కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కుటుంబ కలహాలతో ఇల్లు వదిలి వచ్చి తీవ్ర ఆందోళనతో తిరుగుతున్న వివాహితను మహిళా రక్షక్ పోలీసులు బుధవారం కాపాడారు. ఈ నెల 8న అర్ధరాత్రి రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌న్‌లో ఒంటరిగా, తీవ్ర ఆందోళనతో ఉన్న ఒక మహిళను రైల్వే పోలీసులు గుర్తించి స్థానిక మహిళా రక్షక్ టీమ్‌కు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే అక్కడకు చేరుకుని ఆమెను విచారించగా కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపానికి గురై విజయవాడ వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలిపింది. వారు ఆమెకు మనోధైర్యాన్ని కల్పించి కౌన్సెలింగ్ ఇచ్చి అనంతరం ఆమె భర్తకు సమాచారం ఇచ్చి స్టేషన్‌కు పిలిపించి ఇరువర్గాలతో మాట్లాడి సురక్షితంగా ఇంటికి పంపారు. మహిళకు రక్షణ కల్పించిన మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ డి.శ్రీహరిరాజు, ఇన్‌న్‌స్పెక్టర్ మంగాదేవి, మహిళా రక్షక్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
చిట్టీ కేసులో ఇద్దరికి జైలు శిక్ష
తుని: ప్రజల నుంచి చిట్టీలు కట్టించిన కేసులో ఇద్దరికి స్థానిక న్యాయమూర్తి జైలు శిక్ష విధించారని పట్టణ సీఐ ఎం.గీతా రామకృష్ణ తెలిపారు. బుధవారం ఆయన తెలిపిన వివరాల మేరకు 2018లో చిట్టీ వ్యాపారం చేసిన స్థానిక గవరపేటకు చెందిన తోకల రాజు చిట్ పాటకు సంబంధించి రూ.10 లక్షలను నిర్వాహకులు కొంకిపూడి ప్రభాకర్, కొంకిపూడి అరుణ సకాలంలో చెల్లించ లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఎస్సై స్వామి నాయుడు కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం ఐపీసీ సెక్షన్ 420 కింద వారిని దోషులుగా నిర్ధారించి 3 ఏళ్లు జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి వి.గోపాలకృష్ణ తీర్పు ఇచ్చారని తెలిపారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ కెఎస్‌ఎస్ లక్ష్మీదేవి వాదనలు వినిపించారు.


