన్ని లోపాలను ప్రభుత్వాలు చక్కదిద్దాలి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top