అమలాపురం రూరల్: దుబాయ్, మస్కట్ దేశాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ముగ్గురు కోనసీమ వాసులను కేసీఎం అధికారులు క్షేమంగా వారి ఇళ్లకు చేర్చారు. అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు గ్రామానికి చెందిన కే.ఆదిలక్ష్మి, అమలాపురం మండలం సవరప్పాలెం గ్రామానికి చెందిన ఎం.మావుళ్లు, కే.శివకృష్ణలను కలెక్టర్ చొరవతో సురక్షితంగా కోనసీమకు రప్పించారు. వివిధ కారణాలతో అక్కడకు వెళ్లిన ఆదిలక్ష్మి ఆరోగ్యం పాడై, మావుళ్లు, శివకృష్ణ ఏజెంట్ మోసాలకు గురై శ్రమతో కూడిన పనులు చేయలేక అవస్థలు పడ్డారు. వారి కుటుంబ సభ్యుల ఫిర్యాదుల మేరకు కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ అధికారులు వారిని స్వగ్రామాలకు తీసుకువచ్చారు.
జగ్గంపేట హత్య కేసు
రాజానగరానికి బదిలీ
రాజానగరం: కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం వద్ద జరిగిన హత్య కేసును రాజానగరం పోలీసు స్టేషనుకు బదిలీ అయినట్టు సీఐ వీరయ్యగౌడ్ మంగళవారం ఇక్కడ మీడియాకు తెలిపారు. కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన ఈ హత్యపై మృతుడు రావుల సత్తిబాబు సోదరుడు రావుల వీరబాబు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. సత్తిబాబు దంపతుల మధ్య విభేదాలు రావడం, భార్య పుట్టింటిలో ఉండటం, హత్య జరిగిన ముందు రోజు ఆమెతో మాట్లాడి వస్తానని మృతుడు ఇంటిలో చెప్పడం, ఆ తరువాత హత్యకు గురికావడం వంటి వాటిపై ఫిర్యాదుదారు వెలిబుచ్చిన అనుమానాలను పరిగణలోకి తీసుకుని, వాస్తవాలను వెలికితీసేందుకు కేసును లోతుగా పరిశీలిస్తున్నామన్నారు.


