
తబ్లీగీ జమాత్‌తో సంబంధాలుండి, కరోనా మహమ్మారి వ్యాపించిన కాలంలో అక్రమంగా 190 మంది విదేశీయులకు వివిధ మసీదుల్లో ఆశ్రయం కల్పించిన కేసుల్లో మన పౌరులు 70 మందిపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లనూ, తదుపరి విచారణలనూ, వివిధ కేసుల కింద వారిపై దాఖలైన చార్జి షీట్లనూ కొట్టివేస్తూ ఢిల్లీ హైకోర్టు గురువారం వెల్లడించిన తీర్పు అనేక విధాల ఎన్నదగినది. 2020 మార్చిలో 24 తేదీ నుంచి 30 వరకూ 195 మంది విదేశీయులకు ఆశ్రయమిచ్చారన్నది వీరిపై ప్రధాన ఆరోపణ. వాస్తవానికి విదేశీయుల్ని కూడా ఎఫ్‌ఐఆర్‌లలో ప్రస్తావించినా చార్జిషీట్లు దాఖ లైన సమయానికి వారి పేర్లు తొలగించారు.
ఒక నేరానికి రెండుసార్లు శిక్షించరాదన్న సూత్రాన్ని ఆధారం చేసుకుని కొందరిపై చార్జిషీట్ల దాఖలు సమయంలోనే మేజిస్ట్రేట్ కోర్టు నిరాకరించింది. ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో వేలాది మందితో మార్చి మొదటివారంలో నిర్వహించిన మతపరమైన కార్యక్రమం సందర్భంగా ఈ కేసులు దాఖలయ్యాయి. అప్పుడున్న ప్రత్యేక పరిస్థితి వేరు. అది కోవిడ్ మహమ్మారి వ్యాపిస్తున్న సమయం. అందువల్ల వేలమంది కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా ఒకచోట గుమిగూడారన్నది ఆందోళనకరమే. చట్టవిరుద్ధమైనప్పుడు ఎవరినీ ఉపేక్షించాల్సిన అవసరం లేదు. కానీ అదేమీ రహస్య సమావేశం కాదు. ఆ కార్యక్రమానికి ప్రభుత్వ విభా గాల నుంచి నిర్వాహకులు ముందస్తు అనుమతులు పొందారు.
మార్చి 24న రాత్రి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించగా, అంతకుముందు మార్చి 13న దేశవ్యాప్తంగా అంటురోగాల చట్టం అమలవు తుందని ప్రకటించారు. అప్పటికి కూడా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కరోనా వైరస్‌ను ‘ఆరోగ్యపర మైన ఆత్యయిక స్థితి’గా ఇంకా పరిగణించటం మొదలుపెట్టలేదు. అంతక్రితం అనుమతులిచ్చినా వాటిని రద్దుచేయకపోవటానికి ప్రభుత్వ విభాగాల్లో వ్యాధి తీవ్రత, పెనువేగంతో వ్యాపించే దాని తీరుతెన్నులపై అవగాహన లేకపోవటమే కారణం. తబ్లీగీ నిర్వాహకులు చెబుతున్న కారణాలు కూడా వున్నాయి. వ్యాధి తీవ్రత అర్థమైన తర్వాత అందరినీ స్వస్థలాలకు పంపించాలని నిర్ణయించినా లాక్‌డౌన్ వల్ల సాధ్యపడక వివిధ మసీదుల్లో ఆశ్రయమివ్వక తప్పలేదని వారి సంజాయిషీ.
కానీ ఈ కార్యక్రమాన్ని ప్రధాన స్రవంతి మీడియాతోపాటు సామాజిక మాధ్యమాలు ఒక భూతంలా చిత్రించాయి. కరోనా మహమ్మారిని వ్యాప్తి చేయటం కోసం కుట్రపూరితంగా ఈ కార్య క్రమాన్ని నిర్వహించారన్న అపవాదు వేశారు. తబ్లీగీ ఒక ‘సూపర్ స్ప్రెడర్’ అనీ, దానివల్ల 4,000 మంది కరోనా బారిన పడ్డారని ప్రచారం సాగించారు. వారు సక్రమంగా వీసాలు తీసుకుని వచ్చిన విదేశీయులనీ, ఆ కార్యక్రమానికి అన్ని అనుమతులూ ఉన్నాయనీ తెలియనట్టు నటించారు. వచ్చిన వారంతా నిబంధనల ప్రకారం తమ తమ దేశాల్లో, భారత్ గడ్డపై అడుగుపెట్టాక ఇక్కడ కరోనా పరీక్షలు జరిపించుకుని, ఆ వైరస్ లేదని నిర్ధారణ అయినవారు.
