పూతరేకుల స్టాల్స్‌పై ఫుడ్‌ సేఫ్టీ అధికారుల దాడులు | - | Sakshi
Sakshi News home page

పూతరేకుల స్టాల్స్‌పై ఫుడ్‌ సేఫ్టీ అధికారుల దాడులు

Sep 18 2026 12:09 AM | Updated on Sep 18 2026 12:09 AM

నెయ్యి శాంపిల్స్‌ సేకరణ

ఆత్రేయపురం: స్థానిక పూతరేకులు, స్వీట్‌ స్టాల్స్‌పై ఆహార భద్రత (ఫుడ్‌ సేఫ్టీ) అధికారులు గురువారం ఆకస్మిక దాడులు చేశారు. ఆయా స్టాల్స్‌లో నెయ్యి వాడే పదార్థాల శాంపిల్స్‌ తీసుకుని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌లకు పంపారు. ప్రధానంగా పూతరేకులలో వాడే నెయ్యిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఇంతవరకూ 21 శాంపిల్స్‌ సేకరించగా పరీక్షల అనంతరం కల్తీ జరిగినట్లు నిర్ధారణ అయ్యిందని తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ప్రాంతంలో పూతరేకులు ప్రపంచవ్యాప్తంగా జియోగ్రాఫికల్‌ గుర్తింపు పొంది, ప్రజాదరణ పొందాయని, కాబట్టి తయారీదారులు బ్రాండెడ్‌ నెయ్యి, నాణ్యమైన పదార్థాలు మాత్రమే వినియోగించాలని హెచ్చరించారు. ఈ దాడులు గురువారం రాత్రి వరకూ కొనసాగాయి. జిల్లా ఫుడ్‌ సేఫ్టీ అధికారులు ఎన్‌.రమేష్‌బాబు, వై.రాములయ్య తదితరులు పాల్గొన్నారు. అధికారులకు అందిన ఫిర్యాదులపై ఈ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది.

జాతీయ స్థాయి

విలువిద్య పోటీలు ప్రారంభం

రాజమహేంద్రవరం రూరల్‌: క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు జాతీయ స్థాయి విలువిద్య పోటీలు దోహదం చేస్తాయని ప్రముఖ ఆడిటర్‌, పూర్వపు రోటరీ క్లబ్‌ గవర్నర్‌ భాస్కర్‌రామ్‌ అన్నారు. కవలగొయ్యిలోని ది ఫ్యూచర్‌ కిడ్స్‌ గ్లోబల్‌ స్కూలు ఆవరణలో సీఐఎస్‌సీఈ జాతీయ స్థాయి బాలికల విలువిద్య (ఆర్చరీ) పోటీలను ఆంధ్ర – తెలంగాణ రీజియన్‌ స్పోర్ట్స్‌ కో ఆర్డినేటర్‌, హైదరాబాద్‌ సెయింట్‌ జోసఫ్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ థెరిసాతో కలసి గురువారం ఆయన ప్రారంభించారు. ఈ పోటీల్లో క్రీడాకారిణులు నేషనల్‌, రీకర్వ్‌, ఇండియన్‌ వంటి రౌండ్లలో మంచి ప్రతిభ కనబరిచారు. ఈ పోటీలు మూడు రోజుల పాటు జరుగుతాయని పాఠశాల ప్రిన్సిపాల్‌, స్పోర్ట్స్‌ జాయింట్‌ సెక్రటరీ ఎం.శేషగిరిధర్‌ తెలిపారు. తొలుత పాఠశాల విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 350 మంది విలు విద్య క్రీడాకారిణులు ఈ పోటీలకు హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ఎం.శేషగిరి, పాఠశాల డైరెక్టర్‌ రవిబాబు యేలేటి, చైర్‌పర్సన్‌ విజయ యేలేటి, సీఈఓ మహాస్వి యేలేటి, డీన్‌ హర్షిణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement