● విచ్చలవిడిగా
యాంటీబయాటిక్స్ వినియోగం
● తగదంటున్న వైద్యులు
ఆలమూరు: సీజనల్ మార్పులు.. ప్రభుత్వ నిర్లక్ష్యంతో పట్టణాలు, పల్లెల్లో పారిశుధ్య నిర్వహణ లోపించడం వంటి కారణాలతో పలు ప్రాంతాల్లో సీజనల్, అంటువ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగుల రద్దీ అధికంగా ఉంటోంది. ఇదే సమయంలో కొంతమంది రోగులు వ్యాధులు త్వరగా తగ్గాలనే ఉద్దేశంతో వైద్యుల సలహా లేకుండా యాంటీబయాటిక్ మందులు ఇష్టానుసారం వాడేస్తున్నారు. ఈ ధోరణి ప్రమాదకరమని వైద్యులు అంటున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 162 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 12 సామాజిక ఆరోగ్య పోషక కేంద్రాలు, ఏడు ఏరియా ఆస్పత్రులు, 500 వరకూ ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి. ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలోనూ రోజుకు 30 నుంచి 50 వరకూ సీజనల్ వ్యాధుల కేసులు నమోదవుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రులకు కూడా నిత్యం పెద్ద సంఖ్యలో రోగులు వస్తున్నారు. అయితే, కొంతమంది జ్వరాల బారిన పడుతున్నప్పుడు వైద్యుల్ని సంప్రందించకుండా నేరుగా మెడికల్ షాపులకు వెళ్లి యాంటీబయాటిక్స్ కొనుగోలు చేసి వాడుతున్నారు.
ఇవీ దుష్పరిణామాలు
విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల జీర్ణ వ్యవస్థపై తీవ్రంగా ప్రభావం పడుతుంది. వ్యాధి నిరోధక శక్తి నశించిపోయి, చిన్న చిన్న రోగాలను సైతం తట్టుకునే శక్తిని శరీరం కోల్పోతుంది. అలాగే, జ్వరాలు, దగ్గు, జలుబుకు సైతం యాంటీబయాటిక్స్ వాడటం వల్ల పేగుల్లోని శరీరానికి మేలు చేసే మంచి బ్యాక్టీరియా నశించిపోతుంది. దీనివలన ఎప్పుడైనా బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ వస్తే అప్పుడు వాడే మందులు శరీరంపై పని చేయవని వైద్యులు చెబుతున్నారు. చిన్నారులు, వృద్ధులు, బాలింతలు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాఽధిగ్రస్తులతో పాటు ప్రతి ఒక్కరూ తమ సలహా లేనిదే యాంటీబయాటిక్స్ వినియోగించరాదని వైద్యులు సూచిస్తున్నారు.
వైద్యులు చెప్తేనే వాడాలి
సీజనల్ వ్యాధుల బారిన పడిన రోగి కచ్చితంగా సమీప ఆస్పత్రికి వెళ్లి వ్యాధి నిర్ధారణ చేయించుకోవాలి. వైద్యుల సలహాకు అనుగుణంగా మందులు వాడాలి. వారి సూచనలు లేకుండా యాంటీబయాటిక్స్ వినియోగించరారు.
– ఎం.సుమలత, నోడల్ అధికారి, రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమ్, అమలాపురం


