● కోనసీమ జిల్లాలో కరువు తీరా వర్షం
● రైతుల ఆశలు తీర్చిన అల్పపీడనం
● శనివారం తెల్లవారు జాము నుంచి
భారీ వర్షం
● సేద తీరిన ఉద్యాన పంటలు
● వరి రైతులకు సైతం మేలు
సాక్షి, అమలాపురం: నిప్పులు కక్కుతున్న సూర్యుడు.. భగభగ మండుతున్న ఎండలు.. బయట అడుగు పెడితేనే ఆపసోపాలు పడుతున్న పరిస్థితి. చినుకు జాడ లేక నెర్రలు బారిన చేలు.. ఎండ వేడికి వాడి వాలిపోయిన కొబ్బరి, అరటి తోటలు.. చుక్క నీటికి నోచుకోక ఎండిపోతున్న కూరగాయ పంటలు. ఎల్ నినో ప్రభావంతో గడచిన మూడు నెలలుగా ఇదే పరిస్థితి. అటు సామాన్యులు, ఇటు అన్నదాతలు ఆకాశం వైపు ఆశగా చూస్తూ వాన చినుకు కోసం ముఖం వాచేలా ఎదురు చూస్తున్నారు. అడపాదడపా ఒకటి రెండు చినుకులు పడినా, అవి వాతావరణాన్ని చల్లబరచలేదు. పొలాల దాహాన్ని తీర్చలేదు. ఈ సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షం కోనసీమకు కొత్త ఊపిరి పోసింది. చిరు జల్లులతో మొదలై జోరువానగా మారడంతో వాతావరణం ఒక్కసారిగా ఆహ్లాదకరంగా మారింది. చల్లని ఈదురుగాలులు గిలిగింతలు పెట్టాయి. బీటలు బారిన నేల తన దాహం తీర్చుకుంది. వాన నీటికి తడిసిన చెట్ల ఆకులు స్నానమాడి, మలినాన్ని వదిలి సరికొత్త కాంతితో మెరిశాయి. వాడిన కూరగాయ పంటలకు మళ్లీ జీవం వచ్చింది. రైతుల ముఖాల్లో ఆనందపు వెలుగులు విరిశాయి.
పల్లపు ప్రాంతాలు జలమయం...
ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ఆరంభం నుంచే వరుణుడు ముఖం చాటేయడంతో తీవ్ర వర్షాభావాన్ని ఎదుర్కొంటున్న జిల్లాలో ఎట్టకేలకు కరువు తీరా వర్షం కురిసింది. శనివారం తెల్లవారుజాము నుంచి అల్పపీడన ప్రభావంతో భారీ వర్షం కురియడంతో లోతట్టు కాలనీల్లో, రోడ్లపై ముంపునీరు చేరింది. సామాన్యులు, చిరు వ్యాపారులు, వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. తెల్లవారు జాము నుంచి పది గంటల వరకు జిల్లాలో పలు ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం కురిసింది. జిల్లాలో శనివారం ఉదయం ఎనిమిది గంటల వరకు సగటున 37.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. పి.గన్నవరంలో అత్యధికంగా 60 మి.మీ., అత్యల్పంగా రామచంద్రపురంలో 10.6 మి.మీ. నమోదైంది. తరువాత కూడా మధ్యమధ్యలో కాస్త తెరపి ఇచ్చినా వర్షం పడుతూనే ఉంది.
వరికి ఊరట.. సేదతీరిన తోటలు
జిల్లాలో సుమారు 1.40 లక్షల ఎకరాల్లో సాగవుతున్న వరి పంటకు వర్షం ఎంతో మేలు చేసింది. ముఖ్యంగా నీరందక ఇబ్బంది పడుతున్న శివారు, మెరక ప్రాంతాల రైతులకు వర్షం వరంగా మారింది. పంటలకు అవసరమైన తేమ లభించడంతో రైతులు ఊరట చెందుతున్నారు. కొబ్బరి, అరటి, కోకో తోటలు వాడిపోయే పరిస్థితికి చేరుకున్నాయి. మోటార్లు, పంట కాల్వల ద్వారా నీరు అందిస్తున్నా.. ఆశించిన స్థాయిలో తేమ లేక ఉద్యాన రైతులు ఇబ్బందులు పడ్డారు. వీటితో పాటు లంక గ్రామాల్లోని మెరక ప్రాంతాల ఉద్యాన పంటలకు ఈ వర్షం మరింత ప్రయోజనం చేకూర్చింది.
మూడు నెలల్లో 57 శాతం లోటు
కోనసీమలో జూన్ నుంచి ఆగస్టు వరకు వరుసగా సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదైంది. మూడు నెలలకు కలిపి జిల్లాలో సాధారణ వర్షపాతం 585.6 మి.మీ. కాగా.. వాస్తవంగా 251 మి.మీ. మాత్రమే కురిసింది. దీంతో సగటున 57 శాతం లోటు ఏర్పడింది. జూన్‌లో 60 శాతం, జూలైలో 48.8 శాతం, ఆగస్టులో ఏకంగా 64.9 శాతం లోటు నమోదైంది. తాజా వర్షం రైతులకు ఊరటనిచ్చినా ఉప్పలగుప్తం, అల్లవరం, ఐ.పోలవరం, ముమ్మిడివరం, కాట్రేనికోన, మామిడికుదురు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో ముంపు నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో రైతులు అప్రమత్తంగా ఉన్నారు. మరో రెండు రోజులు ఇదే స్థాయిలో వర్షాలు కొనసాగితే చేలల్లో నీరు నిలిచే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.


