ఐటీఐల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

ఐటీఐల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

May 20 2026 1:46 AM | Updated on May 20 2026 1:46 AM

రాజమహేంద్రవరం రూరల్‌: టెన్త్‌ పాస్‌, ఇంటర్మీడియెట్‌ ఫెయిల్‌ అయిన అభ్యర్థులకు 2026–27 సంవత్సరానికి జిల్లాలో గల ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో మొదటి విడత అడ్మిషన్ల కోసం దరఖాస్తులు కోరుతున్నారు. ఈ మేరకు రాజమహేంద్రవరం, ధవళేశ్వరం ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్‌ సునీల్‌కుమార్‌ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ ధ్రువపత్రాలతో హెచ్‌టీటీపీఎస్‌://ఐటీఐఏడీఎంఐఎస్‌ఎస్‌ఐఓఎన్‌ఎస్‌.ఏపీ.జివోవి.ఐఎన్‌/ఐటీఐ వెబ్‌సైట్‌ ద్వారా జూన్‌ 30వ తేదీ రాత్రి 11.59 గంటలలోపు దరఖాస్తు చేసుకుని రసీదు పొందాలన్నారు. అభ్యర్థులకు బుధవారం నుంచి జూలై రెండవ తేదీ సాయంత్రం 5.00గంటల వరకు రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఐటీఐలో వెరిఫికేషన్‌ ప్రక్రియ జరుగుతుందన్నారు. అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికేట్స్‌, జత జిరాక్స్‌ కాపీలతో వచ్చి వెరిఫికేషన్‌ చేయించుకుని రశీదు పొందాలన్నారు. వివరాలకు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఐటీఐ కార్యాలయంలో సంప్రదించవచ్చునని తెలిపారు.

యథేచ్ఛగా

నల్లమట్టి తరలింపు

తాళ్లపూడి: మండలంలో మట్టి మాఫియా కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. వేసవికాలంలో ఏటా నల్ల మట్టిని ఇటుకల బట్టీలకు తరలిస్తుంటారు. నిన్న మొన్నటి వరకు ప్రభుత్వ పనులకు మట్టి తొలుతున్నాం అంటూ ఎర్ర మట్టి గ్రావెల్‌ జోరుగా తరలించారు. మండలంలో తాజాగా ఇటుక బట్టీలకు నల్ల మట్టిని తరలించటం ప్రారంభించారు. గోపాలపురం మండలం భీమోలు చెరువులో మట్టి ప్రతి ఏడాది తవ్వి బట్టీలకు తరలిస్తూ వుంటారు. మట్టి తరలించాలంటే కనీస నిబంధనలు పాటించాల్సి ఉండగా, నల్ల మట్టి రవాణా తమ హక్కు అంటూ ఇటుకబట్టీలు యజమానులు రాత్రి పగలు అనే తేడా లేకుండా మట్టి తరలిస్తున్నారు.

గ్రావెల్‌ అక్రమ తవ్వకాలపై

ఆకస్మిక తనిఖీలు

రాజమహేంద్రవరం రూరల్‌: జిల్లా గనులు, భూగర్భ శాఖ అధికారి డి.ఫణి భూషణ్‌రెడ్డి, సిబ్బంది గ్రావెల్‌ అక్రమ తవ్వకాలపై మంగళవారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రాజమహేంద్రవరం రూరల్‌ మండల పరిధిలోని మోరంపూడి(శాటిలైట్‌సిటి) గ్రామంలో అక్రమంగా గ్రావెల్‌ తవ్వకాలు జరుగుతున్నట్లు గుర్తించారు. తవ్వకాలలో వినియోగిస్తున్న పొక్లయినర్‌ను, రవాణాకు వినియోగిస్తున్న రెండు ట్రాక్టర్లను అధికారులు సీజ్‌ చేసి స్థానిక రెవెన్యూ అధికారులకు అప్పగించారు. ఈ తనిఖీలలో రాయల్టీ ఇన్‌స్పెక్టర్‌ డి. జ్యోతిర్మయి, టెక్నికల్‌ అసిస్టెంట్లు పి.శైలజ, కె. మనీషా, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ కే.వి. ప్రసాద్‌ , విఆర్‌వో ఎం. గోపి పాల్గొన్నారు.

మత్తు పదార్థాలతో

అనేక అనర్థాలు

మోతుగూడెం: మత్తు పదార్థాలను వాడడం వల్ల అనేక అనర్థాలు కలుగుతాయని అదనపు పోలీస్‌ సూపరింటెండెంట్‌ హేమంత్‌ అన్నారు. ఆయన ఆధ్వర్యంలో మంగళవారం మోతుగూడెం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని లక్కవరం గ్రామంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో జరిగిన హత్యలు, మద్యం మత్తులో ఆవేశపూరితంగా తీసుకున్న నిర్ణయాల వల్ల వ్యక్తులు, కుటుంబాలు ఎదుర్కొన్న నష్టాలను వివరించారు. ఇటువంటి సంఘటనలు కుటుంబాలను చిన్నాభిన్నం చేసే పరిస్థితులకు దారితీస్తాయన్నారు. గంజాయి, మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలు, సైబర్‌ నేరాలపై జాగ్రత్తలు, మహిళల రక్షణ, భద్రత అంశాలపై అవగాహన కల్పించారు. ప్రజలు చట్టాలను గౌరవిస్తూ శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడంలో పోలీసులకు సహకరించాలని కోరారు. సమావేశంలో సుమారు 150 మంది గ్రామస్తులతో పాటు చింతూరు సీఐ గోపాలకృష్ణ, మోతుగూడెం ఎస్‌ఐ అబ్దుల్‌ నసీర్‌ హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement