సాక్షి, రాజమహేంద్రవరం: చంద్రబాబు ప్రభుత్వంలో పథకం ఏదైనా అందినకాడికి దోచుకోవడమే లక్ష్యంగా అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు ఇటీవల పంపిణీ చేసిన యూనిఫామ్ చీరలే ఇందుకు నిదర్శనం. ఒకటి రెండు సార్లు ఉతికితే చీకిపోయి, చిరిగిపోయి మరోసారి కట్టుకోవడానికి వీలు లేనంతగా తయారవుతుండడంతో సిబ్బంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రూ.100 కూడా విలువ చేయని చీరను సుమారు రూ.500కు ఐసీడీఎస్‌కు కట్టబెట్టేశారని... కాంట్రాక్టర్ రూ.200 మిగుల్చుకుంటే, మిగిలిన రూ.200 అనుయాయుల జేబుల్లోకి వెళ్లిపోయాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఒక్క ఉతుక్కే రంగు వెలిసిపోయేలా..
జిల్లాలోని 8 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,798 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో పనిచేసే కార్యకర్తలు, హెల్పర్లకు ఒక్కొక్కరికి రెండేసి చొప్పున మొత్తం 7,192 చీరలు పంపిణీ చేశారు. వాస్తవానికి ఇవన్నీ మూడు నెలల క్రితమే జిల్లాకు వచ్చాయి. అయితే ఇవి నాసిరకంగా ఉండడంతో వాటిని తీసుకునేందుకు సిబ్బంది నిరాకరించడంతో కొద్ది రోజులు గొడౌన్లలోనే మూలిగాయి. ఉన్నతాధికారులు ఒత్తిడి చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకున్న చీరలను కొద్ది మంది ధరించినప్పటికీ తీవ్ర ఇబ్బంది పడ్డారు. చాలా పలుచగా ఉండడంతో పాటు ఒక్క ఉతుక్కే రంగు మొత్తం వెలిసిపోవడంతో ఇబ్బందికరంగా ఉంటోందని చెబుతున్నారు. ప్రస్తుతం వీటిని పక్కన పెట్టేసి సాధారణ దుస్తుల్లోనే ఆయా కేంద్రాల్లో విధులకు హాజరవుతున్నారు.
కాంట్రాక్టర్‌కు అండదండలు
ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్లతో విజయవాడలో ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఈ నాణ్యత లేని చీరల అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. చాలా నాసిరకంగా ఉన్నాయన్న విమర్శలు రావడంతో వాటి పంపిణీని నిలిపివేయాలని, ఇప్పటికే పంపిణీ చేసిన వాటిని వెనక్కు తీసుకోవాలని ఉన్నతాధికారులు చెప్పినట్లు తెలిసింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మందికి పంపిణీ చేసే యూనిఫామ్‌ను కూడా పరిశీలించే తీరిక పాలకులకు, ఆ శాఖ ఉన్నతాధికారులకు లేదా అన్న సందేహం అందరిలోనూ వ్యక్తమవుతోంది. ఉద్యోగులకు పంపిణీ చేసే చీరల్లోనూ కక్కుర్తిపడిన కాంట్రాక్టర్‌ను కూటమి ప్రభుత్వంలోని కీలక వ్యక్తులే వెనకేసుకొస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా పాలకులు స్పందించి కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవడంతో పాటు నాణ్యమైన చీరలు పంపిణీ చేయాలని అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల సంఘం నాయకులు కోరుతున్నారు.
ఆ చీరలు కట్టుకోవద్దని చెప్పాం
అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు పంపిణీ చేసిన చీరలను కట్టుకోవద్దని సూచించాం. వీటి నాణ్యతను పరిశీలించాల్సి ఉందని ఉన్నతాధికారులు చెప్పారు. ఇందుకోసం కొన్ని చీరలను అమరావతి పంపించాం. ఇప్పటికే పంపిణీ చేసిన వాటిని వెనక్కు తీసుకోవాలని సీడీపీవోలను ఆదేశించాం.
– శ్రీదేవి, పీడీ, ఐసీడీఎస్
జిల్లాలోని అంగన్‌వాడీల వివరాలు ఇవీ..
ప్రాజెక్టు కేంద్రాలు సిబ్బంది
గోపాలపురం 234 468
కొవ్వూరు 223 446
కోరుకొండ 228 456
మండపేట 242 484
పెరవలి 211 422
రాజమహేంద్రవరం 165 330
రాజానగరం 311 622
రంగంపేట 184 368
మొత్తం 1,798 3,596
అంగన్‌వాడీ కేంద్రాల సిబ్బందికి
నాసిరకం యూనిఫాం
నాణ్యత లేని చీరలతో అవస్థలు
రూ.వంద చీరకు రూ.500 వెచ్చింపు
ఒక్క ఉతుక్కే చీకిపోతున్న వైనం
జిల్లాలో 7,192 మందికి పంపిణీ
నాణ్యత పరిశీలించకుండా వాడొద్దని
సిబ్బందికి అధికారుల సూచన


