సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): గణేశ నవరాత్ర ఉత్సవాలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో, పర్యావరణహితంగా నిర్వహించేందుకు అన్ని శాఖలూ సమన్వయంతో పని చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) ఎస్.భాస్కర్‌రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. కొవ్వూరు ఆర్‌డీఓ కె.ఆనందరావుతో కలిసి కలెక్టరేట్‌లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 6 వేల నుంచి 7 వేల వరకూ వినాయక విగ్రహాల నిమజ్జనం జరిగే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లూ చేపట్టాలని సూచించారు. వినాయక మండపాలకు సంబంధిత శాఖల నుంచి అవసరమైన అనుమతులు ముందుగానే పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అగ్నిమాపక శాఖ అధికారులు మండపాలను ముందస్తుగా తనిఖీ చేసి భద్రతపై నిర్వాహకులకు అవగాహన కల్పించాలని సూచించారు. మండపాల అలంకరణలో సులభంగా మంటలు వ్యాపించే పదార్థాలను వినియోగించరాదని, విద్యుత్ వైరింగ్‌లో నాణ్యమైన కేబుల్స్ మాత్రమే ఉపయోగించాలని తెలిపారు. డీజేలు, లౌడ్ స్పీకర్ల వినియోగాన్ని నిబంధనల మేరకు నియంత్రించాలని, రాత్రి 10 గంటల తర్వాత ప్రజలకు ఇబ్బంది కలిగించేలా పెద్ద శబ్దాలతో కార్యక్రమాలు నిర్వహించరాదని డీఆర్‌ఓ స్పష్టం చేశారు. సమావేశంలో పాల్గొన్న ఏపీ గణేశ నిమజ్జన కమిటీ జిల్లా యూనిట్ ప్రతినిధులు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే మండపాలు నిమజ్జన ఏర్పాట్ల వివరాలను అధికారులకు అందజేశారు.సమావేశంలో రెవెన్యూ, పోలీస్, దేవదాయ, విద్యుత్, ఇరిగేషన్, అగ్నిమాపక, ఫిషరీస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఎన్‌ఎంఎంఎస్ స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తుల ఆహ్వానం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యా శాఖ అధికారి కె.వాసుదేవరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, మండల పరిషత్ పాఠశాలలు, వనతి సౌకర్యం లేని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులన్నారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3.50 లక్షల్లోపు ఉండాలన్నారు. ఎంపికై న విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకూ నాలుగేళ్లపాటు సంవత్సరానికి రూ.12 వేల చొప్పున ఉపకార వేతనం అందుతుందన్నారు. ఈ పరీక్ష నవంబర్ 15న జరుగుతుందని తెలిపారు. పరీక్ష రుసుముగా ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50 చొప్పున వచ్చే నెల 13లోగా చెల్లించాలన్నారు. దరఖాస్తు చేసుకునే విధానం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉందని తెలిపారు. దరఖాస్తులను అక్టోబర్ 12లోగా సమర్పించాలని సూచించారు. అభ్యర్థులు బీఎస్‌ఈ.ఏపీ.జీఓవీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో పరిశీలించవచ్చని వాసుదేవరావు తెలిపారు.
రీజినల్ ఫోరెన్సిక్
సైన్స్ ల్యాబ్ నేడు ప్రారంభం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జాతీయ రహదారిపై స్థానిక ఏవీ అప్పారావు రోడ్డు సెంటర్‌లోని శ్రీరాంపురం రోడ్డులో నూతనంగా నిర్మించిన రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా శనివారం ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఎస్పీ డి.నరసింహ కిశోర్ శుక్రవారం పర్యవేక్షించారు. ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబలేటరీ తూర్పు గోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పోలవరం జిల్లాల పరిధిలో సేవలు అందించనుంది.
జీజీహెచ్‌లో నేడు
క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ పథకంలో భాగంగా రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రూ.23.75 కోట్లతో నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్‌ను శనివారం వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పిసోఫియా ఆధ్వర్యాన ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు.


