● గొల్లపాలెం డీసీసీబీ ఏటీఎంకే
కన్నం వేసిన నిందితుడి అరెస్టు
● బైక్‌ల దొంగగా గుర్తించిన పోలీసులు
● రూ.2.96 లక్షల స్వాధీనం
కాకినాడ రూరల్: చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఆపై ఇంటి నిర్మాణానికి అప్పులు చేశాడు. ఈ నేపథ్యంలో సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఏకంగా ఏటీఎంకే కన్నం వేశాడు. చివరకు పోలీసులకు పట్టుబడ్డాడు. కాజులూరు మండలం గొల్లపాలెంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ఏటీఎం చోరీ మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. కాకినాడ రూరల్ సర్కిల్ స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ చైతన్యకృష్ణ ఈ వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం..
గొల్లపాలెంలోని డీసీసీబీ ఏటీఎంలో ఈ నెల 6న చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఏటీఎంను బద్దలుగొట్టి అందులోని రూ.4.35 లక్షల నగదుతో పాటు, బ్యాంకులోకి ప్రవేశించి సెల్‌ఫోన్ చోరీ చేశారంటూ గొల్లపాలెం పోలీసులకు ఆ బ్యాంకు మేనేజర్ ఈ నెల 7న ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. సీఐ చైతన్యకృష్ణ పర్యవేక్షణలో రెండు పోలీసు బృందాలు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు సేకరించారు. పాత నేరస్తులను విచారించారు. చివరకు గొల్లపాలేనికి 8 కిలోమీటర్ల దూరాన కాజులూరు మండలం అండ్రంగి గ్రామానికి పాత నేరస్తుడు సమనాసి గొల్లయ్య ఈ చోరీకి పాల్పడినట్లు నిర్ధారించుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి, రూ.2.96 లక్షల నగదు, సెల్‌ఫోన్, నేరానికి వినియోగించిన గునపాన్ని స్వాధీనం చేసుకున్నారు.
బైక్‌ల చోరీలతో మొదలుపెట్టి..
నిందితుడు గొల్లయ్య 2009 నుంచి దొంగతనాలు ప్రారంభించాడు. తొలుత చిన్న చిన్న బైక్‌లు దొంగిలించేవాడు. ఇప్పటికే 13 కేసుల్లో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఐదు కేసుల్లో శిక్ష కూడా అనుభవించాడు. అయినప్పటికీ అతడి బుద్ధి మారలేదు. ఇటీవల స్వగ్రామం అండ్రంగిలో గొల్లయ్య ఇల్లు నిర్మించుకున్నాడు. దీనికోసం రూ.8 లక్షల వరకూ అప్పుల పాలయ్యాడు. దీనికి తోడు మద్యం, పేకాట వంటి వ్యసనాలకు బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఏటీఎంపై కన్ను వేశాడు. ఆ ఏటీఎంను పొడవాటి గునపంతో బద్దలుగొట్టి నగదుతో పాటు, బ్యాంకులోని మొబైల్ ఫోన్‌ను దొంగిలించాడు. నిందితుడిని బుధవారం అతడి ఇంటి వద్దనే పోలీసులు అరెస్టు చేసి, గురువారం కోర్టులో హాజరు పరిచారు. గొల్లయ్యకు మెజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. నిందితుడిని అరెస్టు చేసి, చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్న సీఐ చైతన్యకృష్ణ, క్రైం సీఐ వెంకట త్రినాథ్, ఫింగర్ ప్రింట్ సీఐ పి.శ్రీనివాసరావు, గొల్లపాలెం ఎస్సై ఆర్‌వీఎన్ మూర్తి, ఏఎస్సైలు బ్రహ్మాజీ, గోవిందు, ప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ నారాయణరెడ్డి, కానిస్టేబుళ్లు ఫణీంద్ర, చంద్రశేఖర్, శివప్రసాద్, వెంకటరత్నం తదితరులను ఎస్పీ బిందుమాధవ్, అడిషనల్ ఎస్పీ మహంతి కిశోర్ కుమార్ అభినందించారు.


