‘ఉప’ ఫలితాలతో ఉత్సాహం

Bihar Elections And Bye Elections In Certain States Given Boost To BJP - Sakshi

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలతోపాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికలు కూడా బీజేపీకి, ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమికి ఉత్సాహాన్నిచ్చాయి. ముఖ్యంగా మధ్యప్రదేశ్, గుజరాత్‌ ఫలితాలు బీజేపీని బాగా సంతోషపరిచాయి. మధ్యప్రదేశ్‌లో 28 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో 19 స్థానాలను చేజిక్కించుకోవడం ఆ రాష్ట్రంలో బీజేపీకి జవసత్వాలనిచ్చింది. ఆ పార్టీ బలం ఒక్కసారిగా 126కి పెరిగింది.

కరోనా వైరస్‌ దేశమంతా అలుముకున్న తొలి దినాల్లో... అంటే మొన్న మార్చిలో అక్కడ రాజకీయ సంక్షోభం రాజుకుని జ్యోతిరాదిత్య సింథియాకు మద్దతుగా 22మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌నుంచి బయటికొచ్చారు. దాంతో అప్పటికి 15 నెలలుగా అధికారంలో కమల్‌నాథ్‌ నేతృత్వం లోని కాంగ్రెస్‌ సర్కారు విశ్వాస పరీక్ష ఎదుర్కొనడానికి ముందే రాజీనామా చేసింది. బీజేపీ సీనియర్‌ నేత శివ్‌రాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది.

107మంది సభ్యుల బలంతో అప్పటినుంచీ అది నెట్టుకొస్తోంది. రాజీనామాలవల్ల, ఇతరత్రా కారణాలతో మొత్తం 28 స్థానాలు ఖాళీ కాగా వాటికి గత నెలలో ఉప ఎన్నికలు జరిగాయి. తగినంత బలం లేకున్నా పాలన సాగించవలసి వస్తోంది గనుక శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తరచు తనను తాను ‘తాత్కాలిక సీఎం’గా చెప్పుకునేవారు. 2005 నుంచి 2018 వరకూ పాలించిన చౌహాన్‌కు ఇలాంటి సమస్య ఎప్పుడూ ఎదురుకాలేదు. అయితే నెగ్గినవారిలో అత్యధికులు కాంగ్రెస్‌ నుంచి పార్టీలోకొచ్చిన జ్యోతిరా దిత్య సింథియా అనుయాయులు. వారు పార్టీ కన్నా జ్యోతిరాదిత్యకే విశ్వాసపాత్రులుగా వుంటారు. కనుక చౌహాన్‌పై మున్ముందు ఒత్తిళ్లు తప్పకపోవచ్చు. గతంలో ఆయనది ఏకచ్ఛత్రాధిపత్యం.

ఈ ఉప ఎన్నికలు ఇటు జ్యోతిరాదిత్యకూ, అటు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ సీఎం కమల్‌నాథ్‌కూ పెద్ద పరీక్షగా మారాయి. తన అనుచర గణాన్ని గెలిపించుకోలేకపోతే బీజేపీలో జ్యోతిరాదిత్య స్థానం బలపడదు. అలాగే ఇన్నాళ్లూ జ్యోతిరాది త్యకు పార్టీ బలమే తప్ప సొంత బలమేమీ లేదని చెబుతూ వస్తున్న కమల్‌నాథ్‌పై దాన్ని నిరూపించ వలసిన భారం పడింది. అందువల్లే ఉప ఎన్నికల ఫలితాలతో ఆయన డీలా పడ్డారు. గ్వాలియర్‌– చంబల్‌ ప్రాంతంలో తనకు రాజకీయంగా పట్టుందని జ్యోతిరాదిత్య రుజువు చేసుకున్నారు. మరో 9 స్థానాల్లో ఫిరాయింపుదార్లను ఓడించి, విజయం సాధించడమే కాంగ్రెస్‌కు ఉన్నంతలో ఓదార్పు. 

అచ్చం మధ్యప్రదేశ్‌ తరహాలోనే గుజరాత్‌లో కూడా 8మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల సమయంలో బీజేపీకి ఫిరాయించారు. వారిలో అయిదుగురికి ఉప ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్లు లభించాయి. తాజాగా ఈ ఎనిమిదిచోట్లా కాంగ్రెస్‌ ఓడిపోయింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అత్తెసరు మెజారిటీయే లభించింది. 182మంది సభ్యుల అసెంబ్లీలో 1995 తర్వాత తొలిసారి ఆ పార్టీ బలం 99కి పడిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ దీర్ఘకాలం సీఎంగా పనిచేసిన బీజేపీకి ఇది భంగ పాటే. 2017 ఎన్నికల్లో కాంగ్రెస్‌ 77 స్థానాలు గెల్చుకుంది. 2022లో అసెంబ్లీ ఎన్నికలు జరిగేనాటికి సీఎం విజయ్‌ రూపానీని మార్చే అవకాశం వుందన్న కథనాలు వెలువడుతున్న దశలో అన్ని స్థానా లనూ పార్టీ గెల్చుకోవడం రూపానీకి రాజకీయంగా కలిసొచ్చే అంశం. మణిపూర్‌లో కాంగ్రెస్‌ నుంచి బీజేపీకి అయిదుగురు ఎమ్మెల్యేలు ఫిరాయించడంతో ఉప ఎన్నికలు అవసరమయ్యాయి.

