ఫ ఫారం–7 ద్వారా కుయుక్తులు
ఫ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి
అనపర్తి: వైఎస్సార్ సీపీ శ్రేణులు, సానుభూతిపరుల ఓట్లు తొలగించడానికి స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుట్రలకు తెర లేపారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమం ద్వారా ఓట్ల పరిశీలన పూర్తయిన తర్వాత ఫారం–7ను ఆయుధంగా వాడుకుంటూ ఓట్లను తొలగించే కుట్రలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఎలక్షన్ కమిషన్ విజ్ఞప్తి మేరకు గ్రామాలు వదిలి వెళ్లిన వారు, చనిపోయిన వారి వివరాలను కుటుంబ సభ్యులే అందించారని తెలిపారు. అయితే, ప్రభుత్వంపై వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక, వచ్చే ఎన్నికల్లో గట్టెక్కడానికి వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని, వారి ఓట్లను కూటమి నాయకులు తొలగిస్తున్నారని మండిపడ్డారు. అనపర్తి, రామవరం, కుతుకులూరు, మహేంద్రవాడ, పొలమూరు, కొప్పవరం వంటి గ్రామాల్లో అత్యధికంగా ఫైనాన్స్ వ్యాపారం చేసుకునేవారు ఉంటారని, వీరు బతుకుతెరువు కోసం వారానికి ఐదారు రోజులు లేదా నెలలో కొన్ని రోజులు ఇతర ప్రాంతాలకు వెళ్తూంటారని చెప్పారు. వారి కుటుంబాలు ఆ గ్రామాల్లోనే నివాసముంటున్నప్పటికీ, గ్రామంలో ఉండటం లేదనే నెపంతో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు ఫారం–7 ద్వారా ఓట్లు తొలగించాలంటూ ఫిర్యాదులు ఇచ్చారని తెలిపారు. ఈ ఐదారు గ్రామాల్లోనే సుమారు 1,250 ఓట్లు తొలగించాలంటూ దరఖాస్తులు చేశారని, అందులో 40 నుంచి 50 మాత్రమే చనిపోయిన వారివి ఉన్నాయని, మిగిలిన 90 శాతం పైగా ఓట్లు ఫైనాన్స్ వ్యాపారులవేనని వివరించారు. ఇచ్చిన ఫిర్యాదుల్లో కూడా చాలామంది సంతకాలను ఫోర్జరీ చేశారని సూర్యనారాయణరెడ్డి ఆరోపించారు. విషయం తెలుసుకున్న కొందరు తాము సంతకాలు పెట్టలేదని చెప్పడంతో, నిబంధనలకు విరుద్ధంగా గడువు ముగిసిన తర్వాత కూడా అధికారులపై ఒత్తిడి తెచ్చి బల్క్‌గా దరఖాస్తులు ఇచ్చారని తెలిపారు. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి గరిష్టంగా ఐదు ఓట్లపై మాత్రమే ఫిర్యాదు చేసే అవకాశం ఉందని, అయినప్పటికీ 10వ తేదీతో గడువు ముగిసిన తర్వాత 11వ తేదీన కూడా అధికారులపై ఒత్తిడి తెచ్చి ఈ దరఖాస్తులు స్వీకరించేలా చేశారని అన్నారు. రామకృష్ణారెడ్డి ఇటువంటి నీచ రాజకీయాలకు పాల్పడటం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ అక్రమాలపై జిల్లా, రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు వైఎస్సార్ సీపీ తరఫున న్యాయపోరాటం చేస్తామని సూర్యనారాయణరెడ్డి హెచ్చరించారు. అర్హత ఉన్న ఒక్క ఓటు తొలగించినా సహించేది లేదన్నారు. గతంలో ఈవీఎంల సహకారంతో గెలిచారనే విషయం బయట పడటంతో, ఇప్పుడు కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారని, ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా రాబోయే రోజుల్లో ప్రజలే తగిన తీర్పు ఇస్తారని సూర్యనారాయణరెడ్డి అన్నారు.


