ఆట పాటలు, చిత్రలేఖన పోటీలు, వ్యాయామ శిక్షణతో సమయం సద్వినియోగం
కొత్తపేట: విద్యార్థులు వేసవి సెలవులను సెల్‌ఫోన్లు, టీవీలతో వృథా చేయకుండా వేసవి శిక్షణ తరగతులు వారికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ఈ మేరకు స్థానిక గ్రంథాలయంలో లైబ్రేరియన్ సునీత ఆధ్వర్యంలో గత నెల 28 నుంచి వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులు, విశ్రాంత ఉపాధ్యాయులు, పీఈటీలు, కవులు, కళాకారులతో బాలలకు నీతి కథలు చెప్పించడం, చదివించడం, చిత్రలేఖనం, క్రాఫ్ట్, ఆటలు, పాటలు, స్పోకెన్ ఇంగ్లిషు, వ్యాయామం, యోగా తదితర అంశాలపై శిక్షణ, పోటీలు నిర్వహిస్తున్నారు. సోమవారం విశ్రాంత పీఈటీ, సత్యసాయి సేవా సమితి సభ్యుడు మారిశెట్టి సత్యనారాయణ బాలలకు వ్యాయామం, యోగా శిక్షణ ఇచ్చారు. ఆధ్యాత్మిక అంశాలపై అవగాహన కల్పించారు. విశ్రాంత ఎంఈఓ, పూర్వ తాలూకా పెన్షనర్ల సంఘం ప్రధాన కార్యదర్శి ఏడిద సత్తిరాజు చదరంగం (చెస్) పట్ల అవగాహన కల్పించారు.


