సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): శారీరక స్థైర్యం ఉండి చిన్న కష్టాలకే కుంగిపోయే సమాజంలో.. ప్రతి క్షణం నరకయాతన అనుభవిస్తూ, జీవన పోరాటం సాగిస్తున్న దివ్యాంగుల బాధలు వర్ణనాతీతం. అలాంటి వారికీ ప్రభుత్వం సాయం దూరం అవుతోంది. దివ్యాంగులకు రూ.15 వేల పింఛను సాయం అందిస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి, ఇప్పుడు అమలులో మాత్రం అనేక కొర్రెలు పెడుతున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత రూ.6 వేలు మాత్రమే అందించి చేతులెత్తేశారు. దివ్యాంగుల నుంచి ఒత్తిడి రావడంతో జీఓ 43 ద్వారా దరఖాస్తు చేసుకోచ్చని, పరిశీలన తరువాత రూ.15 వేలు ఇస్తామని ప్రకటించారు. దీంతో నిజమని నమ్మి ఆన్‌లైన్ ద్వారా చేసుకుంటున్నారు. కానీ ఇక్కడే అసలు మతలబు ఉంది. ఆన్‌లైన్ చేసుకున్న వారు తిరిగి సదరమ్ సర్టిఫికెట్ చేయించుకోవాలని, రీ వెరిఫికేషన్ చేయించుకోవాలని లింకు పెట్టారు. దాంతో దివ్యాంగులు సదరమ్ సర్టిఫికెట్ కోసం అధికారుల చుట్టూ రోజుల తరబడి తిరుగుతున్నారు. గతంలో 80 శాతం నుంచి 90 శాతం ఉన్నవారికి 50 శాతానికి 60 శాతానికి తగ్గించి సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. దీనితో రూ.15 వేల పింఛన్‌కు అర్హులు కావడం లేదు. తీవ్ర వైకల్యంతో బాధపడుతున్న వారు దరఖాస్తు చేసుకుంటున్నా.. అధికారులు సానుకూలంగా స్పందించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 36,425 మంది దివ్యాంగులు ఉండగా, వారికి రూ.6 వేల చొప్పున పింఛన్ పంపిణీ జరుగుతుంది. ఇందులో 1,096 మందికి రూ.15 వేల పింఛను ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు. లేచి నిలబడలేని స్థితిలో ఉన్న దివ్యాంగులు తమ సహాయకుల మద్దతుతో వీల్ చైర్లపై సోమవారం కలెక్టరేట్‌కు వచ్చారు. రూ.15 వేల పింఛను కోసం నెలల తరబడి అర్జీలు ఇస్తున్నా.. పరిశీలనలో ఉందని, త్వరలో పరిష్కరిస్తామని అధికారులు దాటవేసే సమాధానాలు చెబుతున్నారని వారు ఆరోపించారు. వారి మనోగతం ఇలా..
ఫ సొమ్ము పెంపునకు సవాలక్ష కొర్రీలు
ఫ రూ.15 వేల పింఛను కోసం పాట్లు
ఫ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు
ఆన్‌లైన్‌లో సైట్ లేదు
రూ.15 వేలు పింఛన్ ఇవ్వడానికి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోమన్నారు. రెండేళ్ల నుంచి మూడు సార్లు నమోదు చేసుకున్నాను. సదరమ్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నాను. 90 శాతం అంగవైకల్యం ఉందని సర్టిఫికెట్ ఇచ్చారు. ఇప్పుడు ఆన్‌లైన్‌లో సైట్ కనిపించడం లేదు.
– పిడుగు పద్మ,
రాజమహేంద్రవరం
ఇబ్బందులు పెట్టడం సరికాదు
వికలాంగత్వం 90 శాతం ఉన్నా, 100 శాతం ఉన్నా పెద్ద తేడా ఉండదు. కాని 100 శాతం ఉన్నవారికి మాత్రమే ఇస్తామని చెప్పడం ఎంత వరకు సబబు. మాకు ఇస్తామని చెప్పి ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేయించి, సదరం రీ వెరిఫికేషన్ కూడా చేయించి ఇప్పడు ఇబ్బందులకు గురి చేయడం సరికాదు.
– జుత్తుక దేవి, కపిలేశ్వరపురం
సదరం కోసం కష్టాలు
నాకు 90 శాతం అంగవైకల్యం ఉంది. రూ.15 వేల పింఛన్ కోసం తిరిగి సదరం సర్టిఫికెట్ చేయించుకోవడానికి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే మూడు తిప్పించుకున్నారు. ఆర్థోపెడిక్ విభాగానికి వెళ్లాలంటే రెండు అంతస్తులు మెట్టు ఎక్కాలి. నడవలేని పరిస్థితిలో ఉన్న నేను రెండు మూడు సార్లు మెట్లపై నుంచి పాక్కుంటూ వెళ్లాను. తీరా చేయించుకున్నాక పింఛను ఇవ్వడం లేదు.
– మజ్జి. సతీష్, కడియం
న్యాయం చేయాలి
దివ్యాంగులకు 35 కిలోల బియ్యం ఇస్తారని ప్రభుత్వం ప్రకటిస్తోంది. కానీ క్షేత్ర స్థాయిలో కొంత మందికి మాత్రమే ఆ బియ్యం ఇస్తున్నారు. చాలా మందికి ఇవ్వడం లేదు. అందరికీ వర్తింపజేసి న్యాయం చేయాలి.
– మంజేటీ సుధ,
రాజమహేంద్రవరం:


