హోమ్‌ స్టేటస్‌! | - | Sakshi
Sakshi News home page

హోమ్‌ స్టేటస్‌!

May 13 2026 12:26 AM | Updated on May 13 2026 12:26 AM

పేరు.. రూపు మార్చుకున్న విడిదిళ్లు

వేడుక ఏదైనా అవసరాల మేరకు వసతులు

విలాసవంతంగా తీర్చిదిద్దుతున్న

నిర్వాహకులు

అద్దె సైతం అదే స్థాయిలో వసూలు

పల్లెలకూ విస్తరిస్తున్న కొత్త ఒరవడి

రాయవరం: వివాహ వేడుకలో విడిదింటిది ఓ ప్రధాన భూమిక. ఏ మాత్రం తేడా వచ్చినా.. ఏ లోపం కనపడినా మొదటి పేచీ మొదలయ్యేది అక్కడే. సహజంగా ఆడపెళ్లివారింటే వివాహాలు జరుగుతాయి. ఆచార వ్యవహారాలను బట్టి కొన్ని రోజుల ముందు నుంచే మగ పెళ్లివారి కోసం వివాహ వేదికకు సమీపంలోనే విడిదింటిని ఏర్పాటు చేస్తారు. ఎన్నో ఆపసోపాలు.. వ్యయ ప్రయాసలకోర్చి మందీ మార్బలంతో వచ్చే వారు రావడంతోనే ప్రయాణ బడలిక తీర్చుకోవడానికి అలా ఓ కుర్చీలో వాలిపోవాలని చూస్తారు. ఆ సమయంలో పెద్దలు ఏదో సరిపెట్టుకున్నా కొందరు అది బాలేదు.. ఇది బాలేదు అంటూ రాగాలు తీస్తుంటారు. ఇటువంటి పరిస్థితులు నేడు అంతగా లేకపోయినా వేడుక ఏదైనా సకల సౌకర్యాలతో అద్దెకు ఇచ్చే విడిదిళ్లు చాలానే అందుబాటులో ఉన్నాయి. వీటినే ఇప్పుడు పేరు మార్చి ఇంగ్లిష్‌లో హోమ్‌ స్టేగా పిలుస్తున్నారు. గ్రామాల్లో సైతం లగ్జరీ రూమ్స్‌, వంద మందికి సరిపడా మిని బ్యాంకెట్‌ హాల్‌, పార్టీ హోమ్‌ థియేటర్‌ ఇలా ఎన్నో అందుబాటులో ఉన్నాయి.

కార్పొరేట్‌ కంపెనీల సమావేశాలు, గెట్‌ టుగెదర్లు, పుట్టిన రోజు, వివాహ నిశ్చయ తాంబూలం, లగ్న పత్రిక రాసుకోవడం ఇలా దేనికై నా హోమ్‌ స్టేలు సిద్ధంగా ఉంటున్నాయి. ఇటీవలి కాలంలో అన్నీ ఏసీ కల్యాణ మండపాలుగా మారిపోవడంతో అద్దె, నిర్వహణ, విద్యుత్‌ బిల్లు వంటి ఖర్చులు మొత్తంగా రూ.లక్ష పైనే అవుతోంది. అంత పెద్ద మొత్తం వృథా అనుకునే వాళ్లు ఈ హోం స్టేలను బుక్‌ చేసుకుంటున్నారు.

అందుబాటు ధరల్లో

రూ.10 వేల నుంచి రూ.30 వేల మధ్యలో సకల సదుపాయాలతో ఇటువంటి హోమ్‌స్టేలు లభిస్తున్నాయి. వీటికి డిమాండ్‌ బాగా ఉండడంతో ఇటీవల కాలంలో పట్టణాలతో పాటుగా, పల్లెల్లోనూ ఈ హోమ్‌ స్టేలు సులువుగానే దొరుకుతున్నాయి. సహజంగా దూర ప్రాంతం నుంచి వచ్చిన వారు కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు మంచి సౌకర్యాలతో నాలుగు నుంచి ఆరు లగ్జరీ డబుల్‌ బెడ్‌ రూంలు అందుబాటులో ఉంచుతున్నారు. మినీ హాల్స్‌లో 50 నుంచి 100 మంది వరకు కూర్చునే ఏర్పాట్లు చేస్తున్నారు.

విలాసవంతమైన సదుపాయాలతో

ఆధునిక సాంకేతిక కిచెన్‌, లాండ్రి, డైనింగ్‌ హాల్‌ వంటి సదుపాయాలు వీటిలో అందుబాటులో ఉంచుతున్నారు. పచ్చని సోయగాలతో ఆహ్లాదం పంచడానికి ఓపెన్‌ టెర్రస్‌, స్కై లాంజ్‌ను కూడా సిద్ధం చేస్తున్నారు. వీటి వద్ద ఫొటో షూట్స్‌కు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటువంటి హోం స్టేలు పలు గ్రామాల్లో అందుబాటులోకి తెస్తున్నారు. అలానే డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ కూడా చేసుకోవచ్చు. కొన్ని విడిదిళ్లలో మినీ స్విమింగ్‌ పూల్స్‌ కూడా ఏర్పాటు చేస్తూ పార్టీలను ఆకట్టుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement