● మరింత రుచిగా సత్యదేవుని ప్రసాదం
● తయారీ భవనాన్ని విస్తరించేందుకు ప్రణాళిక
● వ్యయాన్ని భరించేందుకు
ముందుకు వచ్చిన దాత
అన్నవరం: అన్నవరం ప్రసాదం.. ఈ పేరు వినగానే ఇష్టపడని వారుండరు. స్వామివారి చెంతకు రాలేకపోయిన వారు సైతం ఈ గోధుమ నూక ప్రసాదాన్ని పవిత్రంగా స్వీకరిస్తారు. దీని నుంచి ఏటా రూ.25 కోట్ల ఆదాయం దేవస్థానానికి సమకూరుతోంది. అటువంటి ప్రసాదాన్ని మరింత రుచిగా, ఎక్కువ మొత్తంలో తయారు చేసేందుకు వీలుగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఆదేశాల మేరకు ఆ శాఖ చీఫ్ ఇంజినీర్ జీవీ శేఖర్, ప్రసాద తయారీ భవనం నిర్మించిన దాత, దేవస్థానం ట్రస్ట్ బోర్డు గౌరవ సలహాదారు మట్టే సత్యప్రసాద్, మరో సలహాదారు ఎంఎస్ రెడ్డి, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తదితరులు ఆదివారం ప్రసాద తయారీ భవనాన్ని పరిశీలించారు. ఈ భవనాన్ని 2022లో రూ.ఐదు కోట్లతో దాత మట్టే సత్యప్రసాద్ నిర్మించిన విషయం తెలిసిందే. దాంతో పాటు గోధుమ నూక తయారీ యంత్రం, ప్రసాదం తయారీకి అవసరమైన అన్ని పరికరాలను ఆయన అందజేశారు. పెద్ద మొత్తంలో ప్రసాద తయారీ, ప్యాకింగ్‌లకు కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ విషయాన్ని దేవస్థానం అధికారులు దాత దృష్టికి తీసుకువెళ్లగా, అవసరమైనంత మేరకు ప్రసాదం విభాగాన్ని విస్తరించేందుకు ఆయన సంసిద్ధత తెలిపారు.
ఇవీ ఇబ్బందులు
ప్రసాద తయారీ భవనం రెండు అంతస్తుల్లో ఉంటుంది. దిగువన యంత్రాలు, మొదటి అంతస్తులో ప్రసాదం తయారీ, ప్యాకింగ్ ఉంటుంది. ప్రసాదం తయారీ పొయ్యిలు 15 ఒకవైపు, దాని తరువాత సుమారు 50 మంది ప్రసాదం ప్యాకర్లు ప్రసాదం పొట్లాలు కడతారు. ఇక్కడ సరైన వెంటిలేషన్ లేక పొయ్యి వేడి ప్రసాదం ప్యాకర్లకు తగులుతోంది. దీంతో వారు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ రోజూ లక్ష ప్రసాదం ప్యాకెట్లు వరకు తయారు చేసే వెసులుబాటు ఉంది. ఇంతకు మించి ప్రసాదం తయారు చేయాలన్నా, ప్యాకింగ్ చేయాలన్నా ఇబ్బంది ఎదురవుతోంది. పొయ్యిలు ఎక్కువ ఏర్పాటు చేయాలంటే స్థలం సరిపోవడం లేదు. ఏడాదిలో సగం రోజులు లక్ష కన్నా ఎక్కువ ప్రసాదం ప్యాకెట్లు తయారు చేయాల్సి ఉంటుంది. ఎక్కువ ప్రసాదం తయారు చేసి భక్తులకు అందించాలనే ఉద్దేశంతో రద్దీ రోజుల్లో ప్రసాదం బాగా ఉడకకుండా దింపేయడం వల్ల రుచిపై భక్తుల నుంచి విమర్శలు వస్తున్నాయి.
భవనం విస్తరణ ఇలా...
కాగా, ప్రస్తుతం ఉన్న ప్రసాద తయారీ భవనాన్ని మరింత విస్తరించాలని ప్రతిపాదించారు. ఇందులో భాగంగా పైఅంతస్తులో అఽధునాతన రేకుల షెడ్డు వేసి అందులోకి ప్రసాదం ప్యాకింగ్ మార్చాలని నిర్ణయించారు. ఆ షెడ్డుకు సీలింగ్ చేసి అవసరమైతే ప్రసాదం ప్యాకర్లు ఇబ్బంది పడకుండా ఏసీలు కూడా అమర్చనున్నారు. ప్రస్తుతం ప్రసాదం తయారు చేస్తున్న హాలులో అదనంగా మరికొన్ని ప్రసాదం తయారీ పొయ్యిలు ఏర్పాటు చేయనున్నారు. తయారైన ప్రసాదాన్ని ట్రాలీల్లోకి మార్చి రెండో అంతస్తులో ఏర్పాటు చేయనున్న ప్రసాదం ప్యాకింగ్ షెడ్డులోకి తరలించేందుకు ఒకటి లేదా రెండు పెద్ద లిఫ్ట్‌లను పెడతారు.


