అమలాపురం టౌన్: ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం 30వ రాష్ట్ర మహా సభలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక గంగరాజు ఫంక్షన్ హాలులో జరిగిన సభల్లో ఈ మేరకు 14 తీర్మానాలు ఆమోదించారు. కార్మిక నేత కేతా సూర్యారావు వ్యవసాయ కార్మిక జెండాను ఆవిష్కరించి అనంతరం అమర వీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు అధ్యక్షోపన్యాసం చేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు అధ్యక్షతన జరిగిన సభల్లో కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, అఖిల భారత సహాయ కార్యదర్శి విక్రమ్ సింగ్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్నారు. రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.లోకనాథం, కారెం వెంకటేశ్వరరావు, సంఘం రాష్ట్రం మహిళా కన్వీనర్ వి.రాణి తదితరులు ప్రసంగించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను దుయ్యబట్టారు.


