రాజమహేంద్రవరం సిటీ: రైలు నుంచి జారి పడి సుమారు 45 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి ఆదివారం మృతి చెందినట్టు రాజమహేంద్రవరం జీఆర్పీ ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. గోదావరి రైల్వే స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనలో మృతుని వద్ద ఏ ఆధారాలు లభ్యం కాలేదన్నారు. ఈ విషయమై కేసు నమోదు చేసి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. వివరాలు తెలిసిన వారు 99086 22211, 0883 244 2821 నంబర్లను సంప్రదించాలన్నారు.
కాలువలో మునిగి వ్యక్తి మృతి
రంపచోడవరం: ఏజెన్సీ అందాలు తిలకించి తిరుగు ప్రయాణంలో ఐ.పోలవరం వద్ద సీతపల్లి వాగులో మునిగి ఒక వ్యక్తి మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్‌ఐ రమేష్ తెలిపారు. రాజానగరం మండలం భూపాలపట్నానికి చెందిన 15 మంది పర్యాటకులు ఆదివారం కారు, బైక్‌లో రంపచోడవరం ప్రాంతంలో తిరిగి సాయంత్రం 4 గంటల సయయంలో ఐ.పోలవరం వద్ద సీతపల్లి వాగులోకి స్నానానికి దిగారు. వారిలో పంతం సూర్యభగవాన్ (27) వాగులో పడి మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. సంఘటన స్థలాన్ని రంపచోడవరం సీఐ నరేంద్రప్రసాద్ పరిశీలించారు. ఏజెన్సీ ప్రాంతానికి వచ్చే పర్యాటకులు వాగుల్లో స్నానాలకు దిగి ప్రాణాలు పొగొట్టుకోవద్దని చెప్పారు. హెచ్చరిక బోర్టులు పెడుతున్నప్పటికీ కాలువల్లో స్నానాలకు దిగి వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నారని ఆయన అన్నారు.
వాసిరెడ్డి బాబితో పాటు ఇరువర్గాలకు బెయిల్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య తనయుడు చేగొండి వెంకట రామదాసుపై దాడి చేసిన ఘటనలో మాజీ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు తనయుడు వాసిరెడ్డి బాబితో పాటు ఇరువర్గాలకు చెందిన మరో ఏడుగురికి న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. స్థానిక పల్లవి ఎన్‌క్లేవ్‌లో వెంకట రామదాసు, అతని భార్య నివాసముంటున్నారు. ఆ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా చెరుకుచెర్ల అప్పారావు అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్ అప్పారావు తన పట్ల దురుసుగా, అనుచితంగా ప్రవర్తించాడని భర్త వెంకట రామదాసుకు భార్య చెప్పడంతో అతను వాచ్‌మెన్‌పై చేయిచేసుకున్నాడు. ఇదిలా ఉండగా దళితుడినైన తనను కులం పేరుతో దూషించారని వాచ్‌మెన్ అప్పారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే రామదాసు వద్ద గుమస్తాగా పనిచేస్తున్న గుత్తేటి రాజు తనను వాసిరెడ్డి బాబి వర్గీయులు కులం పేరుతో దూషించి దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ప్రకాశ్‌నగర్ పోలీసులు ఇరువర్గాలపై గత నెల 30న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, ఓ కొట్లాట కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా ప్రకాశ్‌నగర్ పోలీస్ స్టేషన్ వద్ద కాపు సంఘం నేతలు అధిక సంఖ్యలో చేరుకుని ఈ నెల 1న ఆందోళన నిర్వహించారు. అయితే ఈ నెల 3న ఇరువర్గాలను రాజీ చేసేందుకు పెద్దలు ప్రయత్నించారు. దీంతో ప్రకాశ్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు రెండు వర్గాలకు చెందిన వారు అధిక సంఖ్యలో చేరుకున్నారు. రాజీ కుదరకపోవడంతో పోలీస్ స్టేషన్ వద్ద వెలమ, కాపు కులాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. సీఐ బాజీలాల్ వెంటనే వాసిరెడ్డి బాబి, అతని అనుచరులు ఆరుగురు, మరో వర్గానికి చెందిన చేగొండి హరిసిద్ధార్థలను అరెస్టు చేసి శనివారం అర్ధరాత్రి న్యాయమూర్తి ముందు హాజరుపర్చారు. ఇరుపక్షాల కేసులు పరిశీలించిన న్యాయమూర్తి ఎనిమిది మందికి షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేశారు. ఈ ఘటనలకు సంబంధించి ఎవరూ ప్రెస్‌మీట్లు పెట్టరాదని, ఎక్కడా బహిరంగంగా మాట్లాడకూదదని షరతులు విధించినట్లు తెలిసింది.


