పొదుపు అంటే ఇదేనా బాబూ? | - | Sakshi
Sakshi News home page

పొదుపు అంటే ఇదేనా బాబూ?

May 24 2026 12:39 AM | Updated on May 24 2026 12:39 AM

ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు

అమలాపురం టౌన్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపు మేరకు ప్రజలు తమ కార్లు, మోటారు సైకిళ్లు వదిలేసి సైకిళ్ల బాట పడుతుంటే, కూటమి ముఖ్య నేతలు మాత్రం ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నారని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు ధ్వజమెత్తారు. ముగ్గురు లేదా నలుగురు పిల్లలను కనండి.. అలా కంటే రూ. 30 వేలు, రూ.40 వేలు ఇస్తానంటున్న చంద్రబాబు సంపద సృష్టి, పొదుపు అంటే ఇదేనా అని ఎమ్మెల్సీ ప్రశ్నించారు. అమలాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ శనివారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఇంధన పొదుపు, సంపద సృష్టి అంటూ ప్రకటనలు చేయడం కాదని, ఆచరణలో తాను చూపించి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని ఎమ్మెల్సీ హితవు పలికారు. ఎక్కువ మంది పిల్లలను కనాలంటున్న చంద్రబాబు అలా పుట్టినప్పుడు రూ. వేలల్లో ఇస్తే సరిపోతుందా..? వారి చదువులు, ఉద్యోగాలు వంటివి గాలికొదిలేస్తారా..? అని తల్లిదండ్రులు ఆందోళనతో ప్రశ్నిస్తున్నారని ఎమ్మెల్సీ గుర్తు చేశారు. రెండేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ఆరోపించారు. ఇచ్చిన హామీలకు వెన్నుపోట్లు పొడవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, మహిళలకు నెల నెలా రూ.1500 ఇలాంటి హామీలకు మంగళం పాడిసినట్లేననిపిస్తోందన్నారు. ప్రభుత్వ విధి విధానాలు అన్నదాతలకు శాపాలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వరి, ఆక్వా రైతులు నేడు గిట్టుబాటు ధర లేక విలవిల్లాడుతున్నారని చెప్పారు. చంద్రబాబు బూటకపు మాటలు నమ్మే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు ఈసారి సిద్ధంగా లేరని ఎమ్మెల్సీ స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement