అన్నవరం: సత్యదేవుని సన్నిధిలోని గిరి ప్రదక్షిణ రోడ్డులో ఉన్న కొండల నుంచి గ్రావెల్‌ను అక్రమంగా తరలించారంటూ వచ్చిన ఫిర్యాదులపై లోకాయుక్త డిప్యూటీ డైరెక్టర్ గోవిందరాజులు గురువారం విచారణ జరిపారు. వివరాలివీ.. గిరి ప్రదక్షిణ రోడ్డులోని కొండల నుంచి పెద్ద మొత్తంలో గ్రావెల్‌ను సత్యగిరి పక్కనే పార్కింగ్ స్థలం అభివృద్ధికి గత ఏడాది మూడు రోజుల పాటు లారీలతో తరలించారు. ఈ గ్రావెల్‌లో కొంత దేవస్థానానికి చెందిన స్థలంలోనిది కాగా, మిగిలినది ఇరిగేషన్ స్థలంలోనిదని, దానికి ఆ శాఖతో పాటు మైన్స్ అధికారుల అనుమతి లేదని పేర్కొంటూ జి.మహేష్ అనే వ్యక్తి లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. తరలించిన గ్రావెల్‌కు ట్రిప్పునకు రూ.10 వేల చొప్పున బిల్లులు పెట్టుకున్నారని పేర్కొన్నారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపి, దేవస్థానం అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో లోకాయుక్త డీడీ గోవిందరాజులు గిరి ప్రదక్షిణ రోడ్డులో గ్రావెల్ తవ్విన ప్రాంతాలను పరిశీలించారు. దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు, ఈఈ రామకృష్ణ, ఇతర అధికారులు కూడా దీనికి హాజరయ్యారు. ఈ గ్రావెల్‌ను దేవస్థానం అవసరాలకే ఉపయోగించామని అధికారులు తెలిపారు. ఇందులో కొంత దేవస్థానం స్థలంలోనిదేనని, కొంత ఇరిగేషన్‌కు చెందిన స్థలం ఉంటే ఉండవచ్చునని చెప్పారు. దేవస్థానం అవసరాలకు తరలిస్తున్నందున ఇరిగేషన్ అధికారులు అభ్యంతరం చెప్పలేదని తెలిపారు. అనంతరం, ఫిర్యాదీ మహేష్ అభ్యంతరాలపై గోవిందరాజులు ప్రశ్నించారు. గతంలో కూడా తాను పలు అంశాలపై లోకాయుక్తకు ఫిర్యాదు చేశానని, ఇది కూడా ప్రజాప్రయోజనాల నేపథ్యంలోనే ఫిర్యాదు చేశానని ఆయన చెప్పారు. దీనిపై తగు చర్యలు తీసుకుంటామని లోకాయుక్త అధికారులు తెలిపారు. ఏఈఓ అనకాపల్లి ప్రసాద్, డీఈలు ఈ విచారణలో పాల్గొన్నారు.


