డిపాజిట్లు గల్లంతేనా? | - | Sakshi
Sakshi News home page

డిపాజిట్లు గల్లంతేనా?

Sep 10 2026 12:15 AM | Updated on Sep 10 2026 12:15 AM

బియ్యం కమీషన్‌ నిధులు ఇవ్వడమేంటి?

డీసీవో, డీఆర్‌లు వివరణ ఇవ్వాల్సిందే

సూర్యారావుపాలెం పీఏసీఎస్‌లో

చెల్లింపులను అడ్డుకున్న ఖాతాదారులు

నిడదవోలు: ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్‌)లో డిపాజిట్‌దారులకు రూ.93.08 లక్షలు చెల్లించేందుకు అధికారులు బుధవారం చర్యలు చేపట్టారు. తమ డిపాజిట్లపై జిల్లా కో–ఆపరేటివ్‌ అధికారి, డివిజనల్‌ అధికారి సంఘం సభ్యులతో సమావేశమై భరోసా ఇవ్వాలని, అప్పటి వరకు చెల్లింపులు వద్దని సభ్యులు డిమాండ్‌ చేస్తూ ఆ ప్రక్రియను అడ్డుకున్నారు. పీఏసీఎస్‌ చైర్మన్‌ ఆచంట సాయిరాం చెల్లింపు ప్రక్రియపై అధికారులకు ఇచ్చిన లేఖపై కొవ్వూరు డివిజనల్‌ కో ఆపరేటివ్‌ అధికారి ఎం.జగన్నాథరెడ్డి స్పందిస్తూ డీసీసీబీ తణుకు బ్రాంచ్‌లో సొసైటీకి ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, కరెంట్‌ ఖాతాల్లోని మొత్తం రూ.93.08 లక్షలు ఉపసంహరించేందుకు అనుమతి ఇస్తూ ఈ మొత్తాన్ని 180 మంది డిపాజిట్‌దారులకు పంపిణీ చేయాలని ఆదేశించడంతో ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తంచేశారు.

శ్లాబ్‌ల వారీగా చెల్లింపులు

అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ ఆదేశాల మేరకు రూ.45 వేల లోపు డిపాజిట్‌ ఉన్న 48 మందికి పూర్తి మొత్తాన్ని, రూ.లక్షలోపు డిపాజిట్‌ ఉన్న 61 మందికి రూ.40 వేలు, రూ.2 లక్షల లోపు డిపాజిట్‌ ఉన్న 38 మందికి రూ.60 వేలు, రూ.3 లక్షల లోపు డిపాజిట్‌ ఉన్న 8 మందికి రూ.80 వేలు చొప్పున చెల్లించాల్సి ఉంది. రూ.3 లక్షలకు పైగా డిపాజిట్‌ ఉన్న వారికి రూ.లక్ష చొప్పున చెల్లించాలని ఆయన ఆదేశాల్లో పేర్కొన్నారు.

కాగా ఈ పీఏసీఎస్‌ కార్యాలయంలో మంచం వేసుకుని పడుకుని నిరసన చేపట్టిన 75 ఏళ్ల చిట్టూరి నరసింహమూర్తి పేరుతో రూ.5.76 లక్షలు, ఆయన భార్య పేరున రూ.9 లక్షలు ఉన్నాయి. రూ.3 లక్షల పైగా డిపాజిట్‌ చేసిన వారిలో వీరి పేర్లు ఉండడంతో చెరొక రూ.లక్షతో పాటు రూ.55 వేలు అదనంగా చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

శ్లాబ్‌ ఎందుకు..

2019లో సొసైటీలో జరిగిన అవకతవకల సందర్భంగా చెల్లించిన సొమ్ములు పోగా ఇంకా 180 మంది డిపాజిటర్లకు మొత్తం రూ.3,12,59,794 చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం బియ్యం విక్రయించగా వచ్చిన కమీషన్‌ నిధులు రూ.93.08 లక్షలు మొత్తం బకాయిలో 29.77 శాతం అవుతుంది. అంటే డిపాజిట్‌ చేసిన ప్రతి రూ.లక్షకు సుమారు రూ.29,770 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అయితే శాతానికి అనుగుణంగా కాకుండా వివిధ శ్లాబ్‌ల ప్రకారం చెల్లింపులు చేయాలని ఆదేశించడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల అధిక మొత్తంలో డిపాజిట్‌ చేసినవారికి న్యాయం జరగదని వారంటున్నారు.

డీసీఓ, డీఆర్‌ సమాధానం చెప్పాలి

డిపాజిట్‌దారులకు చెల్లింపుల విధానం, సొసైటీ నిబంధనలు, డిపాజిట్‌ సొమ్ముల దుర్వినియోగానికి బాధ్యులపై తీసుకున్న చర్యలపై జిల్లా కోఆపరేటివ్‌ అధికారి, డివిజనల్‌ కోఆపరేటివ్‌ అధికారి సంఘ సభ్యులతో సమావేశం నిర్వహించి స్పష్టత ఇవ్వాలని సభ్యులు డిమాండ్‌ చేశారు. అలాగే బాధ్యులపై తీసుకున్న చర్యలు వెల్లడించే వరకు పంపిణీ నిలిపివేయాలని సొసైటీకి వచ్చిన అసిస్టెంట్‌ రిజిస్ట్రార్లు ఎం.చంద్రశేఖర్‌, బెజవాడ శ్రీనివాసరావులకు సభ్యులు స్పష్టం చేశారు. ప్రస్తుతం రూ.93 లక్షలు చెల్లింపులు సంగతి అంటుంచితే మిగిలిన రూ.2,19,51,780కు ఎవరు బాధ్యత తీసుకుంటారో స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు.

ధాన్యం కొనుగోలు కమీషన్‌తో డిపాజిట్ల చెల్లింపులా..

సొసైటీకి ధాన్యం కొనుగోళ్ల ద్వారా వచ్చిన కమీషన్‌ మొత్తాన్ని డిపాజిట్‌దారులకు చెల్లించడంపై సభ్యులకు అభ్యంతరం లేకపోయినా, సొసైటీ బైలా ప్రకారం ఇటువంటి చెల్లింపులు చట్టబద్ధమేనా అని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇలా చెల్లించిన మాజీ చైర్‌పర్సన్‌ కోటిపల్లి గణపతిపై కొందరు ఫిర్యాదు చేయడంతో ఆయన నేటికీ లీగల్‌ సమస్యలు ఎదుర్కొంటున్నారని వారు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement