● మద్యం దుకాణాలకు రెన్యువల్
● ఏడాది పాటు కొనసాగిస్తూ
ప్రభుత్వ నిర్ణయం
● అక్టోబర్ 1 నుంచి 2027 సెప్టెంబర్ 30 వరకు వర్తింపజేస్తూ ఎకై ్సజ్ పాలసీ
విడుదల
● జిల్లాలో 138 మద్యం దుకాణాలు
● రెండేళ్లుగా టీడీపీ సిండికేట్ గుప్పిట్లో
● స్థానిక ఎన్నికల వేళ ఆసరా కోసమేనని సర్వత్రా ఆరోపణలు
సాక్షి, రాజమహేంద్రవరం: రెండేళ్లుగా అధికార పార్టీ నాయకులకు కాసులు కురిపిస్తున్న అనుకూల సిండికేట్‌కే చంద్రబాబు ప్రభుత్వం మరో ఏడాది పాటు లైసెన్సులు పొడిగించింది. ఈ మేరకు కొత్త ఎకై ్సజ్ పాలసీ 2026–27ని ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. అవసరమైతే ఇదే పాలసీని తర్వాతి ఏడాది కూడా కొనసాగించుకోవచ్చని వెసులుబాటు కల్పించింది. పాత దుకాణాల కాల పరిమితి ఈ నెల 30తో ముగియనుంది. ఈ క్రమంలో ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకూ పాత దుకాణదారులే మద్యం విక్రయించవచ్చని లైసెన్స్‌లను రెన్యువల్ చేసేసింది. ఎవరైనా రెన్యువల్ వద్దనుకుంటే ఆయా దుకాణాలకు మళ్లీ డ్రా తీయనున్నారు.
మినీబార్లుగా పర్మిట్‌రూమ్‌లు!
జిల్లాలో మొత్తం 138 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో 300 వరకు పర్మిట్ రూమ్‌లు, వెయ్యి వరకూ బెల్టు షాపులున్నాయి. ఈ క్రమంలో మద్యం దుకాణాలను కూటమి నాయకులు తమ అక్రమార్జనకు అడ్డాగా మార్చుకున్నారు. వైన్ షాపుల యజమానులను గుప్పిట్లో పెట్టుకుని పర్మిట్ రూమ్‌లను మినీబార్లుగా మార్చేసి దందా సాగిస్తున్నారు. ప్రజాప్రతినిధులకు షాడోలుగా వ్యవహరించే వారు తమ వారికి పర్మిట్ రూమ్‌లు ఇప్పించుకుని వాటిలో ఆహార పదార్థాల పేరుతో భారీగా దోపిడీకి పాల్పడుతున్నారు. కాగా ప్రతి బ్రాండు మద్యం పైనా రూ.10 అదనంగా వసూలు చేయడం మామూలైపోయింది. ఇక బెల్టు దుకాణాల్లో ఎమ్మార్పీ కంటే రూ.20 అదనంగా వసూలు చేస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో రూ.30 గుంజుతున్నారు. ఈ వసూళ్ల మొత్తాన్ని వ్యాపారులు, కూటమి నేతలు చెరిసగం పంచుకుంటున్నారన్నది బహిరంగ రహస్యమే. ఇలా సుమారు రూ.50 కోట్ల మేర చేతులు మారుతోందని తెలుస్తోంది. వీటికి తోడు కొన్ని ప్రాంతాల్లో నాసిరకం బ్రాండ్లు సైతం విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
స్థానిక పోరులో మద్యపుటేరులు!
స్థానిక ఎన్నికలకు సమాయత్తమవుతున్న వేళ అనుకూల వర్గాల చేతుల్లో మద్యం దుకాణాలు ఉంటే ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఉపయోగపడతారనే ఈ రెన్యువల్ ఎత్తుగడ వేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు వారు చేస్తున్న ప్రచారం గత రెండేళ్లలో మద్యం వ్యాపారులు బాగా నష్టపోయారని. మద్యం విక్రయాలపై దుకాణదారులకు 20 శాతం కమీషన్ ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని, ప్రారంభంలో 9 శాతం ఇచ్చి ప్రస్తుతం 14 శాతానికి పెంచిందని, అయితే ప్రారంభంలో ఇస్తామన్న 20 శాతం నేటికీ ఇవ్వకపోవడంతో వారు నష్టపోయారని సిండికేట్, కూటమి నాయకులు కథలు అల్లుతున్నారు. వాస్తవానికి ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తుండడం ద్వారా ప్రభుత్వం ఇస్తామన్న కమీషన్ కంటే ఎక్కువగానే సంపాదించారన్నది బహిరంగ రహస్యం. స్థానిక ఎన్నికలకు మద్యం సిండికేట్ నుంచి నిధుల సమీకరణతో పాటు కూటమి పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులు పంచుకునేందుకు కావాల్సినంత మద్యం కూడా కుమ్మరించడానికే రెన్యువల్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తొలి నుంచీ సిండికేట్ గుప్పిట్లోనే..
చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 సెప్టెంబర్‌లో మెజార్టీ మద్యం దుకాణాలను టీడీపీ అనుకూల వ్యాపారులు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఎక్కడైనా వేరే వారు దక్కించుకున్నప్పటికీ వాటినీ టీడీపీ సిండికేట్ హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్లీ మద్యం దుకాణాలకు వేలం నిర్వహిస్తే పోటీ తప్పదని సిండికేట్ భయం. స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమ దందాకు గండి పడకుండా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వ పెద్దలను ఒప్పించి ఈ పాలసీని విడుదల చేయించారు. తాజా రెన్యువల్‌కు వార్షిక రిటైల్ ఎకై ్సజ్ పన్నుల్లో 38 శాతానికి సమానంగా చెల్లించాలి. దీంతోపాటు వార్షిక రిటైల్ ఎకై ్సజ్ పన్ను, పర్మిట్‌రూమ్ రిటైల్ ఎకై ్సజ్ పన్ను కూడా చెల్లించాలి. రెన్యువల్ కోసం రూ.35 వేల ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.


