ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు! | - | Sakshi
Sakshi News home page

ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు!

Sep 7 2026 12:15 AM | Updated on Sep 7 2026 12:15 AM

సీటీఆర్‌ఐ(రాజమహేంద్రవరం): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా నిజంగా తాము యాంటీ సోషల్‌ ఎలిమెంట్స్‌కు పాల్పడి ఉంటే ఈ ప్రభుత్వం ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రశ్నించారు. ఆదివారం స్థానిక ప్రకాశ్‌నగర్‌లోని ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గంజాయి, బ్లేడ్‌ బ్యాచ్‌ అంటూ తప్పుడు కూతలు కూస్తున్న వారు ఆరోపణలకే పరిమితమవుతున్నారన్నారు. నిజంగా బ్లేడ్‌ బ్యాచ్‌, గంజాయి బ్యాచులు మా పార్టీలో ఉన్నారంటూ మాట్లాడుతున్న చెంచా బ్యాచ్‌లకు చేతనైతే ఒకటైన రుజువు చేయండని సవాల్‌ విసిరారు. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చాం. మాకు సహనం ఎక్కువ, ఓపిక ఎక్కువ కదా అని నా తండ్రి, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్‌రావు గురించి మాట్లాడితే సహించేది లేదన్నారు. జక్కంపూడి సోదరులపై, కుటుంబంపైన తప్పుడు ఆరోపణలు చేసే వ్యక్తులకు వడ్డీలు, చక్రవడ్డీలు కలిపి సమాధానం చెబుతామని గుర్తుంచుకోవాలన్నారు. అధికార దుర్వినియోగం చేస్తూ అహంకారంతో తమపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారన్నారు. కేసులకు జక్కంపూడి కుటుంబం భయపడేది లేదని స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం చేసే అరాచకాలను, తప్పులను వేలెత్తి చూపితే కేసులు పెడుతున్నారని విమర్శించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారని నిరాహార దీక్షలు చేస్తే ఆత్మహత్య కేసు నమోదైతే దాన్ని కూడా వక్రీకరించి ఆరోపణలు చేయడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. బర్ల బాబూరావు గురించి అందరికీ తెలుసునని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ కొవ్వూరు నియోజకవర్గ పరిశీలకుడు గొందేసి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement