తుని రూరల్: వి.కొత్తూరులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ప్రిన్సిపాల్ డి.ప్రసన్నరాణి గురువారం ఈ వివరాలు తెలిపారు. ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకూ కర్నూలులో జరిగిన సీనియర్ రాష్ట్ర స్థాయి ఆట్యాపాట్యా పోటీల్లో 13 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. వీరిలో డి.దీప్తి, కె.గీత, టి.శివరమ్య, ఎం.ప్రవల్లిక, కె.లోహిత, వై.దుర్గాభవాని, డి.కీర్తి, ఎ.నూతన ప్రియదర్శిని, ఎం.సంజన ఈ పోటీల్లో నాలుగో స్థానంలో నిలిచారు. వీరిలో మంచి ప్రతిభ చూపిన దీప్తి, గీత, శివరమ్యలు జాతీయ స్థాయి ఆట్యాపాట్యా పోటీలకు అర్హత సాధించారు. వీరు వచ్చే నెల 1 నుంచి 5వ తేదీ వరకూ హైదరాబాద్‌లో జరిగే జాతీయ స్థాయి ఆట్యాపాట్యా పోటీల్లో పాల్గొంటారు. అలాగే, జాతీయ స్థాయి సైకిల్ పోలోకు కూడా ఐదుగురు విద్యార్థినులు ఎంపికయ్యారు. ఈ నెల 12, 13 తేదీల్లో నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో గురుకుల విద్యార్థినులు ఆర్.భవిత శివకుమారి, పి.స్వరూప, జి.సుస్మిత, జె.సుజిత్రి, పి.హర్షిణి తృతీయ స్థానం సాధించారు. వీరిలో మంచి ప్రతిభ చూపిన భవిత శివకుమారి, సుస్మిత జాతీయ స్థాయి సైకిల్ పోలో పోటీలకు ఎంపికయ్యారు. డిసెంబర్‌లో జమ్మూ కశ్మీర్‌లో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థినులను ప్రిన్సిపాల్ ప్రసన్నరాణి, ఫిజికల్ డైరెక్టర్ ఆర్.జయలక్ష్మి, పీఈటీ జి.సుజాత, అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు. జాతీయ స్థాయిలో సైతం వీరు విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు.


