దేవరపల్లి: ఏలూరులో మాజీ ఉప ముఖ్యమంత్రి, వైద్యారోగ్య శాఖ మాజీ మంత్రి ఆళ్ల నాని పార్థివ దేహాన్ని బుధవారం రాత్రి తూర్పు గోదావరి జిల్లా వైఎస్సార్ సీపీ నాయకులు సందర్శించి నివాళులర్పించారు. వారిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, స్టేట్ యూత్ ప్రెసిడెంట్ జక్కంపూడి రాజా, మాజీ హోం మంత్రి తానేటి వనిత, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు తదితరులు ఉన్నారు.
పాలల్లో రసాయనాల
కల్తీ వల్లే ఘోరం
ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఆహార భద్రతా
విభాగం నివేదిక
అమలాపురం టౌన్: రాజమహేంద్రవరం లాలాచెరువు ప్రాంతంలో గత ఫిబ్రవరి నెలలో సంభవించిన కల్తీ పాల విషాదంపై అప్పట్లో అమలాపురానికి చెందిన న్యాయవాది వి.రమేష్‌చంద్రవర్మ జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సీ)కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర ఆహార భద్రతా విభాగం ఎన్‌హెచ్‌ఆర్‌సీకి నివేదిక సమర్పించిందని రమేష్‌చంద్రవర్మ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం నర్సాపురం గ్రామానికి చెందిన వరలక్ష్మీ మిల్క్ డెయిరీ నుంచి సరఫరా అయిన పాలల్లో ఇథిలీన్ గ్లైకాల్ వంటి ప్రమాదకర రసాయనాలు కలపడం వల్లే బాధితులకు కిడ్నీల వైఫల్యం సంభవించిందని ఆ నివేదిక పేర్కొంది. ఈ తప్పిదం తేలడంతో అప్పట్లో బాధ్యులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేశామని తెలిపింది. ఈ ఘోర ఘటనతో మృతి చెందిన 16 మంది బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.1.60 కోట్ల పరిహారం అందజేశారని న్యాయవాది రమేష్‌చంద్రవర్మ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని డెయిరీలపై నిరంతర నిఘాతో శాంపిల్స్ పరీక్షలు నిర్వహించే వరకూ తన న్యాయ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
అర్హులైన నిర్వాసితులకు
పరిహారం
చింతూరు: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా అర్హులైన నిర్వాసితులందరికీ పరిహారం అందజేస్తామని, పూర్తిస్థాయిలో ఇచ్చిన అనంతరమే వారిని ఖాళీ చేయిస్తామని ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ పి.ప్రశాంతి అన్నారు. ఆర్‌అండ్‌ఆర్ సమస్యలకు సంబంధించి ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ అభిషేక్, ఆర్‌అండ్‌ఆర్ అధికారి శుభం నొఖ్వాల్‌తో కలిసి బుధవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో ఆమె గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నాలుగు మండలాల నుంచి వచ్చిన నిర్వాసితుల వినతులను స్వీకరించారు. అనంతరం కమిషనర్ విలేకర్లతో మాట్లాడుతూ మధ్యవర్తులు, దళారుల మాటలు నమ్మి నిర్వాసితులు మోసపోవద్దని సూచించారు. ఇప్పటికే వన్‌టైం సెటిల్‌మెంట్ ఆప్షన్ ఎంచుకున్న వారికి పరిహారం సొమ్ములు జమవుతున్నాయన్నారు. మిగిలిన నిర్వాసితులకు కూడా ఈ నెలాఖరుకల్లా పరిహారం జమచేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గ్రామంలో కొన్ని ఇళ్లను ముంపులో చేర్చి మరికొన్నింటిని ముంపులో చేర్చలేదంటూ వినతులు వస్తున్నాయని, ఇరిగేషన్ శాఖ ఇచ్చిన ఎల్‌పీ షెడ్యూల్ ఆధారంగా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు. దీనిపై మరోసారి సర్వే జరిపి తగిన చర్యలు చేపడతామని, కాగా ఆర్‌అండ్‌ఆర్ పరిహారం మాత్రం గ్రామం యూనిట్‌గానే పరిగణించి చెల్లిస్తామని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా మొదటి ఫేజ్ 41.15 కాంటూరు లెవల్‌కు సంబంధించి ముంపునకు గురవుతున్న గ్రామాలకు ప్రస్తుతం పరిహారం చెల్లిస్తున్నామని, రెండో ఫేజ్ 45.72 కాంటూరు లెవల్‌కు సంబంధించి ముంపునకు గురవుతున్న గ్రామాలకు సంబంధించి వచ్చే ఏడాది సర్వే నిర్వహిస్తామన్నారు. ఫుల్ రిజర్వాయర్ లెవల్ (ఎఫ్‌ఆర్‌ఎల్) ఆధారంగా ముంపు గ్రామాల గుర్తింపు ఉంటుందని, వరదల అంచనా ఆధారంగా ముంపు గ్రామాలను పరిగణనలోకి తీసుకోవడం జరగదని పేర్కొన్నారు. 41.15 కాంటూరులో ముంపునకు గురవుతున్న 32 గ్రామాలకు సంబంధించి రాబోయే మూడు నెలల్లో ఆర్‌అండ్‌ఆర్ ప్రక్రియ పూర్తిచేసేందుకు కసరత్తు చేస్తున్నామని తెలిపారు.