కరోనా తీవ్రత దాఖలా కనబడ్డాక నిర్వాహకుల వద్దకెళ్లి వెంటనే నిలిపేయాలని ఉత్తర్వులిస్తే తప్పు బట్టాల్సిన పని లేదు. అది చేయ కుండా, విదేశాల నుంచి వచ్చినవారికి ప్రత్యామ్నాయ సదుపాయాలేమీ కల్పించకుండా మసీదుల్లో రహస్యంగా ఆశ్రయం పొందినట్టు చూపటం ద్వారా సాధించిందేమిటి? ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అది పూర్తయ్యాక ప్రచారం నిమిత్తం దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లారు.అలాంటి వారిపై తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల్లో సైతం కేసులు నమోదయ్యాయి.
తబ్లీగీ కార్యక్రమాలు మన దేశానికి కొత్తగాదు. ప్రతి యేటా జరుగుతుంటాయి. ఢిల్లీకి సమీపంలోని మేవాత్‌లో మౌలానా మహమ్మద్ ఇలియాసి అనే ఆధ్యాత్మికవేత్త ముస్లిం మతానుయాయుల్లో ఆధ్యాత్మికత సన్నగిల్లుతున్నదని, స్వార్థం పెరిగి స్వప్రయోజనాలే పరమావధి అవుతున్నదని భావించి వారిలో కరుణ, దయ, నిరాడంబరత, ఆధ్యాత్మికత పెంపొందించటానికి తబ్లీగీని ప్రారంభించారు. దీనికి విదేశాల్లో సైతం ఆదరణ లభించటం, అక్కడినుంచి ఏటా వందల సంఖ్యలో హాజరై మతపరమైన మౌలిక విలువలు గ్రహించి, అటు తర్వాత ఆ మతస్థుల్లో వాటిని ప్రచారం చేయటం రివాజుగా వస్తోంది. తబ్లీగీ ప్రధాన కార్యాలయం మర్కజ్ మసీదులోనే వుంటుంది.
బొంబాయి హైకోర్టు తబ్లీగీ అనుయాయుల విషయంలో పోలీసుల వైఖరిని 2021లో తీవ్రంగా తప్పు బట్టింది. మతపరమైన ఆదర్శాన్నీ, సంస్కరణనూ బోధించే యువకులను కోవిడ్ వ్యాప్తిచెందిన సమయంలో ఆదుకోవాల్సింది పోయి, వారిని జైలుపాలు చేయటం, అక్కడ దుర్భర పరిస్థితుల మధ్య వారు గడపాల్సి రావటం విచారకరమని వారిని విడుదల చేస్తూ ఇచ్చిన తీర్పులో న్యాయ మూర్తులు వ్యాఖ్యానించటం గమనార్హం. మద్రాసు, కర్ణాటక హైకోర్టులు సైతం తబ్లీగీలపై కేసులు బనాయించటం, వారిని నిర్బంధించటం అహేతుకం, అన్యాయం అని దుయ్యబట్టాయి.
తాజాగా ఢిల్లీ హైకోర్టు 70 మంది పౌరులను వివిధ కేసుల నుంచీ, ఎఫ్‌ఐఆర్‌ల నుంచీ, విచా రణల నుంచీ విముక్తుల్ని చేయటం హర్షించదగ్గది. తప్పుడు ప్రచారాలకు దిగి, విద్వేషాలను రెచ్చ గొట్టి తాత్కాలికంగా లబ్ధిపొందేవారు ఈ దేశంలో స్వతంత్ర న్యాయవ్యవస్థ వున్నదని, కొంత ఆలస్యం జరిగినా అంతిమంగా న్యాయం లభించటం ఖాయమని గుర్తించటం లేదు. సామాజిక మాధ్యమాల మాటెలా వున్నా, ప్రధాన స్రవంతి మీడియా సైతం వార్తలకు మతం రంగు పులిమి అపచారం చేస్తున్నదని సాక్షాత్తూ సుప్రీంకోర్టు 2021 సెప్టెంబర్‌లో వ్యాఖ్యానించింది. తాజా తీర్పయినా అటువంటివారి కళ్లు తెరిపించాలి. బాధ్యతాయుత ప్రవర్తనా శైలినీ, జవాబుదారీ తనాన్నీ వారిలో పెంపొందించాలి.