నేడు వైఎస్సార్‌ సీపీ జిల్లా సమావేశం | - | Sakshi
Sakshi News home page

నేడు వైఎస్సార్‌ సీపీ జిల్లా సమావేశం

Sep 7 2026 12:15 AM | Updated on Sep 7 2026 12:15 AM

రాజమహేంద్రవరం రూరల్‌: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడంలో భాగంగా సోమవారం బిక్కవోలు మండలం బలభద్రపురంలోని ఎంఎస్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్లో వైఎస్సార్‌ సీపీ జిల్లాస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. దీనికి పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్‌, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్‌ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరుకావాలని వేణు పిలుపునిచ్చారు.

ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌

హాల్ట్‌ పునరుద్ధరణ

నిడదవోలు: స్థానిక రైల్వే జంక్షన్‌లో విశాఖ పట్నం– ముంబయి లోకమాన్య తిలక్‌ టెర్మినల్‌ (ఎల్‌టీటీ) ఎక్స్‌ప్రెస్‌ రైలు హాల్ట్‌ను ఆదివారం అధికారికంగా పునరుద్ధరించారు. నిడదవోలు రైల్వే స్టేషన్‌ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, రైల్వే అధికారులు, ప్రజాప్రతినిధులు కలసి జెండా ఊపి రైలు రాకపోకలను ప్రారంభించారు. స్టేషన్‌ మేనేజర్‌ పి.శ్రీరామరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ టి.కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

కొత్త పింఛన్లకు

దరఖాస్తుల స్వీకరణ

రాజమహేంద్రవరం రూరల్‌: ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌ పథకం కింద కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. దీని కోసం దరఖాస్తు స్వీకరణకు సోమవారం నుంచి 16 వరకు అవకాశం ఉందని, స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారని డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌ బి.నగేష్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపీడీఓలు స్వయంగా పింఛన్‌ మంజూరు చేయరని, అర్హులను మాత్రమే సిఫారసు చేస్తారని అన్నారు. సాధారణ అర్హత పరిశీలన ఈనెల 17 నుంచి 21 వరకు కొనసాగుతుందన్నారు. బడ్జెట్‌ ప్రతిపాదనలు, ప్రభుత్వ అనుమతి ప్రక్రియ ఈ నెల 25 నుంచి 26 వరకు చేపట్టనున్నారు.

లారీ ఢీకొని వ్యక్తి మృతి

చాగల్లు: కొవ్వూరు మండలం ఐ.పంగిడి శివారులో క్వారీ లారీ మోటార్‌ సైకిల్‌ను ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. చాగల్లు మండలం మల్లవరం గ్రామానికి చెందిన ఇడుపుగంటి సుబ్బారావు (54) కొవ్వూరు మండలం దేచర్లలో శ్రీసాయి ట్రేడర్స్‌లో గుమస్తాగా పనిచేస్తున్నాడు. ఇంటికి భోజనానికి వచ్చి తిరిగి వెళుతుండగా, పంగిడి శివారులో క్వారీ లారీ అతివేగంగా వచ్చి సుబ్బారావు మోటార్‌ సైకిల్‌ను ఢీకొనడంతో అతను తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు భార్య శ్వేత ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్టు ఏఎస్సై జె.ధర్మరాజు తెలిపారు.

భక్తులతో కిటకిటలాడిన

గణపతి ఆలయం

అయినవిల్లి: అయినవిల్లిలోని విఘ్నేశ్వరాలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లఘున్యాస, ఏకాదశ పూర్వక అభిషేకాలు, శ్రీలక్ష్మీ గణపతి హోమాలు, అన్నప్రాశనలు, తులాభారాలు, నూతన వాహన పూజలను భక్తులు చేయించుకున్నారు. స్వామివారి అన్నప్రసాదాన్ని 2680 మంది స్వీకరించారు. స్వామికి ఆదివారం ఒక్కరోజు రూ.3,29,751 ఆదాయం లభించిందని ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌, ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement