ఆలమూరు: గ్రామంలో ఒకే రోజు రెండు చోట్ల జరిగిన చోరీల్లో సుమారు రూ.14 లక్షల విలువైన వెండి, బంగారు ఆభరణాలు, నగదు అపహరణకు గురయ్యాయి. ఎస్సై జి.నరేష్ కథనం ప్రకారం.. ఆలమూరులోని మెరక వీధికి చెందిన చిలకమర్తి వెంకట శంకర్ సాయిసుధాకర్ కుటుంబ సభ్యులు శనివారం అర్ధరాత్రి హైదరాబాద్‌కు వెళ్లారు. ఆ ఇంట్లో ఎవరూ లేరని గుర్తించిన దుండుగులు ఆ ఇంటి తలుపులు పగులగొట్టి లోపలకు ప్రవేశించారు. బీరువాలు తెరిచి అందులోని కిలో వెండి, పది కాసుల బంగారు ఆభరణాలు దొంగిలించారు. అలాగే అదేరోజు స్థానిక వాటర్ ట్యాంక్ పక్క వీధిలో నివసిస్తున్న తటవర్తి గోపాలకృష్ణ నివాసంలో కూడా చోరీ జరిగింది. ఈ చోరీలో రూ.30 వేల నగదు, రెండు కాసుల బంగారు ఆభరణాలను తస్కరించారు. అమలాపురం నుంచి ప్రత్యేక క్లూస్ టీమ్ వచ్చి స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలు, సంఘటన స్థలాల్లో సేకరించిన వేలిముద్రలు ఆధారంగా కొన్ని ప్రాథమిక ఆధారాలను సేకరించారు. ఈ మేరకు ఎస్సై నరేష్ కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పద స్థితిలో
వివాహిత మృతి
రంగంపేట: పెదదొడ్డిగుంట గ్రామంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీనిపై రంగంపేట ఎస్సై శివప్రసాద్ కథనం ప్రకారం.. పెదదొడ్డిగుంట గ్రామానికి చెందిన కర్రి సుబ్బారావు పప్పులు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 4న ఉదయం సుమారు 4.30 గంటలకు పప్పులు విక్రయించేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఉదయం 6 గంటల సమయంలో అతని తోడల్లుడు తోట సూర్యబాబు ఫోన్ చేసి, సుబ్బారావు భార్య కర్రి సీత (56) ఇంట్లో నేలపై పడి ఉన్నట్లు సమాచారం అందించాడు. దీంతో సుబ్బారావు వెంటనే ఇంటికి చేరుకుని భార్యను పరిశీలించగా, అప్పటికే మృతి చెందినట్లు గుర్తించాడు. అనంతరం ఆర్‌ఎంపీ వైద్యుడిని పిలిపించి పరీక్షించగా అనారోగ్య కారణాలతో మృతి చెందినట్లు భావిస్తున్నట్లు తెలిపారు. అయితే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో సీత మెడలో ఉండాల్సిన బంగారు మంగళసూత్రం తాడు, నల్లపూసల తాడు కనిపించకపోవడంతో పాటు ఆమె శరీరంపై అక్కడక్కడా గాయాలు ఉన్నట్లు సుబ్బారావు గుర్తించాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