తాజా ఉప ఎన్నికల్లో బీజేపీ నాలుగు గెల్చుకోగా, మరోచోట ఇండిపెండెంట్‌ అభ్యర్థి నెగ్గారు. యోగి ఆదిత్యనాథ్‌ ఏలుబడిలోని ఉత్తరప్రదేశ్‌లో ఉప ఎన్నికలు జరిగిన ఏడు స్థానాల్లో ఆరింటిని బీజేపీ గెల్చుకుంది. ఒక చోట సమాజ్‌వాదీ పార్టీ స్వల్ప ఆధిక్యతతో సీటు నిలబెట్టుకుంది. అత్యాచారం, హత్య కేసుల్లో శిక్ష అను భవిస్తున్న బీజేపీ మాజీ ఎమ్మెల్యే కులదీప్‌ సెంగార్‌ నేతృత్వంవహించిన బంగార్‌మవ్‌ నియోజక వర్గంలో సైతం బీజేపీ అభ్యర్థే విజయం సాధించారు. హథ్రాస్‌లో యువతిపై అత్యాచారం, ఆమె భౌతి కకాయానికి అర్థరాత్రి పోలీసులే అంత్యక్రియలు జరపడం వంటి ఘటనల ప్రభావం ఉప ఎన్నికలపై కనబడకపోవడం గమనించదగ్గది. ఉత్తరప్రదేశ్‌ ఫలితాలకు విపక్షాల బాధ్యత కూడా వుంది.

ఈ ఏడు చోట్లా నేరుగా యోగి ఆదిత్యనాథ్‌ సభలూ, సమావేశాలూ నిర్వహించారు. మాజీ సీఎంలు అఖిలేష్‌ యాదవ్, మాయావతి, కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియింకగాంధీ ఒక్కచోట కూడా ప్రచారానికి వెళ్లలేదు. తెలంగాణలో ఉప ఎన్నిక జరిగిన దుబ్బాక స్థానాన్ని టీఆర్‌ఎస్‌ చేజార్చుకుంది. అక్కడ బీజేపీ విజయం సాధించింది. ఉన్నంతలో ఛత్తీస్‌గఢ్, హరియాణాల్లో రెండు స్థానాలు, జార్ఖండ్‌లో జేఎంఎంతో కలిసి రెండు స్థానాలు గెల్చుకోవడం మాత్రమే కాంగ్రెస్‌కు ఊరట. అయితే జార్ఖండ్‌లో అటు జేఎంఎంకూ, ఇటు కాంగ్రెస్‌కూ గతంలోకన్నా మెజారిటీ బాగా తగ్గడం ఆందోళన కలిగించే అంశమే. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన సాగు బిల్లులపై ఆందోళన జరుగుతున్న హరియాణాలో బరోడా స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ–జేజేపీ ఉమ్మడి అభ్యర్థి ఓడిపోవడం గమనార్హం. కర్ణాటకలో జరిగిన రెండు ఉప ఎన్ని కల్లోనూ ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వచ్చాయి.        

ఉప ఎన్నికల ఫలితాలకూ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకూ చాలా వ్యత్యాసం వుంటుంది. సాధా రణంగా ఉప ఎన్నికలు వాటికవే ఒక ధోరణిని ప్రతిబింబించవు. ఎక్కువ సందర్భాల్లో ఉప ఎన్నికల్లో ఫలితాలు ఆయా రాష్ట్రాల్లో వుండే అధికార పక్షాలకు అనుకూలంగా వుండే అవకాశం వున్నా అభ్యర్థి ఎంపిక మొదలుకొని అతి విశ్వాసం వరకూ... స్థానిక సమస్యలతో మొదలుపెట్టి కుల సమీకరణాల వరకూ ఎన్నెన్నో అంశాలు వాటిని ప్రభావితం చేస్తాయి. ఈ అంశాల్లో ఎక్కడ లెక్క తప్పినా పార్టీలకు సమస్యలెదురవుతాయి. అధికారంలో వున్న పక్షం నగుబాటుపాలవుతుంది. త్వరలో అసెంబ్లీ ఎన్ని కలో, మరో ఎన్నికలో వచ్చే అవకాశం వుంటే ఈ ఫలితాలను చూపి  భవిష్యత్తు తమదేనని శ్రేణులకు చెప్పుకోవడానికి ఏ పార్టీకైనా అవకాశం వుంటుంది. అందుకే అధికారంలో వున్న పార్టీ ఉప ఎన్నికల్లో సర్వశక్తులూ కేంద్రీకరిస్తుంది. మొత్తానికి ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు నిరాశ మిగల్చగా, బీజేపీకి ఉత్సాహాన్నిచ్చాయి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top