జాతీయ లోక్‌ అదాలత్‌లో 9,421 కేసులకు పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

జాతీయ లోక్‌ అదాలత్‌లో 9,421 కేసులకు పరిష్కారం

Sep 13 2026 12:30 AM | Updated on Sep 13 2026 12:30 AM

రూ.36.05 కోట్లకు పైగా

అవార్డులు జారీ

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పరిధిలో శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ జునైద్‌ అహ్మద్‌ మౌలానా ఆధ్వర్యంలో 44 బెంచ్‌ల్లో లోక్‌ అదాలత్‌ ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరం జిల్లా కోర్టు ప్రధాన కార్యాలయంలో 9 బెంచ్‌లు, ఉమ్మడి జిల్లాలో మరో 35 బెంచీలు ఏర్పాటు చేసి 9,421 కేసుల పరిష్కారించారు. ఈ కేసులపై మొత్తం రూ.36,05,90,000 మేర అవార్డు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.

ఈ జాతీయ లోక్‌ అదాలత్‌లో 489 సివిల్‌ కేసులు, 8,844 క్రిమినల్‌ కేసులు, 88 ప్రీ లిటిగేషన్‌ కేసులు పరిష్కరించామని జునైద్‌ అహ్మద్‌ మౌలానా తెలిపారు.

జీజీహెచ్‌లో క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ ప్రారంభం

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక ప్రభుత్వాస్పత్రిలో నూతనంగా నిర్మించిన 50 పడకల క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ను సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా శనివారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ కీర్తి చేకూరి మాట్లాడుతూ భవన నిర్మాణానికి రూ.23.75 కోట్ల అంచనా వ్యయం వేసినట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 ఆసుపత్రుల్లో క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ల ఏర్పాటులో భాగంగా దీనిని అందుబాటులోకి తీసుకువచ్చినట్టు తెలిపారు. ఆధునిక వైద్య పరికరాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రస్తుతం 650 పడకల సామర్థ్యంతో పనిచేస్తున్న ప్రభుత్వ ఆసుపత్రితో దీనివల్ల రోగులకు మెరుగైన సేవలు అందించవచ్చన్నారు. కార్యక్రమంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సోఫియా, ఏపీ ఎంఐడీసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇండిగో సర్వీసు అత్యవసర ల్యాండింగ్‌

కోరుకొండ: చైన్నె నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరిన ఇండిగో విమాన సర్వీ సు శనివారం రాజమహేంద్రవరం విమానాశ్రయంలో అత్యవసరంగా దిగింది. వాతావరణం అనుకూలించకపోవడంతో గన్నవరం విమానాశ్రయం నుంచి సిగ్నల్‌ రాకపోవడంతో గాల్లో చక్కర్లు కొట్టి వెనుదిరిగింది. ఇదిలా ఉండగా 65 మంది ప్రయాణికులతో బయలు దేరిన విమానం గాల్లో చక్కర్లు కొట్టడంతో స్థానికులు ఏం జరిగిందోనని ఆందోళనకు గురయ్యారు.

బాణసంచా తయారీ

కేంద్రంపై దాడి

సామగ్రి స్వాధీనం

అనపర్తి: బిక్కవోలు మండలం కొమరిపాలెంలో అక్రమంగా బాణసంచా తయారు చేస్తున్న కేంద్రంపై దాడి చేసి మందుగుండు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై వి రవిచంద్రకుమార్‌ తెలిపారు. శనివారం అందిన సమాచారం మేరకు గ్రామంలోని చేపల చెరువుల వద్ద ఉన్న షెడ్డులో సోదాలు నిర్వహించగా సుమారు 2.660 కిలోల బరువున్న దీపావళి మందులు, సుమారు 19.5 కిలోల తార జువ్వలు, 200 ఖాళీ తారాజువ్వ గుల్లలు, 3 ఇనుప అవ్వాయి ప్రెస్సింగ్‌ యంత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై తెలిపారు. ఈ కేసులో కొమరిపాలెం గ్రామానికి చెందిన గుబ్బల వీరన్నను అదుపులోకి తీసుకున్నట్టు ఆయన తెలిపారు.

ఉత్సాహంగా బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలు

మార్కాపురం టౌన్‌: జిల్లా కేంద్రమైన మార్కాపురంలో 11వ రాష్ట్ర స్థాయి బాలబాలికల బాల్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు రెండోరోజైన శనివారం నిర్వహించారు. బాలుర జెడ్పీ హైస్కూలులో నిర్వహించిన ఈ పోటీలు ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా బాలుర జట్టు లీగ్‌ దశలో అనంతపురం, కృష్ణా జిల్లాలపై గెలుపొందగా, చిత్తూరు జిల్లాపై ఓటమి చవిచూసింది. బాలికల జట్టు కర్నూలుపై గెలుపొందగా, గుంటూరుపై ఓడిపోయింది. ఉమ్మడి 13 జిల్లాల బాల బాలికల జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. ఆదివారం సెమీఫైనల్‌, ఫైనల్‌ మ్యాచ్‌లు జరుగుతాయని ఆర్గనైజింగ్‌ సెక్రటరీ పి.దామోదర్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement